Friday 29 June 2012

కాఫ్కా - శ్రీశ్రీ

    


వింత జంతువు 

మూలం: ఫ్రాంజ్ కాఫ్కా

అనువాదం: మహాకవి శ్రీశ్రీ  




నా దగ్గర ఒక వింత జంతువుంది. సగం పిల్లి, సగం గొర్రె, చచ్చిపోతూ మా నాన్న వదిలిన ఆస్తి.  

అయితే దాని ప్రస్తుత  రూపం నా కాలం లోనే  ఏర్పడింది. అంతకుపూర్వం అది పిల్లిగాకాక 

చాలామట్టుకు గొర్రెగానే  ఉండేది. పిల్లిజాతి నుండి   తలా, గోళ్ళూ గొర్రె జాతినుండి ఒడ్డూ, 

పొడుగూ,  ఆకారమూ దానికి సంక్రమించాయి.  రెండిటినుంచీ కళ్ళు భీకరంగా, ఎప్పటి

కప్పుడు మారిపోతూ, బొచ్చు మెత్తగా, చర్మానికి దగ్గరగా గమనం  దాట్లు వెయ్యడం, ప్రాకడం, 

కిటికీమీద ఎండలో కూర్చుని అది బంతిలాగ ముడుచుకుపోయి గుర్రు పెడుతుంది.  పచ్చిక 

బయలులో పిచ్చెత్తినట్టు గంతులు వేస్తూ ఒకంతకీ దొరకదు. పిల్లలనుచూస్తే పారిపోతుంది;

గొర్రెల మీద తిరగబడుతుంది. వెన్నెల రాత్రులలో ఇంటి పైకప్పు మీద  సంచరించడం దానికి

 సరదా.   అది మ్యావు మననే లేదు. ఎలకలంటే అసహ్యం. కోళ్ళ   తట్ట దగ్గర గంటలకొద్దీ

 మాటు వేస్తుంది. కాని యెప్పుడు   ఒక్క కోడిని కూడా చంపలేదు. 


దానికి నేను పాలుపోస్తూ ఉంటాను. క్రూరమృగం వలె దంతాల సందులనుంచి పెద్ద పెద్ద పీల్పులతో 

పాలు తాగుతుంది. అదంటే   చిన్నపిల్లల కందరికీ గొప్ప వేడుక అని వేరే చెప్పనక్కరలేదు. 

ఆదివారం అందరూ వచ్చేపూట మోకాళ్ళ మీద ఆ జంతువును పెట్టుకుని  కూర్చుంటాను.

 గ్రామం లోని పిల్లలందరూ నా చుట్టూ   నిలుచుంటారు.  పిల్లలంతా వింత వింత వింత ప్రశ్నలు 

వేస్తారు. మానవ మాత్రులెవ్వరూ   వాటికి జవాబులు చెప్పలేరు. ప్రపంచం లో  ఇలాంటి

 జంతువు ఒక్కటే ఎందుకుండాలి? ఇది చచ్చిపోతే   ఏమవుతుంది? దీనికి ఒంటరితనం   అనిపించదా? 

పిల్లల్నెందుకు పెట్టలేదు? దీని పేరేమిటి? ఇట్టివే ఎన్నో ప్రశ్నలు.



జవాబు లివ్వడానికి నేను ప్రయత్నించను. జంతువును ఒళ్ళో పెట్టుకుని అలాగే కూర్చుంటాను. 

పిల్ల లొక్కొక్కప్పుడు తమతో పిల్లులను  తెస్తారు. ఒకసారి రెండు గొర్రెల్ని కూడా తెచ్చారు. కాని   

వారనుకున్నదానికి   విరుద్ధంగా నా జంతువు బంధువులను గుర్తించలేక పోయింది.  జంతువులు 

తమ మృగాల కళ్ళతో పరస్పరం  తేరిపార చూసుకున్నాయి. ఎవరి బతుకు వాళ్ళదే అనుకున్నాయి. 

నా వొళ్ళో కూర్చున్నప్పుడు జంతువుకి భయం గాని, వేటాడే ఉత్సాహం గాని ఉండవు. నన్ను    అదుము

కున్నప్పుడు దానికెక్కడలేని సంతోషమూ వస్తుంది. తాను  ఎవరిమధ్య పెరిగిందో ఆ కుటుంబం పట్ల   

ఎప్పుడూ విశ్వాసం గా ఉంటుంది. ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు.  లోకం  లో తనకు సవతి బంధువు

లెవరూ   లేకపోవటం వల్ల ఈ జంతువు మా ఇంటినే కనిపెట్టుకొని ఉంటుంది.ఇక్కడ  దానికి దొరికిన 

  ఆశ్రయాన్ని పవిత్రంగా   చూసుకొంటుంది.



ఒక్కొకప్పుడీ జంతువు నా చుట్టూ చూస్తూ నా కాళ్ళని చుట్టుకుంటూ ఎప్పటికీ నన్ను వదలకపోతే నవ్వక

తప్పేది కాదు. గొర్రెగానూ,  పిల్లిగానూ ఉన్నది చాలక కుక్కగా కూడా ఉండాలనుకుంటుంది. అందరివలెనే

నాకు కూడా  అప్పుడప్పుడు వ్యవహారపు చిక్కులు తటస్థపడి,  ఏమవుతుందో ఏమిటో అనే ఆందోళనలో

 నేను పడిపోయి  అప్పటికీ తెగించుకొని వాలుకుర్చీలో కూర్చున్న సమయం లో ఈ జంతువు నా

వొళ్ళోనే వుంటుంది. దానివైపు చూస్తే పొడుగాటి దాని మీసాల నుంచి కన్నీళ్ళు నావా? దానివా? 

నిజంగా ఈ పిల్లికి గొర్రెల ఆత్మతోపాటు మనుష్యుల ఆశయాలు కూడా ఉన్నాయేమో? మా నాన్న 

నాకు వదలిపెట్టిన ఆస్తి స్వల్పమేగాని ఈ ఆస్తి  అంత కొట్టివేయదగ్గది కాదు.



గొర్రెల్లోనూ, పిల్లుల్లోనూ కనబడే ఆరాటం, వేరు వేరు రకాలదే అయినా ఈ జంతువులలోనూ ఉంది. 

అందుచేత దీని  చర్మం దీనికి  చాలనట్లుంటుంది. ఒక్కొక్కప్పుడీ జంతువు నా పక్కని కుర్చీ మీదికి

 ఉరికి, తన ముందుకాళ్ళు నా  భుజాలమీద వేసి నా చెవి దగ్గర తన   ముట్టె చేర్చుతుంది - అచ్చంగా

 నాతో ఏదో ఏవో మాట్లాడ దలచుకున్నట్టే  నిజంగా ఆ తరువాత తన తల తిప్పి నా మొగం వైపు   

చూస్తుంది. తాను చెప్పింది నేను బోధపరచుకొన్నానో లేదో  చూడడానికి, దాన్ని సంతోషపెట్టడానికి 

గాను నేను కూడా అర్థమయిందన్నట్లుగా నటించి తల ఆడిస్తాను. అప్పుడది నేలమీది కురికి 

సరదాగా ఇల్లంతా నాట్యం చేస్తుంది.



బహుశా ఈ జంతువుకి కసాయివాడి కత్తివల్ల విముక్తి కలుగుతుందేమో! కాని ఇది నా పూర్వుల ఆస్తి 

కాబట్టి ఇట్టి  పని చెయ్యకూడదు.   అంచేత దానంత అదే ఊపిరి వదిలి వేసే అదను వచ్చేదాకా

 వేచుకొని ఉండవలసిందే. అయినా  అప్పుడప్పుడీ జంతువు మనుష్యజ్ఞానం తో   నావైపు చూసి 

ఇద్దరం ఒకేసారిగా దేన్ని గురించి ఆలోచిస్తున్నామో  యేదీ ఆ పని చేసి చూడు అన్నట్టుగా మొగం

 పెడుతోంది.     



1 comment: