Friday 22 June 2012

చందమామను చుంబిస్తూ .....



చందమామను చుంబి స్తూ చచ్సిపోయిన వాడు....




చందమామ ప్రతిబింబాన్ని ముద్దాడబోయి మరణించిన మహాకవిని గురించి ఎపుడయినా విన్నారా? 

ఇది నిజమా  లేక కల్పనా అనేది ఇప్పుడు అప్రస్తుతం.

 ఒక జాతి సాంస్కృతిక జీవితం లో విడదీయరాని వాస్తవం గా నిలిచిపోయిన విషయం    ఇది. 

చిరస్మరణీయమయిన చైనా జానపద గాధలలో నిలిచిపోయిన ఆసక్తికమయిన ఒక వృత్తాంతం ఇది.


లి బో !  చైనా దేశానికి చెందిన ఒక మహాకవి.

 తాంగ్ యుగానికి చెందిన ఈ కవి క్రీ. శ . 701 - 762ల  మధ్య  జీవించాడు. 

చైనీయ సాహిత్య చరిత్రలో కవిత్వానికి సంబంధించినంత వరకూ అది ఒక స్వర్ణయుగం .

 కవి లి బో  దాదాపు వెయ్యికి పైగా పద్యాలు రాసాడని చరిత్ర చెబుతోంది. 

Three Hundred Tang Poems 

సంకలనం లో లి బో  కవితలు ముప్ఫయి నాలుగు వున్నాయి.


కవి లి బో   మరణం గురించి రకరకాల కథలు ప్రచారం లో వున్నాయి. 

 జీవితం లో అనేక ఆటుపోట్లు చూసిన  లి బో  మరణం చాలా సహజమయిందనే వాదనకూడా వుంది.

 కానీ అక్కడి ప్రజలు ఇవేవీ నమ్మరు.


అది ఒక వెన్నెల రాత్రి. యాంగ్ సి నది మీద పడవలో ప్రయాణం చేస్తున్నాడు లి బో.   

నీటి అలల మీద  తేలియాడుతూన్న చందమామ ప్రతిబింబం ఆయనను ఎంతగానో ఆకట్టుకుంది. 

అందమయిన చందమామ  ప్రతిబింబాన్ని ముద్దు పెట్టుకుందామనిపించింది అతనికి.

పడవమీంచి ముందుకు  ఒంగాడు. 

చందమామ   ప్రతిబింబాన్ని తన పెదవులతో తాకుతున్నాననే పరవశం లో తననుతానే మరచిపోయాడు. 

అమాంతంగా   పడవమీది  నుంచి యాంగ్ సి నదిలో  పడిపోయాడు.

 చైనా జానపద గాధలో, ప్రజల పాటల్లో అమరుడుగా  మిగిలిపోయాడు. 








చైనా కవి లి బో కవిత 


తెలుగు కవి 'గానా' అనుసృజన 



వెన్నెలలో మధుపానం 


పువ్వుల మధ్య మధుభాండం.

ఒక్కణ్నే వొంపుకుంటాను. మిత్రులెవరూ చెంత లేరు.

చషకమెత్తి చంద్రుణ్ని ఆహ్వానిస్తాను.

నా నీడతో కలిసి ముగ్గురమవుతాం.



చంద్రుడు తాగడు. 

నా నీడ నా ప్రతి కదలికనీ అనుకరిస్తుంది.

అయినా ఇప్పుడు నాకీ సాహచర్యం కావాలి.

వసంతం ముగియకముందే వేడుక చేసుకోవాలి.


నేను పాడతాను, చంద్రుడు ఊగుతాడు.

నేను నర్తిస్తాను, నా నీడ చిందులు వేస్తుంది.

నేను స్పృహలో ఉన్నంత సేపూ సంతోషాన్ని పంచుకుంటాం.

ఆపైన ఎవరి దారి వాళ్ళది.


ఎప్పటికీ మేము మానవీయబంధాలు లేని స్నేహం తో ఉంటాం.

రజతనది అంతమయ్యే చోట మళ్ళీ కలుసుకుంటాం.

-------------
    
రజతనది = పాలపుంత 


( అతి అరుదయిన  కవి గాలి నాసర రెడ్డి.  పుట్టుమచ్చ బ్లాగ్ కోసం ఈ కవితకు సంబంధించిన  
50 పైగా ఆంగ్ల అనువాదాలను పరిశీలించి   చేసిన  తెలుగు అనువాదం ఇది.)



4 comments:

  1. బాగుందండీ ఇలా చైనీయుడైనా ఒక మహాకవి గారు చందమామ ప్రతిబింబాన్ని ముద్దాడుతూ ఆఖరిక్షణాలు గడిపాడని తెలుసుకోవటం....

    ReplyDelete
  2. కవిత, దాని నేపధ్యం రెండూ చాలా బావున్నాయండీ!

    ReplyDelete
  3. Beautifully done! Thanks for sharing

    ReplyDelete