Friday 29 June 2012

స్మైలూ - గాలీ

గాలి నాసరరెడ్డి, స్మైల్, ఖాదర్ మొహియుద్దీన్ 




స్మైలూ - గాలీ


ఇది ప్రఖ్యాత రచయితా, కవీ స్మైల్ మరో ప్రముఖ తెలుగు కవి గాలి నాసరరెడ్డికి రాసిన ఉత్తరం. 

మన ముందు తరం పాటించిన విలువలను మనం మరిచిపోకూడదని ఈ ప్రయత్నం. 

అంతే కాదు. ప్రముఖుల ఉత్తరాలను భద్రపరచాలనేది మా  సంకల్పం.   

ఉత్తరాన్నీ, ఫొటోనీ పంపించినందుకు నాసరరెడ్డికి కృతజ్ఞతలు. 







మై డియర్ నాసరరెడ్డీ,

ఎన్నేళ్ళైంది మనం కబుర్లు చెప్పుకొని? అసలు, జ్ఞాపకం వున్నానా నేను?

అటూ యిటూ అయిపోయాం హైద్రాబాద్ వొదిలిన తర్వాత. ఎలా వున్నారూ?

నేను రిటైరై మొన్న ఫిబ్రవరికి రెండేళ్ళు. హాయిగా

పుస్తకాలు చదువుకుంటూ మీలాంటి మిత్రులెవరన్నా కలిస్తే ఓ కాస్తసేపు 

ఆల్కొహాల్ మీద ఆత్మస్తుతీ పరనిందా! ( పరులనగా గవర్నమెంటు

గాడిదలనుకోండి.) ఇది పోనీండి. మనం కలుసుకుందాం.15,06 న.

దీంతోవున్న ' చెట్టంత కవికి పిట్టంత సత్కారం ' చదవండి.సంగతి 

తెలుస్తుంది. ఓ. కే. మీరు తప్పకుండా రావాలి. పోతే సావెనీర్ కి 

ఏదన్నా రాసి పెందరాడే పంపగలరా? ప్రెస్ కివ్వాలి కదా.

ఖాదర్ వుండుండి వేళకాని వేళల్లో వురుముతుంటాడు. అంతే.

అతన్ని కలిసీ ఎన్నో యేళ్ళైపోయింది. గోదావరికి మూడో వంతెన పడింది.

కొత్త నీరూ ఎంతో ప్రవహించింది... కలిసినప్పుడు అన్నీ కబుర్లే. రైట్.

వీలైతే ఓ ఉత్తరం. చూస్తుంటా.

శుభాకాంక్షలతో

ఇస్మాయిల్





అమ్మకొంగు










 ఇది నెక్కలపూడి ఉషారాణి కవిత. అమ్మపాదం కవితాసంకలనం లో అచ్చయిన ' అమ్మకొంగు ' అనే ఈ కవితకు 

అరుదయిన గౌరవం లభించింది.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తోపాటు భారత  ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ, 

జాతీయ గ్రామీణ హెల్త్ మిషన్, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ,యునిసెఫ్ సం యుక్తంగా చేపట్టిన    తల్లీపిల్లల 

ఆరోగ్యపరక్షణ కార్యక్రమానికి ఈ కవితను కాన్సెప్ట్ గీతం గా గుర్తించారు. కార్యక్రమం ప్రారభోత్సవం సందర్భంగా 

కవయిత్రి నెక్కలపూడి ఉషారాణినిసత్కరించారు.





అమ్మకొంగు


నెక్కలపూడి ఉషారాణి



బుడి బుడి నడకల ఆదిమ ఆలంబనం అమ్మ పైటకొంగు

అపరిచితుల పలకరింపులకు సిగ్గుల పరదా

దాగుడుమూతల దెబ్బలాటల్లో నా రక్షణదుర్గం

ఆటల అలసటల చెమటలు తుడిచే తువ్వాలు 

కంట్లో నలకకు ఊర్పులకాపు అమ్మ పైటకొంగు


చిరుతిండాకలికి తాయిలం భరిణె

జీడీలకు డబ్బులు దొరికే అక్షయపాత్ర

అర్థరాత్రి చలిలో నులివెచ్చని భోగిమంట 

మధ్యాహ్నపు మండుటెండలో మమతల గొడుగు 

దిగజారిన జ్వెరం చెమటలకు సంజీవనీ స్పర్శ 

నావను దరిజేర్చే తెరచాప అమ్మ పైటకొంగు

రోజులో అమ్మకెన్ని పనులో అమ్మకొంగుకు అన్ని రూపాలు!

నిత్యం గ్నాపకాలలో వేలాడే అమ్మకొంగులో

ఎప్పటికీ నేను పసిబొమ్మనే!!







కాఫ్కా - శ్రీశ్రీ

    


వింత జంతువు 

మూలం: ఫ్రాంజ్ కాఫ్కా

అనువాదం: మహాకవి శ్రీశ్రీ  




నా దగ్గర ఒక వింత జంతువుంది. సగం పిల్లి, సగం గొర్రె, చచ్చిపోతూ మా నాన్న వదిలిన ఆస్తి.  

అయితే దాని ప్రస్తుత  రూపం నా కాలం లోనే  ఏర్పడింది. అంతకుపూర్వం అది పిల్లిగాకాక 

చాలామట్టుకు గొర్రెగానే  ఉండేది. పిల్లిజాతి నుండి   తలా, గోళ్ళూ గొర్రె జాతినుండి ఒడ్డూ, 

పొడుగూ,  ఆకారమూ దానికి సంక్రమించాయి.  రెండిటినుంచీ కళ్ళు భీకరంగా, ఎప్పటి

కప్పుడు మారిపోతూ, బొచ్చు మెత్తగా, చర్మానికి దగ్గరగా గమనం  దాట్లు వెయ్యడం, ప్రాకడం, 

కిటికీమీద ఎండలో కూర్చుని అది బంతిలాగ ముడుచుకుపోయి గుర్రు పెడుతుంది.  పచ్చిక 

బయలులో పిచ్చెత్తినట్టు గంతులు వేస్తూ ఒకంతకీ దొరకదు. పిల్లలనుచూస్తే పారిపోతుంది;

గొర్రెల మీద తిరగబడుతుంది. వెన్నెల రాత్రులలో ఇంటి పైకప్పు మీద  సంచరించడం దానికి

 సరదా.   అది మ్యావు మననే లేదు. ఎలకలంటే అసహ్యం. కోళ్ళ   తట్ట దగ్గర గంటలకొద్దీ

 మాటు వేస్తుంది. కాని యెప్పుడు   ఒక్క కోడిని కూడా చంపలేదు. 


దానికి నేను పాలుపోస్తూ ఉంటాను. క్రూరమృగం వలె దంతాల సందులనుంచి పెద్ద పెద్ద పీల్పులతో 

పాలు తాగుతుంది. అదంటే   చిన్నపిల్లల కందరికీ గొప్ప వేడుక అని వేరే చెప్పనక్కరలేదు. 

ఆదివారం అందరూ వచ్చేపూట మోకాళ్ళ మీద ఆ జంతువును పెట్టుకుని  కూర్చుంటాను.

 గ్రామం లోని పిల్లలందరూ నా చుట్టూ   నిలుచుంటారు.  పిల్లలంతా వింత వింత వింత ప్రశ్నలు 

వేస్తారు. మానవ మాత్రులెవ్వరూ   వాటికి జవాబులు చెప్పలేరు. ప్రపంచం లో  ఇలాంటి

 జంతువు ఒక్కటే ఎందుకుండాలి? ఇది చచ్చిపోతే   ఏమవుతుంది? దీనికి ఒంటరితనం   అనిపించదా? 

పిల్లల్నెందుకు పెట్టలేదు? దీని పేరేమిటి? ఇట్టివే ఎన్నో ప్రశ్నలు.



జవాబు లివ్వడానికి నేను ప్రయత్నించను. జంతువును ఒళ్ళో పెట్టుకుని అలాగే కూర్చుంటాను. 

పిల్ల లొక్కొక్కప్పుడు తమతో పిల్లులను  తెస్తారు. ఒకసారి రెండు గొర్రెల్ని కూడా తెచ్చారు. కాని   

వారనుకున్నదానికి   విరుద్ధంగా నా జంతువు బంధువులను గుర్తించలేక పోయింది.  జంతువులు 

తమ మృగాల కళ్ళతో పరస్పరం  తేరిపార చూసుకున్నాయి. ఎవరి బతుకు వాళ్ళదే అనుకున్నాయి. 

నా వొళ్ళో కూర్చున్నప్పుడు జంతువుకి భయం గాని, వేటాడే ఉత్సాహం గాని ఉండవు. నన్ను    అదుము

కున్నప్పుడు దానికెక్కడలేని సంతోషమూ వస్తుంది. తాను  ఎవరిమధ్య పెరిగిందో ఆ కుటుంబం పట్ల   

ఎప్పుడూ విశ్వాసం గా ఉంటుంది. ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు.  లోకం  లో తనకు సవతి బంధువు

లెవరూ   లేకపోవటం వల్ల ఈ జంతువు మా ఇంటినే కనిపెట్టుకొని ఉంటుంది.ఇక్కడ  దానికి దొరికిన 

  ఆశ్రయాన్ని పవిత్రంగా   చూసుకొంటుంది.



ఒక్కొకప్పుడీ జంతువు నా చుట్టూ చూస్తూ నా కాళ్ళని చుట్టుకుంటూ ఎప్పటికీ నన్ను వదలకపోతే నవ్వక

తప్పేది కాదు. గొర్రెగానూ,  పిల్లిగానూ ఉన్నది చాలక కుక్కగా కూడా ఉండాలనుకుంటుంది. అందరివలెనే

నాకు కూడా  అప్పుడప్పుడు వ్యవహారపు చిక్కులు తటస్థపడి,  ఏమవుతుందో ఏమిటో అనే ఆందోళనలో

 నేను పడిపోయి  అప్పటికీ తెగించుకొని వాలుకుర్చీలో కూర్చున్న సమయం లో ఈ జంతువు నా

వొళ్ళోనే వుంటుంది. దానివైపు చూస్తే పొడుగాటి దాని మీసాల నుంచి కన్నీళ్ళు నావా? దానివా? 

నిజంగా ఈ పిల్లికి గొర్రెల ఆత్మతోపాటు మనుష్యుల ఆశయాలు కూడా ఉన్నాయేమో? మా నాన్న 

నాకు వదలిపెట్టిన ఆస్తి స్వల్పమేగాని ఈ ఆస్తి  అంత కొట్టివేయదగ్గది కాదు.



గొర్రెల్లోనూ, పిల్లుల్లోనూ కనబడే ఆరాటం, వేరు వేరు రకాలదే అయినా ఈ జంతువులలోనూ ఉంది. 

అందుచేత దీని  చర్మం దీనికి  చాలనట్లుంటుంది. ఒక్కొక్కప్పుడీ జంతువు నా పక్కని కుర్చీ మీదికి

 ఉరికి, తన ముందుకాళ్ళు నా  భుజాలమీద వేసి నా చెవి దగ్గర తన   ముట్టె చేర్చుతుంది - అచ్చంగా

 నాతో ఏదో ఏవో మాట్లాడ దలచుకున్నట్టే  నిజంగా ఆ తరువాత తన తల తిప్పి నా మొగం వైపు   

చూస్తుంది. తాను చెప్పింది నేను బోధపరచుకొన్నానో లేదో  చూడడానికి, దాన్ని సంతోషపెట్టడానికి 

గాను నేను కూడా అర్థమయిందన్నట్లుగా నటించి తల ఆడిస్తాను. అప్పుడది నేలమీది కురికి 

సరదాగా ఇల్లంతా నాట్యం చేస్తుంది.



బహుశా ఈ జంతువుకి కసాయివాడి కత్తివల్ల విముక్తి కలుగుతుందేమో! కాని ఇది నా పూర్వుల ఆస్తి 

కాబట్టి ఇట్టి  పని చెయ్యకూడదు.   అంచేత దానంత అదే ఊపిరి వదిలి వేసే అదను వచ్చేదాకా

 వేచుకొని ఉండవలసిందే. అయినా  అప్పుడప్పుడీ జంతువు మనుష్యజ్ఞానం తో   నావైపు చూసి 

ఇద్దరం ఒకేసారిగా దేన్ని గురించి ఆలోచిస్తున్నామో  యేదీ ఆ పని చేసి చూడు అన్నట్టుగా మొగం

 పెడుతోంది.     



Wednesday 27 June 2012

మెహది హసన్, ఒక సాయంకాలం....


మెహది హసన్, నూర్జహాన్, ఒక సాయంకాలం....




అది  ఒక అద్భుతమయిన సాయంకాలం....

గంధర్వగాయకుడు మెహది హసన్ కచేరీ....

స్వరసామ్రాజ్యం లో మకుటం లేని మహారాణి నూర్జహాన్ ముఖ్య అతిధిగా పాల్గొన్న అపూర్వ సందర్భం అది. 

సభాప్రాంగణమంతా సంగీత ప్రేమికులతో  నిండిపోయివుంది. 

నూర్జహాన్ ను సాదరంగా వేదిక మీదికి ఆహ్వానించారు.

 ఆహూతు లందరూ కరతాళ ధ్వనులతో ఆమెకు ఘనస్వాగతం పలికారు. 

విలువ కట్టలేని ప్రజల ప్రేమేమాభిమానాలకు ఆమె ముగ్ధులయారు.

వేదిక మీదికి రావటం తోనే ఆమె 'ఈ రోజు మన అందరికీ ఎంతో శుభదినం' అంటూ తన ప్రసంగం ప్రారంభించారు.

' మెహది హసన్ ను పరిచయం చేయడటమంటే సూర్యుడికి దివ్వె చూపించడం వంటిది.

 మనం అందరం ఎంతో అదృష్టవంతులం.

మనమందరం ఈ రోజు  మెహది హసన్ స్వరమాధుర్యాన్ని ఆస్వాదించబోతున్నాం.

 ఈ సభలో పాల్గొనటం నిజంగా నా అదృష్టం.

తలిదండ్రులు చేసిన దానాలను బట్టి సంతానం కలుగుతుందని అంటారు. 

మెహది హసన్ తలిదండ్రులు, తాతముత్తాతలు రత్నాలను దానం చేసి వుంటారు.

 అందువల్లనే మెహది హసన్ వంటి గంధర్వ గాయకుడు పుట్టాడు. 

నిజానికి    మానవమాత్రుడయినవాడు ఇలా పాడలేడు.

 మెహది హసన్ ని ప్రత్యక్షంగా చూసిన తరువాతనే గాని నేను ఈ వాస్తవాన్ని నమ్మలేదు. ' 

మేడం నూర్జహాన్ పసంగం అలా సాగిపోతూ వుంది. 

శ్రోతలు మంత్రముగ్ధులయి వింటున్నారు.

గజల్ సమ్రాట్ మెహది హసన్ మేడం దగ్గరికి వచ్చాడు. 

ఆమె అమితమయిన వాత్సల్యం తో అతనిని అక్కున చేర్చుకుంది.

ఒకసారి మైకు తనకివ్వమని ఆమెను అభ్యర్ధించాదు. 

ఆమె ససేమిరా అన్నది. 

మెహది హసన్ బతిమిలాడాడు.

ఆమె ఒప్పుకోలేదు.

చివరికి గత్యంతరం లెక ఆమె చేతి మైకు బలవంతంగా లాక్కున్నాదు మెహది హసన్.

జనం లొ ఆనందం....అంతు లేని ఆసక్తి...అంతుపట్టని ఉత్కంఠ...

' మేడం మాటల్ని ఆమె పెద్ద మనసుకు తార్కాణాలుగా తీసుకోవాలి. 

మేడం ప్రశంసలకు నేను ఏమాత్రం   అర్హుణ్ణి కాను. 

నేను ఒక క్లాసికల్ సంగీత కుటుంబం నుంచి వచ్చినవాణ్ణి. 

సినిమా పాటల గురించి నాకు   నిజంగా ఏమీ తెలియదు.

 మేడం నన్ను తీర్చిదిద్దారు.  

సినిమా రంగం లో నేను విజయం సాధిచానంటే అది కేవలం మేడం చలవే '

అని మెహది హసన్ తిరిగి మైకు ఆమె చేతికిచ్చాడు.

( ఆసక్తి వున్నవాళ్ళు వీడియో క్లిప్పింగ్ వీక్షించవచ్చు )  






Melody Queen Madam Noorjehan's tribute to The Ghazal Legend Mehdi Hassan

Saturday 23 June 2012

వేస్ట్ ల్యాండ్ - 7







వేస్ట్ ల్యాండ్ - 7





చవిటిపర్ర


టి.యస్.ఎలియట్


5


ఏమన్నది ఉరుము?




చెమటలు కారుతూన్న ముఖాలమీద ఎర్రని కాగడాల వెలుగుల తరువాత 

తోటలనిండా మంచులా ఘనీభవించిన మౌనం తరువాత 

రాతి మైదానాల నిండా పరివ్యాప్తమయిన ఆవేదన తరువాత

కేకలు పెడబొబ్బలు ఆర్తరావాలు ఆర్తనాదాలు కారాగారాలు భవంతులు 

దూరంగా కొండలమీద వసంతమేఘ గర్జనల ప్రతిధ్వనుల తరువాత 

బతికివున్నవాడు ఇప్పుడు చచ్చిపోయాడు 

అపుడెపుడో బతికివున్న మనం ఇపుడు చస్తూనే వున్నాం 

కాకుంటే కాసింత సహనం తో  


ఇక్కడ నీళ్ళు లేవు కేవలం గండశిలలు

గండశిలలే గాని నీళ్ళు లేవు ఇసుకదారి 

రాళ్ళు తప్ప నీళ్ళు లేని కొండల్ని చుడుతూన్న దారి

నీళ్ళే గనక వుంటే అక్కడ మనం తప్పక ఆగుతాం తాగుతాం

ఎవడయినా సరే రాళ్ళ మధ్య ఆగలేడు ఆలోచన చేయలేడు 

ఆరిన చెమటా ఇసుకలో పాదాలు

ఈ రాళ్ళ మధ్య నిజంగా వుండుంటే గనక నీళ్ళు 

ఉమ్మలేదు నిష్ప్రాణపు పళ్ళులేని పర్వతాల బోసినోరు

నుంచోలేరు నడుం వాల్చలేరు కూర్చోలేరు ఎవరూ ఇక్కడ 

కనీసం ఈ కొండల్లో కనిపించదు నిశ్శబ్దపు జాడ 

గర్జించే గొడ్డుబోతు మబ్బుదప్ప వాన లేదు 

ఏకాంతానికయిన ఈ కొండల్లో ఏమాత్రం తావు లేదు 

తపిస్తూ దహిస్తూ గుర్రుమంటూ వెక్కిరిస్తూ 

నెర్రెలిచ్చే ఇళ్ళ తలుపుల్లోంచి తొంగిచూసే వదనాలు


అక్కడ అదే గనక 

రాళ్ళ బదులు నీళ్ళుంటే 

అదే గనక అక్కడ 

రాళ్ళుండీ నీళ్ళుంటే 

నీళ్ళు

ఒక చల్లని చెలిమ

రాళ్ళమధ్య ఒక్క నీళ్ళ కొలను

కేవలం ఒకేఒక్క సెలయేటి గలగల

కిర్రుమనే కీటక శబ్దాలు వద్దు

ఎండిన గడ్డిపరకల గరగరలు వద్దు

కేవలం రాళ్ళమీంచి జారిపడే జలపాతం ధ్వనిలాగా 

పరిత్యాగి పక్షి ఒకటి అందుకుంటుంది పాట 

డ్రిప్ డ్రాప్ డ్రిప్ డ్రాప్ డ్రాప్ డ్రాప్ డ్రాప్ 

అవును సరే మరి నీళ్ళేవీ?



నిరంతరం నీడలా నీ వెంట నడిచే ఆ మూడోవాడు ఎవడు?

లెక్క చూస్తే ఇద్దరం, ఒకటి నువ్వు రెండు నేను

కానీ, తెల్లని ఈ రోడ్డు మీంచి చూపు పైకి చాపిన ప్రతిసారీ 

నీ పక్కనే నిరంతరం నడుస్తూన్న మరో మనిషి

అలికిడిలేని అడుగులు జేగురు రంగు ముసుగులో 

అంతు పట్టదు ఎంతకీ మగవాడో మరి ఆడదో?

ఉన్నది నీకావలివైపున ఇంతకీ ఎవరు చెప్పు?

గాలిమీంచి వినిపించే ఈ శబ్దం ఏమిటి?

ఇది ఎవరో ఒక మాతృమూర్తి విషాద రోదన గీతం 

చూపులు సారించినంతమేరా వ్యాపించిన మైదానాల్లోంచి 

నెర్రెలిచ్చిన నేలమీద ఎదురుదెబ్బల ఊదారంగు గాయాల్తో 

గుంపులు గుంపులుగా ముసుగులు ధరించి వస్తూన్న వీళ్ళంతా ఎవరు?


ఇంతకీ కొండల కవతలి వొడ్డునవున్న ఈ నగరం పేరేమిటి?

పగుళ్ళు, మరమ్మతులు, వయొలెట్ వాతావరణపు విస్ఫోటనాలు

కూలుతూన్న శిఖరాలు

జెరూసలేం ఏథెన్స్ అలెగ్జాండ్రియా

వియన్నా లండన్

సమస్తం అవాస్తవం 



నిడుపాటి నల్లని కురుల్ని తంత్రుల్లా సవరించి బిగించి 

గుసగుసల సంగీతాన్ని శృతి చేస్తున్నది ఒక ఆడది

అరుస్తూ, రెక్కలు అల్లార్చుతూ 

వయొలెట్ కాంతిలో గబ్బిలాలు పసిపిల్లల ముఖాల్లా 

మసిబారిన గోడమీద తలకిందులుగా పాకుతున్నాయి కిందికి 

గాల్లో అధోముఖంగా శిఖరాలు

కాలాన్ని సూచిస్తూ గడిచిన దినాల తలపోతల్ని 

గుర్తుకుతెచ్చే గంటల మోతలు

శూన్యపు జలాశయాలు,బొంద బావుల్లోంచి వినిపించే స్వరాలు



పర్వతాల మధ్య శిధిలమయిన గుహలోపల 

మసక వెన్నెల వెలుగులో చెల్లాచెదురయిన సమాధులమీంచి

ప్రార్ధనాలయం గురించి సరసరసరమని రెల్లుపాట 

శూన్య శిధిలాలయపు గాలికి అది నివాసస్థలం 

కిటికీలనేవి లేవు కేవలమొక వూగాడే ద్వారం

పొడిబారిన ఎముకలు ఎవరికీ హానిని కలిగించవు 

పైకప్పు నిట్టాడి మీద మెరుపు వెలుగులో ఒకేఒక్క కోడిపుంజు

కొక్కొరోక్కో కొక్కొరోక్కో

పిడుగుపాటు మెరుపు వెలుగు

తేమనిండిన గాలి తెమ్మెరలోంచి

వాన

ఎండిపోయింది గంగ

వాన కోసం ఎదురుచూపు జీవం లేని ఆకులు

సుదూరాన హిమగిరి పర్వత శిఖరం మీద 

కమ్ముకుంటూన్న కారుమేఘాలు

మౌనం లోకి ముడుచుకుంది మొత్తంగా అడవి

ఉరుము అన్నది

ద.

దత్త: ఇచ్చిందేముంది మనం?

మితృడా, నెత్తురు విసిరేస్తోంది నా హృదయాన్ని 

సమస్త జీవిత వివేక సంపద సయితం ఆపజాలని 

ప్రళయాంతకమైన సాహసం, లిప్తపాటు లొంగుబాటు 

దీనిమీదనే కేవలం దీనిమీదనే ఆగివుంది మన అస్తిత్వం 

మన గురించిన శ్రద్ధాంజలుల్లో ఎక్కడా దీని జాడ కనిపించదు

సాలీడు దయతో అల్లిన గ్నాపకాల గూట్లోనూ ఇది లభించదు

శూన్యం నిండిన మన గదుల్లో వకీలు గుమాస్తా 

పగులగొట్టే సీళ్ళ వీలునామా పత్రాల్లోనూ ఇది ప్రతిఫలించదు

ద. 

దయాధ్వం: నేను విన్నాను తాళం చెవిని

ద్వరం లో తిరిగిందది ఒక్కసారి,కేవలం ఒకే ఒక్కసారి

ప్రతి ఒకరూ తన చెరలో ఆలోచన తన తాళం చెవిలో 

ప్రతి ఒకరీ చెర ఖరారు తన తాళం చెవి భావనలో 

రాత్రిపూట మాత్రమే చవకబారు హత్యల పుకార్లు

విరిగిన కొరియొలేనస్ శిల్పం మనసుకు గడియసేపు మేలుకొలుపు

ద.

దమ్యత: ప్రతిస్పందించింది పడవ 

పరవశం తో,తెరచాపా తెడ్లతో తరగని అనుబంధమున్న 

అనుభవశాలి చేతి స్పర్శతో 

ప్రశాంతంగా వుంది సముద్రం

నీ హృదయమయినా అంతే 

అదుపు చేయగల చేతుల్లో పడితే 

పరవశించిపోతుంది పడవలాగే


చేపలు పడుతూ తీరం లో నేను

విస్తరిస్తూన్న ఊసరక్షేత్రం నా వెనకాతల 

సరిచేసుకోనా కనీసం నా నేలల్నయినా?



కూలిపోతోంది కూలిపోతోంది కూలిపోతోంది లండన్ బ్రిడ్జి

" సమయానికి గుర్తుకు తెచ్చుకోనా నా వ్యధ" 

అని పునీతం చేసే మంటలో పడిపోయాడతను మళ్ళీ

'ఇంతకీ నేను ఎప్పుడవుతాను వానకోకిల ని '

వానకోకిలా! ఓ వానకోకిలా!!

ప్రిన్స్ ఆక్విటీన్,అతని కూలుతూన్న కోటగోడ

ఇవి నా శిధిలాల నుంచి నేను కాపాడుకున్న శకలాలు

నిజమేనేమో నటన!

హేరోనిమోకి పిచ్చెక్కింది మళ్ళీ

దత్త.దయాధ్వం. దమ్యత.

శాంతి శాంతి శాంతి






సమాప్తం 



  

Friday 22 June 2012

చందమామను చుంబిస్తూ .....



చందమామను చుంబి స్తూ చచ్సిపోయిన వాడు....




చందమామ ప్రతిబింబాన్ని ముద్దాడబోయి మరణించిన మహాకవిని గురించి ఎపుడయినా విన్నారా? 

ఇది నిజమా  లేక కల్పనా అనేది ఇప్పుడు అప్రస్తుతం.

 ఒక జాతి సాంస్కృతిక జీవితం లో విడదీయరాని వాస్తవం గా నిలిచిపోయిన విషయం    ఇది. 

చిరస్మరణీయమయిన చైనా జానపద గాధలలో నిలిచిపోయిన ఆసక్తికమయిన ఒక వృత్తాంతం ఇది.


లి బో !  చైనా దేశానికి చెందిన ఒక మహాకవి.

 తాంగ్ యుగానికి చెందిన ఈ కవి క్రీ. శ . 701 - 762ల  మధ్య  జీవించాడు. 

చైనీయ సాహిత్య చరిత్రలో కవిత్వానికి సంబంధించినంత వరకూ అది ఒక స్వర్ణయుగం .

 కవి లి బో  దాదాపు వెయ్యికి పైగా పద్యాలు రాసాడని చరిత్ర చెబుతోంది. 

Three Hundred Tang Poems 

సంకలనం లో లి బో  కవితలు ముప్ఫయి నాలుగు వున్నాయి.


కవి లి బో   మరణం గురించి రకరకాల కథలు ప్రచారం లో వున్నాయి. 

 జీవితం లో అనేక ఆటుపోట్లు చూసిన  లి బో  మరణం చాలా సహజమయిందనే వాదనకూడా వుంది.

 కానీ అక్కడి ప్రజలు ఇవేవీ నమ్మరు.


అది ఒక వెన్నెల రాత్రి. యాంగ్ సి నది మీద పడవలో ప్రయాణం చేస్తున్నాడు లి బో.   

నీటి అలల మీద  తేలియాడుతూన్న చందమామ ప్రతిబింబం ఆయనను ఎంతగానో ఆకట్టుకుంది. 

అందమయిన చందమామ  ప్రతిబింబాన్ని ముద్దు పెట్టుకుందామనిపించింది అతనికి.

పడవమీంచి ముందుకు  ఒంగాడు. 

చందమామ   ప్రతిబింబాన్ని తన పెదవులతో తాకుతున్నాననే పరవశం లో తననుతానే మరచిపోయాడు. 

అమాంతంగా   పడవమీది  నుంచి యాంగ్ సి నదిలో  పడిపోయాడు.

 చైనా జానపద గాధలో, ప్రజల పాటల్లో అమరుడుగా  మిగిలిపోయాడు. 








చైనా కవి లి బో కవిత 


తెలుగు కవి 'గానా' అనుసృజన 



వెన్నెలలో మధుపానం 


పువ్వుల మధ్య మధుభాండం.

ఒక్కణ్నే వొంపుకుంటాను. మిత్రులెవరూ చెంత లేరు.

చషకమెత్తి చంద్రుణ్ని ఆహ్వానిస్తాను.

నా నీడతో కలిసి ముగ్గురమవుతాం.



చంద్రుడు తాగడు. 

నా నీడ నా ప్రతి కదలికనీ అనుకరిస్తుంది.

అయినా ఇప్పుడు నాకీ సాహచర్యం కావాలి.

వసంతం ముగియకముందే వేడుక చేసుకోవాలి.


నేను పాడతాను, చంద్రుడు ఊగుతాడు.

నేను నర్తిస్తాను, నా నీడ చిందులు వేస్తుంది.

నేను స్పృహలో ఉన్నంత సేపూ సంతోషాన్ని పంచుకుంటాం.

ఆపైన ఎవరి దారి వాళ్ళది.


ఎప్పటికీ మేము మానవీయబంధాలు లేని స్నేహం తో ఉంటాం.

రజతనది అంతమయ్యే చోట మళ్ళీ కలుసుకుంటాం.

-------------
    
రజతనది = పాలపుంత 


( అతి అరుదయిన  కవి గాలి నాసర రెడ్డి.  పుట్టుమచ్చ బ్లాగ్ కోసం ఈ కవితకు సంబంధించిన  
50 పైగా ఆంగ్ల అనువాదాలను పరిశీలించి   చేసిన  తెలుగు అనువాదం ఇది.)



వేస్ట్ ల్యాండ్ - 6




వేస్ట్ ల్యాండ్  - 6


చవిటిపర్ర 


టి.యస్.ఎలియట్ 


4

జల మృత్యువు 



పక్ష మయింది ఫినీషియన్ ఫ్లీబాస్ చచ్చిపోయి

సముద్రపు కొంగల మోత,ఉత్తుంగ తరంగాల ఘోష,లాభనష్టాల భాష

అన్నీ మరిచిపోయాడు

సముద్రగర్భం లో ఒక సుడిగుండం

గుసగుసలాడుతోంది అతని అస్థికలతో

లేస్తూ,పడుతూ, మునకలు వేస్తూ

వృద్ధాప్యం,యవ్వనాల దశలన్నీ దాటేస్తూ

అడుగిడాడు చివరికి సుడిగుండం లో

క్రైస్తవుడో, యూదుడో ఎవరైనా కానివ్వు

చక్రం తిప్పుతూ,గాలి వాలును గమనించే వాళ్ళారా

కాస్త ఫ్లీబాస్ కేసి చూడండి

ఒకనాడు అతడూ అందగాడు, మీలాగే నిలువెత్తయినవాడు...




Thursday 21 June 2012

వేస్ట్ ల్యాండ్ - 5


వేస్ట్ ల్యాండ్ - 5





చవిటిపర్ర 

టి.యస్. ఎలియట్ 






స్ట్రాండ్ మీంచి క్వీన్ విక్టోరియా వీధిలోకి వెళ్ళా

నగరమా ఓ నగరమా

అపుడపుడూ నేను అలా వింటూనే వుంటాను

లోయర్ టేంస్ వీధి పబ్లిక్ బార్ లోంచి వినిపించే శబ్దాల్ని

ఆహ్లాదకరమైన మేండలిన్ విషాద స్వరాల్ని

ప్లేట్ల గణగణల్ని,సాయంత్రాలు సేదదీరే జాలర్ల రణగొణ ధ్వనుల్ని 

శ్వేత,స్వర్ణ వర్ణాల్లో మేగ్నస్ మార్టీయర్ చర్చి గోడలపై

అయోనియన్ రీతిలో ఊహకందని  శ్వేత సువర్ణ నగిషీల కళాఖండాల్ని 


ఆయిల్,తారు

మారుతూన్న నీటివాలు
 
సాగుతూన్న పడవలు

విశాలమైన ఎర్రని తెరచాపలు

పడవ స్తంభం మీద 

గాలివాటుకు వంగుతూ 

వరుసలుగా వెళ్తూన్న దుంగల్ని 

గ్రీనిచ్ తీరం మీంచి 

ఐల్ ఆఫ్ డాగ్స్ దాటి 

తీసుకుపోతున్నాయి పడవలు

వియొలా లాలా లీలిల్లా 

వియొలా లాలా లీలిల్లా



పడవ సరంగులు 

ఎలిజబెత్, లెస్టర్ 

ఎరుపు బంగారు ఛాయ 

పోతపోసిన ఆల్చిప్పలాంటి పటిస్టమైన నావ

ఇరుతీరాలను తాకే చిరు అలలు 

ఎగసిపడే పొంగులు

నైరుతీ పవనాలు

నీటితో కలిసి ప్రవహించే

గంటల మోతలు

తెలతెల్లని గుమ్మటాలు

వెయలాలా లియలాలా

వల్లాలా లియల్లాలా



" ట్రాములూ ,దుమ్మూ ధూళిధూసరితమయిన చెట్లు 

జన్మ నిచ్చింది హైబరీ, నను నాశనం చేసింది రిచ్ మండ్,క్యూలు 

ఇరుకు పడవలో రిచ్ మండ్ పక్కన" 

" పడుకుని వెల్లకిలా పైకెత్తాను మోకాళ్ళు 

పాదాలు మూర్ గేట్ లో మనసేమో నా పాదాల్లో" 

' తంతు ముగిసింది ' అతను యేడ్చాడు 

' ఒక కొత్తబతుకు 'కి అభయమిచ్చాడు

" ఏమీ అనలేదు నేను. ఏమనగలను?"

" ఏ మాటమీద ఘర్షించను?

" మార్గేట్ శాండ్స్ హోటల్లో 

నేను శూన్యాన్ని శూన్యం తో జతపర్చగలను

మురికి చేతులు విరిగిన వేలిగోర్లు

ఏదీ ఆశించని సాదా సీదా జీవులు నా ప్రజలు 

లాలా 

చివరికి నేను కార్తేజ్ నగరానికి చేరుకున్నాను

మంట,మంట,కాల్చేసే మంట, కూల్చేసే మంట 

ప్రభూ నన్ను మంట నుంచి రక్షించు 

ప్రభూ నన్ను కాపాడు

మంట



( సశేషం ) 



Wednesday 20 June 2012

ఎలియట్ వేస్ట్ ల్యాండ్ - 4


ఎలియట్ వేస్ట్ ల్యాండ్ - 4




చవిటిపర్ర 

టి.యస్. ఎలియట్ 



అగ్ని ప్రవచనం 


పగిలిపోయింది నదీ గుడారం 

తడిసిన తీరపు టిసుకలో 

పాతుకుపోయిన ఆకుల ఆఖరి వేళ్ళు 

జేగురు మైదానం మీంచి మౌనంగా వీస్తున్నది గాలి 

అప్సరసలంతా వెళ్ళిపోయారు  


మధురమైన నా టేమ్స్ నదీ! ప్రవహించు మంద్రంగా 

నా పాట ముగిసే దాకా 


ఖాళీ సీసాలు లేవు సిల్కు రుమాళ్ళు లేవు అట్టపెట్టె ల్లేవు 

వేసవి రాత్రుల ఆనవాళ్ళు నదీ తీరం లో ఎక్కడా అసలు లేనే లేవు 

నదీకన్యలంతా వెళ్ళిపోయారు 

వాళ్ళ సావాసగాళ్ళూ , ధనిక నగరవాసుల ఆవారా వారసులూ 

ఎలాంటి ఆధారాలూ మిగల్చకుండా అంతా వెళ్ళిపోయారు 


లెమన్ సరస్తీరాన కూర్చుని రోదిస్తూ నేను 

మధురమైన నా టేమ్స్ నదీ ప్రవహించు మంద్రంగా 

నా పాట ముగిసేదాకా 

ప్రియమైన నా టేమ్స్ నదీ  ప్రవహించు మంద్రంగా 

స్వరం పెంచను సుదీర్ఘ సంభాషణం చేయను 


కానీ నా వెనుక ఓ ప్రచండ శీతల ఝం ఝా మారుతం 


వింటున్నాను విరిగిపోతూన్న ఎముకల పటపట ల విశాలపు 

నవ్వుల గలగలల్ని 


ఓ శీతాకాలపు సాయం సమయం 

గ్యాస్ హౌస్ వెనకాతల నీరసంగా ప్రవహించే కాలువలో చేపలు పడుతూ 

రాజు, నా సోదరుల నౌకాభంగం 

అంతకుముందే అస్తమించిన మహారాజు నా తండ్రిగారి గురించి ఆలోచిస్తున్నప్పుడు 

బురద బురదయిన ఒక ఎలుక తన ఉదరాన్ని యీడ్చుకొంటో 

ఒడ్డుమీది గడ్డిలో, పక్కనవున్న అడివిలోకి పోతోంది పాక్కుంటూ 

తడిచిన పల్లపు చిత్తడి నేలమీద తెల్లని నగ్న శరీరాలు 

పొట్టి గోడల చూరుల్లో పోగులు పడిన ఎముకలు 

ఉరుకులు పరుగులు తీసే ఎలుకలు తప్ప 

యేళ్ళు  గడిచిపోతున్నా పాదం మోపరు ఎవరూ 


కానీ వింటున్నాను నేను 

నా వెనుకనించి 

స్వీనీని వసంతం లో శ్రీమతి పోర్టర్ దరిచేర్చే 

హారన్లు, మోటారు కార్ల పిలుపులు 

అహో! శ్రీమతి పోర్టర్ మీదా ఆమె కుమార్తె మీదా 

చంద్రుడు చిందే వెన్నెల కాంతులు !

సోడా నీళ్ళతో వాళ్ళు కడుక్కుంటారు కాళ్ళు 

చర్చి గుమ్మటం లోంచి పిల్లల పాటలు 

మరీ అంత పచ్చి మొరటు అఘాయిత్యమా !

టెరియూ!!


అవాస్తవ నగరం 

జేగురు కావురు కమ్మిన చలికాలపు మధ్యాహ్నం 

పెరిగిన గడ్డం తో  స్మిర్నా వ్యాపారి యూజీనిడ్స్ 

కిస్మిస్ నిండిన జేబులు 

బిల్లులు, సరుకుల ధరలు, ఇన్స్యూరెన్స్ , నౌకాయానాల రశీదులు 

రకరకాల కాగితాలు కళ్ళముందు వుంచి 

కేనన్ స్ట్రీట్ హోటల్ లో లంచ్ 

మెట్రోపోల్ లో వీకెండ్ కి 

ఆహ్వానించాడు నన్ను నాసిరకం ఫ్రెంచి లో 


సాయంకాలపు  ఊదా రంగు ఘడియలు 

డెస్క్ మీంచి చూపులు పైకి లేచే వేళ 

ఆడుతూన్న ఇంజన్ తో ఎదురు చూస్తూన్న ట్యాక్సీ మానవ యంత్రం 


నేను అంధ టైరీషియస్ ని 

రెండు నిండు జీవన సంస్పందనల్ని సంతరించుకున్న వాణ్ని 

ముడుతలు పడి  వేలాడే ఆడదాని 

రొమ్ములు గలవాణ్ని, ముసలివాణ్ణి 

అయినా వీక్షించగలను 

సాయంకాలపు ఈ ఊదా రంగు సమయాన్ని 

జనం తిరిగి ఇళ్ళకు వెళ్ళిపోయే వేళ 

నావికుడు సముద్రం నుంచి తిరుగుముఖం పట్టే వేళ 

టీ వేళకి టైపిస్టు చేరుకుంటుంది ఇంటికి

అల్పాహారం అంట్లు సర్ది అంటిస్తుంది స్టవ్వు

టిన్నుల్లోకి సర్దుతుంది తాజాగా భోజనాన్ని

కిటికీ కవతల చర్చి కెదురుగా తీగెమీద వేలాడుతూ

సూర్యుని ఆఖరి కిరణాలను స్పర్శిస్తూ ఆరేసిన ఆమె లోదుస్తులు

అదే రాత్రి వేళల్లో పానుపుగా మారే దివానుమీద

కుప్పలుగా తొడ పట్టీలూ, చెప్పులూ, రబ్బరు రవికెలూ , మేజోళ్ళూ


నేను, ముడుతలు దేరిన చను రొమ్ముల ముదుసలి టైరీ షియస్ ని

తిలకించాను ఈ దృశ్యా న్ని

ముందుగానే వివరించాను జరగబోయే తతంగాన్ని

ప్రతీక్షించాను నేను సయితం

ఎదురు చూసిన ఓ అతిధి కోసం

నవయువకుడు మొటిమలు దేలిన ముఖం

ఒక సాధారణ ఏజంటు గుమాస్తా

అదురూ బెదురూ లేనివాడు

బ్రాడ్ ఫర్డ్ మిలియనీరు నెత్తిమీది టోపీలా

అతని ముహానికి నప్పిన చవకబారు పొగరు

ఇదే అదను అనుకున్నాడతను

ముగించిందామె భోజనం

ఆమె ముఖం మీద అలసట, తోచనితనం

ముగ్గులోకి దింపేందుకు ముమ్మరించాడు ప్రయత్నం

అంగీకరించదూ ప్రతిఘటించదూ


ఎర్రబారిన వాంఛా కృతనిశ్చయం

మరుక్షణం కత్తిలాంటి మెరుపుదాడి

వెతుకుతూన్న హస్తాలకు ఎదురనేది లేనేలేదు

అతని అహంకారానికి ఆమె ప్రతిచర్యతో పనేలేదు

అనాసక్తినే అంగీకారమని భావించాడతను

( నేను, టైరీషియస్ ని ఆ దివానులాంటి పానుపు మీద

సాగుతూన్న నాటకాన్ని ప్రదర్శనకి పూర్వమే అనుభవించి వున్నవాణ్ణి !!

పాతాళపు లోతుల్లో అట్టడుగున పడివున్న ధీబ్స్ నగర కుడ్యాల పక్క

మృతకళేబరాల మధ్య సంచారం చేసినవాణ్ణి )

ఆఖరి చుంబనం అతని అంతిమ వీక్షణం

తిరుగుముఖం పట్టాడు

తడుముకుంటూ మెట్లను చీకట్లో

లిప్తపాటు చూసుకుంది అద్దం లో ముఖాన్ని

వెళిపోయిన ప్రియుని ధ్యాస  లేదామెకు లవలేశం

ఏదో అపరిపక్వ ఆలోచనకు అనుమతించింది మస్తిష్కం

'అయిందేదో అయింది యిక చింతించటం దేనికీ

ఒక అందమయిన అమ్మాయి పొరపాటున దిగజారినప్పుడు

గదిలోనే ఒంటరిగా ఆమె నడయాడుతూన్న చప్పుడు

యాంత్రిక హస్తం తో సవరించుకుంది అద్దం లో కురుల్ని

గ్రామఫోన్ మీద అమర్చింది అచేతనంగా ఒక రికార్డుని

' నీటిమీద ఇదే పాట నను ఒరుసుకుంటూ సాగింది '




( సశేషం )

Tuesday 19 June 2012

అచ్చుకెక్కని శ్రీశ్రీ పాట




సంపుటాలకు ఎక్కని శ్రీశ్రీ సినిమా పాట 


తెలుగు కవిత్వాన్ని భూమార్గం పట్టించిన మహాకవి శ్రీశ్రీ సినిమా పాటలమీదా తనదయిన బలమయిన ముద్ర 


వేశాడు. అజరామరం అనదగిన పాటలు అనేకం రాశాడు. ఇంతవరకూ ఏ సంపుటాలలోనూ అచ్చుకాని ఈ పాట 


1982 మే 5 వ తేదీన  రాశాడు. ' అంకురం  '  ఫేమ్ సి. ఉమామహేశ్వరరావు దర్శకత్వం వహించిన


' పూలపల్లకీ '   సినిమా కోసం రాసిన గీతం ఇది. శ్రీశ్రీ  సినిమా పాటల సంపుటాలలో ఈ పాట లేదు. 


మహాకవి శ్రీశ్రీ రాసిన  ఈ పాటను   సేకరించి ఇచ్చిన   మిత్రుడు  శ్రీశ్రీ  విశ్వేశ్వరరావు కి కృతఙ్ఞతలు.




మహాకవి శ్రీ శ్రీ

పాట 


ఈ యింటిలో దీపమై హాయిగా

నా కంటిలో పాపవై జాలిగా


నా నీడలో నిద్ర  పోరా

నా గుండెలో నిల్చి పోరా||


దగా నిండు  రేయిదీ , దయా దృష్టి  లేనిదీ,

విలాసాల కోసమే ధనం జల్లు వానిదీ!

విడనే విడదు విషాదాల చీకటీ,

విలాపాలగాద వేధించే బాధ

భరించాలి నాయనా || ఈ ||


ప్రపంచాన్ని కాదనీ, భయం నాకు లేదనీ

ప్రమాదాల దారినే ప్రయాణించి నానులే

పగతో జగమే పరీక్షించు వేళలో

మహాదీక్ష బూని డెందాన ధైర్యం (మది )

వహించాలి నాయనా ||ఈ ||








.