Friday 15 June 2012

ఒక నిముషం మౌనం



కవితాపఠనం ప్రారంభించటానికి ముందు ఒక నిముషం మౌనం 


ఇమ్మానుయేల్ ఓర్టిజ్



నేను ఈ కవితాపఠనం ప్రారంభించటానికిముందు 

ఒక నిముషం మౌనం పాటించాలని నా మనవి

సెప్టెంబర్ పదకొండో తేదీ వరల్డ్ ట్రేడ్ సెంటర్,పెంటగాన్ లలో మరణించినవాళ్ళ స్మృత్యర్థం, దీనికి ప్రతీకారంగా

కొనసాగిన  దాడుల్లో వేధింపులకు గురయినవాళ్ళ కోసం, జైళ్ళ పాలయినవాళ్ళ కోసం, ఆచూకీ కూడా తెలియ

కుండా అంతమయిపోయినవాళ్ళ కోసం, చిత్రహింసలు అనుభవించినవాళ్ళకోసం, మానభంగాలకు గురయిన

వాళ్ళకోసం లేదా చంపేయబడినవాళ్ళకోసం, ఆఫ్గనిస్తాన్, అమెరికా దేశాల్లోని బాధితులకోసం  దయచేసి 

మరో నిముషంపాటు మౌనం.


దయచేసి మీరందరూ మన్నించి నన్ను అనుమతిస్తే.....


అమెరికా ప్రోద్బలం తో దశాబ్దాలుగా దురాక్రమణని కొనసాగిస్తూన్న ఇజ్రాయిల్ సైన్యాల చేతుల్లో ప్రాణాలు 

కోల్పోయిన  వేలాదిమంది పాలస్తీనియన్ లకోసమొక దినమంతా అనగా 24 గంటలపాటు మౌనం. 

తమ దేశానికి వ్యతిరేకంగా పదకొండు  సంవత్సరాలపాటు సుదీర్ఘంగా కొనసాగిన ఆంక్షల ఫలితంగా 

పోషకాహార లోపం తో, ఆకలితో, కరువులతో, అమెరికన్  బాంబుల వర్షం తో బలి అయిపోయిన  

పసి శిశువులతో సహా పదిహేను లక్షల పైచిలుకు ఇరాకీ ప్రజల నిండు ప్రాణాల కోసం 

ఆరుమాసాలపాటు మౌనం.  


నేను ఈ కవితాపఠనం ప్రారంభించటానికి ముందు.....


జాత్యహంకార వర్ణ వివక్షా సామ్రాజ్యం లో స్వదేశీ భద్రతావ్యవస్థ పుణ్యాన పుట్టిపెరిగిన దేశంలోనే అపరిచితులుగా 

కాలం  ళ్ళదీస్తున్న దక్షిణాఫ్రికా నల్లజాతి ప్రజలకోసం రెండు మాసాలపాటు మౌనం. కాంక్రీటునీ, ఇనుమునీ, 

భూమినీ,  శరీర చర్మాల్నీ పొరలు పొరలుగా వలిచేస్తూ కురిసిన ప్రచండ మృతువర్షం లో మరణించిన 

  హిరోషిమా, నాగసాకీల  మృతదేహాల కోసం, ప్రాణాలతో మిగిలి జీవఛ్చవాల్లా తిరుగాడుతూన్న 

విగతజీవుల కోసం తొమ్మిది మాసాల మౌనం.  ఒక ఏడాదిపాటు మౌనం లక్షలాది వియత్నాం 

మృతదేహాల   కోసం.......వియత్నాం అంటే యుద్ధం కాదు, అది ఒక   దేశం పేరు. 

సంవత్సరం మౌనం ఒక రహశ్య యుద్ధం సాగించిన వేటకి ఎర అయిన   వాళ్ళు.  

   ...ష్ ...ష్   ష్...కాస్తంత   మెల్లిగా మాట్లాడండి, తాము చనిపోయామనే వాస్తవం 

వాళ్ళు తెలుసుకోవాలని  మేం కోరుకోవటం లేదు.....  .కాంబోడియా,   లావోస్ మృతులకోసం  

 రెండు నెలల మౌనం. దశాబ్దాలపాటు గుట్టలుగా  పేరుకుపోయిన వాళ్ళ శవాలలాగే 

అంతర్ధానమై చివరికి మన   నాల్కలమీంచి సయితం అంతర్ధానమయిన వాళ్ళ  పేర్లకు ప్రాధాన్యం వహించే  

కొలంబియా   మృతుల కోసం.


నేను ఈ కవిత చదవటం ప్రారంభించటానికి ముందు...


ఒక గంట సేపు మౌనం ఎల్ సాల్వదార్ కోసం....

ఒక మధ్యాహ్నం పాటు మౌనం నికరాగువా కోసం....

రెండు నిండు దినాల మౌనం గ్వాటెమాలావాసుల కోసం....

తమ జీవితం లో వీళ్ళంతా కనీసం ఒక క్షణం పాటు ప్రశాంతతని కూడా నోచుకోనివాళ్ళు. నలభై అయిదు సెకండ్ల  

మౌనం యాక్టియల్, బియాపాస్ లలో మరణించిన నలభై అయిదు మంది కోసం. ఏ సమున్నత గగన చుంబిత

నిర్మాణం కన్నా లోతుగా సముద్రం లో సమాధి అయిన   కోట్లాదిమంది ఆఫ్రికన్ బానిసల కోసం,

 వాళ్ళ  అవశేషాలను గుర్తించటానికి ఎలాంటి డి ఎన్ ఏ టెస్ట్ లూ డెంటల్   రికార్డులూ   వుండవు. 

సైకామోర్ చెట్ల మీంచి  వేలాడుతూ దక్షిణం, ఉత్తరం, తూర్పు, పడమరలకు మధ్య ఊగులాడే   

నల్లజాతి  మృతదేహాల కోసం.  

వంద సంవత్సరాల మౌనం. 

పైన్ రిడ్జ్, వూండెడ్ నీ, శాండ్ క్రీక్, ఫాలెన్ టింబర్స్,ట్రయల్ ఆఫ్ టియర్స్ లా పిక్చర్ పోస్ట్ కార్డ్ లకన్నా

 అందమయిన  స్థలాల్లో భూముల్నీ, జీవితాల్నీ పోగొట్టుకున్న ఇదే ఈ   అమెరికా మహాద్వీపానికి 

చెందిన మూలవాసుల కోసం, ఇప్పుడిక ఈ పేర్లు మన చేతనా రిఫ్రిజిరేటర్ల మీద అతుక్కుపోయిన అయస్కాంత 

కవితా వాక్యాలు మాత్రమే.

అయితే మీకు కావాలన్న మాట ఒక నిముషం మౌనం!

మాటల్ని పోగొట్టుకుని మూగగా మిగిల్చబడిన వాళ్ళం మేం 

మా నోళ్ళలోంచి పెరికివేశారు నాలుకల్ని 

మా కళ్ళను కుట్టేశారు 

ఒక మౌన క్షణం 

కవులందరినీ ఖననం చేశారు

మట్టి పాలయ్యాయి డప్పులన్నీ 


నేను ఈ కవితాపఠనం ప్రారంభించటానికి ముందు 

మీరు ఒక క్షణం పాటు మౌనం కోరుకుంటున్నారు


ఇకముందు ఈ ప్రపంచం మునుపటిలా ఉండదేమోనని మీ బాధ 

ఎట్టి పరిస్థితిలోనూ మునుపటిలా ఉండకూడదన్నది మా అందరి కాంక్ష

ఇది సెప్టెంబర్ 11 ను గురించిన కవిత్వం కాదు

ఇది సెప్టెంబర్ 10ని గురించిన కవిత్వం 

ఇది సెప్టెంబర్ 9ని గురించిన కవిత్వం

ఇది సెప్టెంబర్ 8, సెప్టెంబర్ 7ల గురించిన కవిత్వం

ఇది 1492 గురించిన కవిత్వం 

ఇది ఇలాంటి కవితలు రాయాల్సిన అవసరాన్ని కల్పించిన కారణాలను గురిచిన కవిత్వం.

 ఒక వేళ సెప్టెంబర్ 11ని  గురించిన కవిత్వమే అయితే అప్పుడిది 1971 సెప్టెంబర్ 11 నాటి

 చిలీ దేశం గురించిన కవిత్వం. ఇది 1977 సెప్టెంబర్  12 నాటి దక్షిణాఫ్రికా, స్టీవెన్ బీకోల

 గురించిన కవిత్వం.ఇది 1971 సెప్టెంబర్  13 న్యూయార్క్ ఏటికా జైల్లో బందీలుగా 

ఉన్న మా బంధుమిత్రులను గురించిన   కవిత్వం.      

ఇది 1992 సెప్టెంబర్ 14 నాటి సోమాలియా గురించిన కవిత్వం 

ఇది నేలరాలి ధూళి కలిసిన సమస్త తిధి వార నక్షత్రాలను గురించిన కవిత్వం. 

ఇది అన్ని తేదీలను గురించిన  కవిత్వం. చరిత్ర పుస్తకాల్లో ప్రస్తావనకు రాని 110 గాధలు,

 సి ఎన్ ఎన్, బిబిసి, ద న్యూయార్క్ టైంస్,    న్యూస్ వీక్ లు  విస్మరించిన 110 గాధలు. 

ఇది ఎప్పటికీ విప్పిచెప్పబడని 110 గాధల్ని గురించిన  కవిత్వం.

ఇది నిర్విఘ్నంగా కొనసాగుతూన్న కార్యక్రమం లో అంతరాయం కల్పించే కవిత్వం.

అయినా సరే మీ మృతుల స్మృతికి మీకు మరో నిమిషం మౌనం ఇంకా కావాలి?  

మీకు మేం జీవితమంత శూన్యం ఇవ్వగలం

ఆనవాళ్ళు లేని సమాధుల్ని ఇవ్వగలం 

శాశ్వతంగా అంతర్ధానమయిపోయిన భాషల్ని ఇవ్వగలం

కూకటి వేళ్ళతో సహా పెకలింపబడిన వృక్షాల్నీ,ఇతిహాసాల్నీ,

అనామకులయిన పసిపిల్లల ముఖాలమీద తారాడే మృత్యుదరహాసాల్నీ ఇవ్వగలం.

ఈ కవితాపఠనం ప్రారంభించటానికి ముందు మేం శాశ్వతంగా మౌనముద్రాంకితులం కాగలం

లేదా ఈ మట్టిలో మట్టిగా కలిసిపోగలం

అయినా కోరుకుంటారు మీరు 

మానుంచి కాసింత మౌనం 

మీకు కావాలనుకుంటే నిజంగా ఒక నిముషం మౌనం

తక్షణం ఆపేయండి ఆయిల్ పంపుల్ని 

కట్టేయండి ఇంజన్లనీ, టెలివిజన్లనీ 

ముంచేయండి సముద్రాల్లోని క్రూయిజ్ నౌకల్ని

కుప్పకూల్చేయండి స్టాక్ మార్కెట్లని 

ఆర్పేయండి రంగురంగుల మెర్క్యురీ విద్యుద్దీపాల్ని

డిలీట్ చేసేయండి ఇన్ స్టెంట్ మెస్సేజీ లన్నింటినీ 

తప్పించండి పట్టాల్నించి రైళ్ళనీ, లైట్ రైల్ ట్రాన్సిట్ నీ

మీకు కావాలంటే ఒక నిముషం పాటు మౌనం ట్యాకోబెల్ కిటికీకి గురిపెట్టి గట్టిగా ఒక ఇటుకరాయి విసరండి. 

చెల్లించని కార్మికుల  వేతనాలను వాపసు చేయండి. ధ్వంసం చేయండి మొత్తం సారాయి 

దుకాణాల్ని. మొత్తానికి మొత్తం టౌన్ హౌసుల్నీ,వైట్ హౌసుల్నీ, జైల్ హౌసుల్నీ,పెంట్ హౌసుల్నీ,ప్లేబాయలనీ 

మీరు పాటించాలనుకుంటే ఒక నిముషం మౌనం 

" సూపర్ బౌల్ సన్ డే " రోజు మౌనంగా ఉండండి 

ఫోర్త్ ఆఫ్ జూలై రోజు

13 గంటలపాటు సుదీర్ఘంగా సాగే డేటన్ సేల్ రోజు 

లేదా మరోరోజు అందమయిన మా ప్రజలందరూ గుమిగూడినపుడు,గది నిండిన మీ శ్వేత అపరాధభావన 

మిమ్మల్ని వేధించినప్పుడు

మీకు కావాలనుకుంటే ఒక నిముషం పాటు మౌనం 

తీసుకోండి తక్షణం 

ఈ కవితాపఠనం ప్రారంభించటానికి ముందు.....




ఫుట్ నోట్స్:

1.1492 లో కొలంబస్ అమెరికా మహాద్వీపం మీద పాదం మోపాడు.

2.ట్యాకోబెల్ - అమెరికాలోని ఒక అతి పెద్ద ఫాస్ట్ ఫుడ్ చైన్.

3. " సూపర్ బౌల్ సన్ డే " - అమెరికా ఫుట్ బాల్ నేషనల్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ రోజు. అమెరికాలో ఇది ఒక అనధికార జాతీయ సెలవుదినం.

4. ఫోర్త్ ఆఫ్ జూలై - అమెరికా స్వాతంత్ర్య దినం.జాతీయ సెలవుదినం.4 జూలై 1886న అమెరికాలో ' డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ' అమలులోకి వచ్చింది.

5. డేటన్ - మినియోపోలిస్ అనే అమెరికన్ నగరానికి చెందిన ఒక ముఖ్యమయిన డిపార్ట్ మెంటల్ స్టోర్.




ఇమ్మాన్యుయేల్ ఓర్టిజ్ 

పుయర్టీరీకో మూలానికి చెందిన అమెరికన్ కవి. కవులతో ఐక్యసంఘటన నిర్మించేందుకు కృషి చేస్తున్న ఉద్యమకారుడు.ఆది అమెరికా మూలవాసులు,ప్రవాస ప్రజాసముదాయాలు,అల్పసంఖ్యాకవర్గాల  
హక్కుల పరిరక్షణ కోసం పని చేస్తున్న అనేక ప్రగతిశీల సంఘాలలో క్రియాశీల కార్యకర్త.                 
     



  

4 comments:

  1. ఓర్టిజ్ రాశారా ఈ కవితను? ఎంత అద్భుతంగా ఉందో!

    చూపు తిప్పుకోనీకుండా అలా వరసగా దూసుకొచ్చిన వాక్యాలను చదివేస్తుంటే... ఉద్వేగం ఆవరించింది. ఈ కరుణ రసాత్మక బీభత్స కవితకు పికాసో ‘గెర్నికా’ సముచిత ప్రతీక!

    ReplyDelete
  2. ఒక్క నిముషమా?? :)

    ReplyDelete