Saturday 23 June 2012

వేస్ట్ ల్యాండ్ - 7







వేస్ట్ ల్యాండ్ - 7





చవిటిపర్ర


టి.యస్.ఎలియట్


5


ఏమన్నది ఉరుము?




చెమటలు కారుతూన్న ముఖాలమీద ఎర్రని కాగడాల వెలుగుల తరువాత 

తోటలనిండా మంచులా ఘనీభవించిన మౌనం తరువాత 

రాతి మైదానాల నిండా పరివ్యాప్తమయిన ఆవేదన తరువాత

కేకలు పెడబొబ్బలు ఆర్తరావాలు ఆర్తనాదాలు కారాగారాలు భవంతులు 

దూరంగా కొండలమీద వసంతమేఘ గర్జనల ప్రతిధ్వనుల తరువాత 

బతికివున్నవాడు ఇప్పుడు చచ్చిపోయాడు 

అపుడెపుడో బతికివున్న మనం ఇపుడు చస్తూనే వున్నాం 

కాకుంటే కాసింత సహనం తో  


ఇక్కడ నీళ్ళు లేవు కేవలం గండశిలలు

గండశిలలే గాని నీళ్ళు లేవు ఇసుకదారి 

రాళ్ళు తప్ప నీళ్ళు లేని కొండల్ని చుడుతూన్న దారి

నీళ్ళే గనక వుంటే అక్కడ మనం తప్పక ఆగుతాం తాగుతాం

ఎవడయినా సరే రాళ్ళ మధ్య ఆగలేడు ఆలోచన చేయలేడు 

ఆరిన చెమటా ఇసుకలో పాదాలు

ఈ రాళ్ళ మధ్య నిజంగా వుండుంటే గనక నీళ్ళు 

ఉమ్మలేదు నిష్ప్రాణపు పళ్ళులేని పర్వతాల బోసినోరు

నుంచోలేరు నడుం వాల్చలేరు కూర్చోలేరు ఎవరూ ఇక్కడ 

కనీసం ఈ కొండల్లో కనిపించదు నిశ్శబ్దపు జాడ 

గర్జించే గొడ్డుబోతు మబ్బుదప్ప వాన లేదు 

ఏకాంతానికయిన ఈ కొండల్లో ఏమాత్రం తావు లేదు 

తపిస్తూ దహిస్తూ గుర్రుమంటూ వెక్కిరిస్తూ 

నెర్రెలిచ్చే ఇళ్ళ తలుపుల్లోంచి తొంగిచూసే వదనాలు


అక్కడ అదే గనక 

రాళ్ళ బదులు నీళ్ళుంటే 

అదే గనక అక్కడ 

రాళ్ళుండీ నీళ్ళుంటే 

నీళ్ళు

ఒక చల్లని చెలిమ

రాళ్ళమధ్య ఒక్క నీళ్ళ కొలను

కేవలం ఒకేఒక్క సెలయేటి గలగల

కిర్రుమనే కీటక శబ్దాలు వద్దు

ఎండిన గడ్డిపరకల గరగరలు వద్దు

కేవలం రాళ్ళమీంచి జారిపడే జలపాతం ధ్వనిలాగా 

పరిత్యాగి పక్షి ఒకటి అందుకుంటుంది పాట 

డ్రిప్ డ్రాప్ డ్రిప్ డ్రాప్ డ్రాప్ డ్రాప్ డ్రాప్ 

అవును సరే మరి నీళ్ళేవీ?



నిరంతరం నీడలా నీ వెంట నడిచే ఆ మూడోవాడు ఎవడు?

లెక్క చూస్తే ఇద్దరం, ఒకటి నువ్వు రెండు నేను

కానీ, తెల్లని ఈ రోడ్డు మీంచి చూపు పైకి చాపిన ప్రతిసారీ 

నీ పక్కనే నిరంతరం నడుస్తూన్న మరో మనిషి

అలికిడిలేని అడుగులు జేగురు రంగు ముసుగులో 

అంతు పట్టదు ఎంతకీ మగవాడో మరి ఆడదో?

ఉన్నది నీకావలివైపున ఇంతకీ ఎవరు చెప్పు?

గాలిమీంచి వినిపించే ఈ శబ్దం ఏమిటి?

ఇది ఎవరో ఒక మాతృమూర్తి విషాద రోదన గీతం 

చూపులు సారించినంతమేరా వ్యాపించిన మైదానాల్లోంచి 

నెర్రెలిచ్చిన నేలమీద ఎదురుదెబ్బల ఊదారంగు గాయాల్తో 

గుంపులు గుంపులుగా ముసుగులు ధరించి వస్తూన్న వీళ్ళంతా ఎవరు?


ఇంతకీ కొండల కవతలి వొడ్డునవున్న ఈ నగరం పేరేమిటి?

పగుళ్ళు, మరమ్మతులు, వయొలెట్ వాతావరణపు విస్ఫోటనాలు

కూలుతూన్న శిఖరాలు

జెరూసలేం ఏథెన్స్ అలెగ్జాండ్రియా

వియన్నా లండన్

సమస్తం అవాస్తవం 



నిడుపాటి నల్లని కురుల్ని తంత్రుల్లా సవరించి బిగించి 

గుసగుసల సంగీతాన్ని శృతి చేస్తున్నది ఒక ఆడది

అరుస్తూ, రెక్కలు అల్లార్చుతూ 

వయొలెట్ కాంతిలో గబ్బిలాలు పసిపిల్లల ముఖాల్లా 

మసిబారిన గోడమీద తలకిందులుగా పాకుతున్నాయి కిందికి 

గాల్లో అధోముఖంగా శిఖరాలు

కాలాన్ని సూచిస్తూ గడిచిన దినాల తలపోతల్ని 

గుర్తుకుతెచ్చే గంటల మోతలు

శూన్యపు జలాశయాలు,బొంద బావుల్లోంచి వినిపించే స్వరాలు



పర్వతాల మధ్య శిధిలమయిన గుహలోపల 

మసక వెన్నెల వెలుగులో చెల్లాచెదురయిన సమాధులమీంచి

ప్రార్ధనాలయం గురించి సరసరసరమని రెల్లుపాట 

శూన్య శిధిలాలయపు గాలికి అది నివాసస్థలం 

కిటికీలనేవి లేవు కేవలమొక వూగాడే ద్వారం

పొడిబారిన ఎముకలు ఎవరికీ హానిని కలిగించవు 

పైకప్పు నిట్టాడి మీద మెరుపు వెలుగులో ఒకేఒక్క కోడిపుంజు

కొక్కొరోక్కో కొక్కొరోక్కో

పిడుగుపాటు మెరుపు వెలుగు

తేమనిండిన గాలి తెమ్మెరలోంచి

వాన

ఎండిపోయింది గంగ

వాన కోసం ఎదురుచూపు జీవం లేని ఆకులు

సుదూరాన హిమగిరి పర్వత శిఖరం మీద 

కమ్ముకుంటూన్న కారుమేఘాలు

మౌనం లోకి ముడుచుకుంది మొత్తంగా అడవి

ఉరుము అన్నది

ద.

దత్త: ఇచ్చిందేముంది మనం?

మితృడా, నెత్తురు విసిరేస్తోంది నా హృదయాన్ని 

సమస్త జీవిత వివేక సంపద సయితం ఆపజాలని 

ప్రళయాంతకమైన సాహసం, లిప్తపాటు లొంగుబాటు 

దీనిమీదనే కేవలం దీనిమీదనే ఆగివుంది మన అస్తిత్వం 

మన గురించిన శ్రద్ధాంజలుల్లో ఎక్కడా దీని జాడ కనిపించదు

సాలీడు దయతో అల్లిన గ్నాపకాల గూట్లోనూ ఇది లభించదు

శూన్యం నిండిన మన గదుల్లో వకీలు గుమాస్తా 

పగులగొట్టే సీళ్ళ వీలునామా పత్రాల్లోనూ ఇది ప్రతిఫలించదు

ద. 

దయాధ్వం: నేను విన్నాను తాళం చెవిని

ద్వరం లో తిరిగిందది ఒక్కసారి,కేవలం ఒకే ఒక్కసారి

ప్రతి ఒకరూ తన చెరలో ఆలోచన తన తాళం చెవిలో 

ప్రతి ఒకరీ చెర ఖరారు తన తాళం చెవి భావనలో 

రాత్రిపూట మాత్రమే చవకబారు హత్యల పుకార్లు

విరిగిన కొరియొలేనస్ శిల్పం మనసుకు గడియసేపు మేలుకొలుపు

ద.

దమ్యత: ప్రతిస్పందించింది పడవ 

పరవశం తో,తెరచాపా తెడ్లతో తరగని అనుబంధమున్న 

అనుభవశాలి చేతి స్పర్శతో 

ప్రశాంతంగా వుంది సముద్రం

నీ హృదయమయినా అంతే 

అదుపు చేయగల చేతుల్లో పడితే 

పరవశించిపోతుంది పడవలాగే


చేపలు పడుతూ తీరం లో నేను

విస్తరిస్తూన్న ఊసరక్షేత్రం నా వెనకాతల 

సరిచేసుకోనా కనీసం నా నేలల్నయినా?



కూలిపోతోంది కూలిపోతోంది కూలిపోతోంది లండన్ బ్రిడ్జి

" సమయానికి గుర్తుకు తెచ్చుకోనా నా వ్యధ" 

అని పునీతం చేసే మంటలో పడిపోయాడతను మళ్ళీ

'ఇంతకీ నేను ఎప్పుడవుతాను వానకోకిల ని '

వానకోకిలా! ఓ వానకోకిలా!!

ప్రిన్స్ ఆక్విటీన్,అతని కూలుతూన్న కోటగోడ

ఇవి నా శిధిలాల నుంచి నేను కాపాడుకున్న శకలాలు

నిజమేనేమో నటన!

హేరోనిమోకి పిచ్చెక్కింది మళ్ళీ

దత్త.దయాధ్వం. దమ్యత.

శాంతి శాంతి శాంతి






సమాప్తం 



  

No comments:

Post a Comment