Monday 8 October 2012

మరణోత్సవం



మరణోత్సవం


అరబీ మూలం: అడోనిస్



వెనకాతల్నుంచే వస్తుంది మృత్యువు

తీరా అది మన ముందుకువచ్చి

నిలబడినప్పుడు కూడా



తలపడేది కేవలం జీవితమే


కళ్ళు ఒక రహదారి

రహదారి ఒక చౌ రస్తా 


ఒక పసివాడు 

ఆడుకుంటాడు జీవితంతో 

ఒక ముసలివాడు 

సాగిపోతుంటాడు దాని సాయంతో 


అతిగా మాట్లాడితే తుప్పు పడుతుంది నోట్లో 

యెండిపోతాయి కళ్ళు కలల లేమితో 


ముడుతలు -

ముఖం మీది కాల్వలు,

గుండె లోపలి గోతులు.



ఒక దేహం -

సగం వాకిలి,

సగం వంగిపోవటం.


ఒక ఒంటి రెక్క 

సీతాకోక చిలుక  దాని శిరస్సు.


మృత్యువు నిన్ను రాసేసినపుడు 

చదివేస్తుంది నిన్ను ఆకాశం 


ఆకాశానికి రెండు స్తనాలు,

అందరూ గ్రోలేది అందులోంచే 

ప్రతీ క్షణం,ప్రతీ చోటా.


మనిషి ఒక పుస్తకం 

జీవితం పఠిస్తుంది దాన్ని నిరంతరం

హఠాత్తుగా చదువుతుంది మృత్యువు 

ఒక్కసారే కేవలం.   

------------
సాహితి , ఆంధ్రభూమి , సోమవారం 8 అక్టోబర్ 2012