Friday 29 June 2012

అమ్మకొంగు










 ఇది నెక్కలపూడి ఉషారాణి కవిత. అమ్మపాదం కవితాసంకలనం లో అచ్చయిన ' అమ్మకొంగు ' అనే ఈ కవితకు 

అరుదయిన గౌరవం లభించింది.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తోపాటు భారత  ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ, 

జాతీయ గ్రామీణ హెల్త్ మిషన్, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ,యునిసెఫ్ సం యుక్తంగా చేపట్టిన    తల్లీపిల్లల 

ఆరోగ్యపరక్షణ కార్యక్రమానికి ఈ కవితను కాన్సెప్ట్ గీతం గా గుర్తించారు. కార్యక్రమం ప్రారభోత్సవం సందర్భంగా 

కవయిత్రి నెక్కలపూడి ఉషారాణినిసత్కరించారు.





అమ్మకొంగు


నెక్కలపూడి ఉషారాణి



బుడి బుడి నడకల ఆదిమ ఆలంబనం అమ్మ పైటకొంగు

అపరిచితుల పలకరింపులకు సిగ్గుల పరదా

దాగుడుమూతల దెబ్బలాటల్లో నా రక్షణదుర్గం

ఆటల అలసటల చెమటలు తుడిచే తువ్వాలు 

కంట్లో నలకకు ఊర్పులకాపు అమ్మ పైటకొంగు


చిరుతిండాకలికి తాయిలం భరిణె

జీడీలకు డబ్బులు దొరికే అక్షయపాత్ర

అర్థరాత్రి చలిలో నులివెచ్చని భోగిమంట 

మధ్యాహ్నపు మండుటెండలో మమతల గొడుగు 

దిగజారిన జ్వెరం చెమటలకు సంజీవనీ స్పర్శ 

నావను దరిజేర్చే తెరచాప అమ్మ పైటకొంగు

రోజులో అమ్మకెన్ని పనులో అమ్మకొంగుకు అన్ని రూపాలు!

నిత్యం గ్నాపకాలలో వేలాడే అమ్మకొంగులో

ఎప్పటికీ నేను పసిబొమ్మనే!!







3 comments: