Saturday 16 June 2012

వేస్ట్ ల్యాండ్ - 3




టి.యస్. ఎలియట్ వేస్ట్ ల్యాండ్ - 3





చవిటిపర్ర




2
చదరంగం ఆట


ఆమె కూర్చున్న కుర్చీ 

నగిషీలు చెక్కిన సిం హాసనం

పాలరాతి గచ్చు మీంచి మిరుమిట్లు గొలిపే కాంతి వలయం 

ద్రాక్షపండ్ల గుత్తులతో బరువెక్కిన తీగెలపై 

తులతూగే అద్దం లోంచి తొంగిచూస్తూన్న 

బంగారపు క్యూపిడ్ శిల్పం

( దాని రెక్కల్లో కనులు మోడ్చి మరో శిల్పం )

ఏడు కొమ్మల శెమ్మెపై వెలుగుతూన్న దీపజ్వాలల్ని ద్విగుణీకరించి 

ప్రతిఫలిస్తోంది కాంతిని మేజాబల్లమీంచి 

అందుకునేందుకు పట్టు సంచుల్లోంచి ఒలకబోసిన ఆమె ఆభరణాల జిలుగులు 

మూతలు తెరిచిన ఏనుగు దంతాల,రంగురంగుల గాజు జాడీల్లోని 

తైలాలు, చూర్ణాలు, అత్తర్లు, రసాయనిక సుగంధ పరీమళాలు

కిటికీలోంచి వీచే స్వఛ్చమయిన గాలితో కలిసి 

మత్తెక్కించి, మైమరపించే సుగంధాల తుఫానుతో 

బలపడుతూన్న సుదీర్ఘ దీప జ్వాలలు

విసిరేస్తున్నాయి ధూపాన్ని 

కదిలిస్తున్నాయి బంగారపు పలకల పైకప్పు రూపాన్ని 

రంగురాళ్ళ చతురశ్రపు అగ్నిగుండం లో 

కాలుతూన్న సముద్రపు కలప ముక్కల 

ఆకుపచ్చని నారింజ రంగు మంట 

విషాదకాంతుల కెరటాలమీద ఈదుతూన్న నగిషీల చేప 

వనసౌందర్యం మీద అమర్చిన చిత్రపటం లో 

చెక్కిన శాపగ్రస్త ఫిలోమెల్ విషాద చరితం  

క్రూరకాముకుడయిన రాజు నికృష్ట చేష్ట 

అమాయకమయిన ఆమె ఆర్తనాదం

ఎడారి అంతటా అలుముకునివుంది

ప్రతిధ్వనిస్తూనేవుంది ఈనాటికీ 

ప్రపంచం అలా ఆలకిస్తూనేవుంది ఇప్పటికీ 

జగ్ జగ్ జగ్ జగ్ జగ్ జగ్ 

పాపిష్టి చెవుల్లో అశ్లీల స్వరాలు

అంతే కాదు

గతించిన దినాల గాధల చిత్రాలు నిండిన గోడలు


మూతబడిన మౌనపు గది కుడ్యాల్లోంచి 

బయటికి తొంగిచూస్తూ ముందుకు వంగిన ఆకారాలు

సోపానం మీద రాపాడే పాదాల శబ్దాలు

మంటల వెలుగులో దువ్వెన కింద 

వెదజల్లిన నిప్పులరవ్వల జడిలా ఆమె శిరోజాల మొనలు

వాంఛతో ప్రజ్వలించే పదాలు

ఘనీభవించిన వనదృశ్య చిత్రపటం


" నా నరాల స్థితి ఏమీ సవ్యంగా లేదీ రాత్రి

నిజంగా బాలేదు

ఉండిపో నాతో 

మాట్లాడు నాతో - ఎందుకూ నాతో ఎప్పుడూ మాటాడవు? మాట్లాడు.

ఏమిటీ ఆలోచిస్తున్నావు నువ్వు? ఏమిటీ ఆలోచన? ఏమిటి?

ఎప్పటికీ నాకు అర్థం కాదు, నువు ఏమాలోచిస్తున్నావన్నది? ఆలోచించు!

మృతదేహాలు కోల్పోయిన ఎముకల రాశులు 

ఎలుకల కలుగులు నిండిన సందుల్లో మనం


ఏమిటీ శబ్దం?


తలుపుల సందుల్లోంచి వీస్తున్నది గాలి

మరి ఇదేమి శబ్దం? ఏం చేస్తున్నది గాలి?

ఏమీ లేదు, అసలేమీ లేదు

తెలియదా అసలేమీ నీకు? చూడవా అసలేదీ నువ్వు?

ఙాపకం నీ కసలు వుండదా ఏదీ? 


ఉంది, ఙాపకం వుంది నాకు


" ఇవిగో! ముత్యాలు అలనాటి అతని నేత్రాలు " 


నువు సజీవివా కాదా? నీ మస్తిష్కం లో అసలేమీ లేదా?


కానీ

ఓవోవోవో  అరెరె  ఓ షేక్ స్పియరీయ   శోకగీతం 

ఎంత సొగసైనది 

ఎంత తెలివైనది


" ఏం చేయాలిపుడు నేను? ఇంతకీ అసలు ఏం చేయాలి నేను?

ఉన్నపళంగా వీధిలోకి విరబోసుకుని జుట్టూ తలా వెళిపోవాలని వుంది నాకు "

" ఏం చేద్దాం రేపు మనం?

రేపే కాదు అసలు ఎపుడయినా ఏం చేయాలి మనం?


ఉదయం పదింటికి వేడి నీళ్ళు 

వాన కురిస్తే నాలుగింటికి మూసేసిన తలుపుల కారు

చదరంగం ఆట

రెప్పల్లేని కళ్ళని ఒత్తుకుంటూ తలుపు తట్టే ఒక శబ్దం కోసం ఎదురుచూపు 


లిల్ మొగుణ్ణి సైన్యం నుంచి పంపేసినపుడు చెప్పాను నేను స్పష్టంగా 

చాలా చాలా స్పష్టంగా 


" టైం అయిపోయింది బార్ కట్టేస్తున్నాం "

వచ్చేస్తాడు ఆల్బర్ట్ సర్దుకో కాస్త నదురుగా 

పళ్ళు కట్టించుకోమని యిచ్చిన డబ్బుల్ని గురించి తీస్తాడు తప్పక ఆరా 

నా ముందే కదా ఇది జరిగింది 

'ఒట్టేసి చెబుతున్నా , చూడలేను నిన్నిలా

పళ్ళన్నీ పీకించుకో , మంచి సెట్టు పెట్టించుకో' అన్నాడు నా ముందే అతను

అదే మాట నాదీ , ఆలోచించు పాపం  ఆల్బర్ట్ గురించి

ఆర్మీలో నాలుగేళ్ళు వేసారి వచ్చాడు ఇంటికి 

సహజంగానే సుఖపడాలని వుంటుంది కదా అతనికి 

అందించకపోతే నువ్వు దాన్ని , అందించేవాళ్ళు అనేక మందీ

ఔనా, ఉన్నారా అన్నదామె 

అవును నిజం అని చెప్పా నేను


" టైం అయిపోయింది బార్ కట్టేసే వేళయింది "


ఆల్బర్ట్ గనక వెళిపోతే చెప్పలేదని నన్ను అనొద్దు

'సిగ్గు పడాలి నువ్వు ముసలి వొగ్గులా కనిపిస్తున్నందుకు '

( వయసు ఆమెది నిజానికి ముప్ఫయి ఒకటి )

ఏం చేయను నేనంటూ ముఖం మాడ్చుకున్నదామె 

కడుపు దించుకుంటానికి మింగిన మాత్రలదే తప్పంతా అని చెప్పింది

( అయిదుగురిని కనేసింది. జార్జి కాంపులో చచ్చి బతికింది )

' నీకేమీ కాదన్నాడు కెమిస్టు , కానీ మునుపటి రూపం మాత్రం మిగల్లేదు '

' నిజంగా నువ్వొక పచ్చి ఫూల్ వి ' అన్నా నేను

అదే యావ గదా ఆల్బర్ట్ కి సదా, నువ్వేం చేస్తావు దానికి?

పిల్లలే వద్దనుకుంటే మరి పెళ్ళాడటం దేనికి? 


" టైం అయిపోయింది. బార్ కట్టేసే వేళ! "


ఆల్బర్ట్ వచ్చాడు ఆదివారం ఇంటికి

ఆవిర్లు చిమ్మే మాంసం తో ఆరగించారు విందు

ఆహ్వానించారు నన్ను ఆస్వాదించటానికి వేడి వేడి సౌందర్యం


 " టైం అయిపోయింది బార్ కట్టేస్తున్నాం "


గూనైట్ బిల్. గూనైట్ లూ. గూనైట్ మే. గూనైట్ 

టా టా. గూనైట్.

గుడ్ నైట్, లేదీజ్, గుడ్ నైట్, స్వీట్ లేడీజ్, గుడ్ నైట్,గుడ్ నైట్


( ఇంకా ఉంది)


టి . ఎస్ . ఎలియట్ 
     

No comments:

Post a Comment