Monday 7 October 2013

ఒక అదృశ్యం - ఖాదర్ మొహియుద్దీన్



ఒక అదృశ్యం

-----------------------------------------------------------------

ఖాదర్ మొహియుద్దీన్

----------------------------




నా పసిదినాల ప్రాంగణంలో

అక్కడ ఒక పేద్ద వేపచెట్టు

చూపులకందని చిటారుకొమ్మల గుబురుల్లో

ఒక పేరు తెలియని పక్షిగూడు

దాని దరిదాపుల్లోనే దేవళంలా లేచిన

చిత్రమైన ఒక  చీమలపుట్ట

నా కళ్ళు గప్పి తెలివిగా రాత్రిపూట 

తెలుగు పాఠ్యపుస్తకం పుటలోంచి 

మెత్తగా పాక్కుంటూ వెళ్ళి

పక్షి గుడ్లకోసం మాటు వేసే తాచుపాము



ఇప్పుడు అక్కడ ఒక పెద్ద మేడ

తన పూర్వీకుల జాడ కోసం 

ఆకాశంలో  అదే పనిగా 

గిరికీలు కొడుతూన్న పక్షి

తండోపతండాలుగా

విసుగూ విరామం లేకుండా 

ఒక వాల్మీకి కోసం వెతుకులాడుతూన్న

ఎడతెగని  చీమలదండు   

చెట్టు పునాదుల మీద పరచుకున్న

పడక గది  పీడకలలో 

పడగవిప్పిన ఒక నల్లత్రాచు

----------------------------