Wednesday 20 June 2012

ఎలియట్ వేస్ట్ ల్యాండ్ - 4


ఎలియట్ వేస్ట్ ల్యాండ్ - 4




చవిటిపర్ర 

టి.యస్. ఎలియట్ 



అగ్ని ప్రవచనం 


పగిలిపోయింది నదీ గుడారం 

తడిసిన తీరపు టిసుకలో 

పాతుకుపోయిన ఆకుల ఆఖరి వేళ్ళు 

జేగురు మైదానం మీంచి మౌనంగా వీస్తున్నది గాలి 

అప్సరసలంతా వెళ్ళిపోయారు  


మధురమైన నా టేమ్స్ నదీ! ప్రవహించు మంద్రంగా 

నా పాట ముగిసే దాకా 


ఖాళీ సీసాలు లేవు సిల్కు రుమాళ్ళు లేవు అట్టపెట్టె ల్లేవు 

వేసవి రాత్రుల ఆనవాళ్ళు నదీ తీరం లో ఎక్కడా అసలు లేనే లేవు 

నదీకన్యలంతా వెళ్ళిపోయారు 

వాళ్ళ సావాసగాళ్ళూ , ధనిక నగరవాసుల ఆవారా వారసులూ 

ఎలాంటి ఆధారాలూ మిగల్చకుండా అంతా వెళ్ళిపోయారు 


లెమన్ సరస్తీరాన కూర్చుని రోదిస్తూ నేను 

మధురమైన నా టేమ్స్ నదీ ప్రవహించు మంద్రంగా 

నా పాట ముగిసేదాకా 

ప్రియమైన నా టేమ్స్ నదీ  ప్రవహించు మంద్రంగా 

స్వరం పెంచను సుదీర్ఘ సంభాషణం చేయను 


కానీ నా వెనుక ఓ ప్రచండ శీతల ఝం ఝా మారుతం 


వింటున్నాను విరిగిపోతూన్న ఎముకల పటపట ల విశాలపు 

నవ్వుల గలగలల్ని 


ఓ శీతాకాలపు సాయం సమయం 

గ్యాస్ హౌస్ వెనకాతల నీరసంగా ప్రవహించే కాలువలో చేపలు పడుతూ 

రాజు, నా సోదరుల నౌకాభంగం 

అంతకుముందే అస్తమించిన మహారాజు నా తండ్రిగారి గురించి ఆలోచిస్తున్నప్పుడు 

బురద బురదయిన ఒక ఎలుక తన ఉదరాన్ని యీడ్చుకొంటో 

ఒడ్డుమీది గడ్డిలో, పక్కనవున్న అడివిలోకి పోతోంది పాక్కుంటూ 

తడిచిన పల్లపు చిత్తడి నేలమీద తెల్లని నగ్న శరీరాలు 

పొట్టి గోడల చూరుల్లో పోగులు పడిన ఎముకలు 

ఉరుకులు పరుగులు తీసే ఎలుకలు తప్ప 

యేళ్ళు  గడిచిపోతున్నా పాదం మోపరు ఎవరూ 


కానీ వింటున్నాను నేను 

నా వెనుకనించి 

స్వీనీని వసంతం లో శ్రీమతి పోర్టర్ దరిచేర్చే 

హారన్లు, మోటారు కార్ల పిలుపులు 

అహో! శ్రీమతి పోర్టర్ మీదా ఆమె కుమార్తె మీదా 

చంద్రుడు చిందే వెన్నెల కాంతులు !

సోడా నీళ్ళతో వాళ్ళు కడుక్కుంటారు కాళ్ళు 

చర్చి గుమ్మటం లోంచి పిల్లల పాటలు 

మరీ అంత పచ్చి మొరటు అఘాయిత్యమా !

టెరియూ!!


అవాస్తవ నగరం 

జేగురు కావురు కమ్మిన చలికాలపు మధ్యాహ్నం 

పెరిగిన గడ్డం తో  స్మిర్నా వ్యాపారి యూజీనిడ్స్ 

కిస్మిస్ నిండిన జేబులు 

బిల్లులు, సరుకుల ధరలు, ఇన్స్యూరెన్స్ , నౌకాయానాల రశీదులు 

రకరకాల కాగితాలు కళ్ళముందు వుంచి 

కేనన్ స్ట్రీట్ హోటల్ లో లంచ్ 

మెట్రోపోల్ లో వీకెండ్ కి 

ఆహ్వానించాడు నన్ను నాసిరకం ఫ్రెంచి లో 


సాయంకాలపు  ఊదా రంగు ఘడియలు 

డెస్క్ మీంచి చూపులు పైకి లేచే వేళ 

ఆడుతూన్న ఇంజన్ తో ఎదురు చూస్తూన్న ట్యాక్సీ మానవ యంత్రం 


నేను అంధ టైరీషియస్ ని 

రెండు నిండు జీవన సంస్పందనల్ని సంతరించుకున్న వాణ్ని 

ముడుతలు పడి  వేలాడే ఆడదాని 

రొమ్ములు గలవాణ్ని, ముసలివాణ్ణి 

అయినా వీక్షించగలను 

సాయంకాలపు ఈ ఊదా రంగు సమయాన్ని 

జనం తిరిగి ఇళ్ళకు వెళ్ళిపోయే వేళ 

నావికుడు సముద్రం నుంచి తిరుగుముఖం పట్టే వేళ 

టీ వేళకి టైపిస్టు చేరుకుంటుంది ఇంటికి

అల్పాహారం అంట్లు సర్ది అంటిస్తుంది స్టవ్వు

టిన్నుల్లోకి సర్దుతుంది తాజాగా భోజనాన్ని

కిటికీ కవతల చర్చి కెదురుగా తీగెమీద వేలాడుతూ

సూర్యుని ఆఖరి కిరణాలను స్పర్శిస్తూ ఆరేసిన ఆమె లోదుస్తులు

అదే రాత్రి వేళల్లో పానుపుగా మారే దివానుమీద

కుప్పలుగా తొడ పట్టీలూ, చెప్పులూ, రబ్బరు రవికెలూ , మేజోళ్ళూ


నేను, ముడుతలు దేరిన చను రొమ్ముల ముదుసలి టైరీ షియస్ ని

తిలకించాను ఈ దృశ్యా న్ని

ముందుగానే వివరించాను జరగబోయే తతంగాన్ని

ప్రతీక్షించాను నేను సయితం

ఎదురు చూసిన ఓ అతిధి కోసం

నవయువకుడు మొటిమలు దేలిన ముఖం

ఒక సాధారణ ఏజంటు గుమాస్తా

అదురూ బెదురూ లేనివాడు

బ్రాడ్ ఫర్డ్ మిలియనీరు నెత్తిమీది టోపీలా

అతని ముహానికి నప్పిన చవకబారు పొగరు

ఇదే అదను అనుకున్నాడతను

ముగించిందామె భోజనం

ఆమె ముఖం మీద అలసట, తోచనితనం

ముగ్గులోకి దింపేందుకు ముమ్మరించాడు ప్రయత్నం

అంగీకరించదూ ప్రతిఘటించదూ


ఎర్రబారిన వాంఛా కృతనిశ్చయం

మరుక్షణం కత్తిలాంటి మెరుపుదాడి

వెతుకుతూన్న హస్తాలకు ఎదురనేది లేనేలేదు

అతని అహంకారానికి ఆమె ప్రతిచర్యతో పనేలేదు

అనాసక్తినే అంగీకారమని భావించాడతను

( నేను, టైరీషియస్ ని ఆ దివానులాంటి పానుపు మీద

సాగుతూన్న నాటకాన్ని ప్రదర్శనకి పూర్వమే అనుభవించి వున్నవాణ్ణి !!

పాతాళపు లోతుల్లో అట్టడుగున పడివున్న ధీబ్స్ నగర కుడ్యాల పక్క

మృతకళేబరాల మధ్య సంచారం చేసినవాణ్ణి )

ఆఖరి చుంబనం అతని అంతిమ వీక్షణం

తిరుగుముఖం పట్టాడు

తడుముకుంటూ మెట్లను చీకట్లో

లిప్తపాటు చూసుకుంది అద్దం లో ముఖాన్ని

వెళిపోయిన ప్రియుని ధ్యాస  లేదామెకు లవలేశం

ఏదో అపరిపక్వ ఆలోచనకు అనుమతించింది మస్తిష్కం

'అయిందేదో అయింది యిక చింతించటం దేనికీ

ఒక అందమయిన అమ్మాయి పొరపాటున దిగజారినప్పుడు

గదిలోనే ఒంటరిగా ఆమె నడయాడుతూన్న చప్పుడు

యాంత్రిక హస్తం తో సవరించుకుంది అద్దం లో కురుల్ని

గ్రామఫోన్ మీద అమర్చింది అచేతనంగా ఒక రికార్డుని

' నీటిమీద ఇదే పాట నను ఒరుసుకుంటూ సాగింది '




( సశేషం )

No comments:

Post a Comment