Wednesday 30 May 2012

వాని బాస వేరు !






వాని బాస వేరు !

 

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తిరుపతి వెంకట కవుల్లో ఒకరయిన చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారి ప్రియశిష్యుడన్నది జగమెరిగిన సత్యం. సత్యనారాయణ గారి కవిత్వాన్ని ప్రశంసిస్తూ చెళ్ళపిళ్ళ వారు ఒక సందర్భంలో '  వాని బాస వేరు ' అన్నారట. ఈ విషయాన్ని సత్యనారాయణ గారు రెండు మూడు సందర్భాలలో  అక్కడక్కడా ప్రస్తావించటం కూడా జరిగింది. ఈ విషయం మహాకవి శ్రీ శ్రీ ముందు ఓ సందర్భంలో ప్రస్తావనకు వచ్చింది. తిక్కన సోమయాజి తెనిగించిన మహాభారతంలో బకాసురుని దృష్టిని తనవైపుకు తిప్పుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేసి విఫలుడయిన భీమసేనుడి నోటినుంచి తిక్కన  ' వీని బాస వేరు ' అని పలికించాడని శ్రీ శ్రీ వ్యాఖ్యానించాడు.








Monday 28 May 2012

అచ్చుకాని ' మో ' కవిత


( పాత కాగితాలు సర్దుకుంటూ వుంటే మాస్టారి కవిత కనిపించింది. ఈ కవిత మాస్టారు డిక్టేట్ చేస్తుండగా నేను రాసింది. సందర్భం మొదటిసారి ఆయన కాలు విరగటం. ఆరోజు ' భ్రమణ కాంక్ష ' రచయిత ఆదినారాయణ తదితరులు  ఉన్నారు. ఆయన పడిపోయిన రోజు మాస్టారి సహోద్యోగి తాటి శ్రీకృష్ణ  ఆయనతోపాటు రాత్రంతా గడిపారు. మాస్టారు ఈ కవితకు శీర్షిక  పెట్టలేదు .  )


అచ్చుకాని ' మో ' కవిత


భ్రమణకాంక్ష 

రమణమహర్షి 

పక్కనే చాపకూడా లేని  శ్రీకృష్ణ విన్యాసం 

మేష్టారు పడుకుంటూ పడిపోయారు 

మేష్టారు పడిపోతూ పడుకుంటారు  

ఈ లోగా చెంబో తపేళో  తెచ్సుసుకోవాలి కదా

ఈలోగా నా నిద్రార్ధరాత్రిలో 

నేను నిద్రోతానేమోనని నా భయం 

ఈలోగా టెలీఫోన్లన్నీ మోగుతుంటై అనుకో

అక్షరాలు ఆశ్చర్యా లవుతా యనుకో 

నిమ్మళంగా నిదానంగా ఎవ్వడో ఎవడి చేతబడి పోయాడో 

తెలియని దీన దుఃఖంలో 

సూదిదారపు సందులో 

తొమ్మిదో వెన్నుపూసలో 

చిరుసవ్వడి ప్రేమపుష్ప సరాగలీనంలో

ఓసుకోమన్నాను  కాదా 

నా ఎడం కాలి ఆత్మని రక్తాక్షర బీజా లెవరిచ్చారో తెలీదు 

ఓ గుండె పూల వాసనలకి 

రక్తాన్ని సాపకింద కన్నీరులా పెట్టుకుని .....







Friday 25 May 2012

తలో మాట !


 

తలో మాట !




Form బలహీనంగా వుందంటే contentకి సంబంధించిన అనుభూతి గాడమయింది కాదనే అర్ధం.
 Form వస్త్రం కాదు, చర్మం. శరీరం మీది వస్త్రం విడిపోతుంది కానీ చర్మం కాదు.
 క్రోచే 

*************

Poetry is an exploration in to the possibilities of a language.

ఒక భాషలోని సాధ్యాసాధ్యాలన్నింటినీ సాధించటానికి చేసే ప్రయత్నమే కవిత్వం.

 ****************


 Poetry is best words in the best order.

సరయిన పద్ధతిలో అమర్చిన సరయిన మాటలే కవిత్వం.
కాలరిడ్జ్ 

 *********************


అధివాస్తవికత యొక్క అనేక సంకల్పాలలో ఒకటి, ' to systematize confusion ' గందరగోళాన్ని ఒక దారిలో పెట్టడం.
శ్రీశ్రీ 

*************************


Thursday 24 May 2012

కవి - కమిస్సారు - కవి


కవి - కమిస్సారు - కవి 

అనుభవానికి ఆధారం ఆచరణ. అనుభూతికి పునాది అనుభవం. అనుభవం భాషలో అభివ్యక్తం అయినపుడు అది 
అనుభూతిగా   రూపాంతరం చెందుతుంది. అంటే  భాష వెలుపలి అనుభవం లేదా ఆచరణ భాష లోపలి అనుభూతి అవుతుంది. ఆచరణ, అనుభూతుల సృజనాత్మక సమ్మేళనమే సాహిత్యం లేదా కవిత్వం. అనుభూతి తీవ్రత కవిత్వాన్ని సాంద్ర తరం చేస్తుంది. ఆచరణలోని నిజాయితీ కవిత్వాన్ని సార్ధకం చేస్తుంది. అల్పమయిన జీవితం నుంచి అత్యున్నత మైన కవిత్వం పుట్టదు  గాక పుట్టదు. 

కానీ చాలా మంది తెలుగు కవులు వాళ్ళ కవిత్వం కన్నా చాలా చాలా చిన్నవాళ్ళు.  అందుకే, కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది వాళ్ళ కవిత్వం. సాధన వీళ్ళ ఏకైక సాధనం. పాఠకీయ    సౌఖ్యమే ఈ కవిత్వానికి పరమావధి.  వివి గా సుపరిచుతుడయిన వరవరరావు ఇందుకు ఒక మినహాయింపు. వివి వ్యక్తిత్వం, జీవితం ఆయన కవిత్వంతో పోలిక లేనంత పెద్దది, లోతైనది, విశాలమైనది. దానిముందు ఆయన కవిత్వం చాలా చాలా చిన్నది. అందుకే కవి కన్నా వివి అనే పదానికి ( లేదా పేరుకి ) విలువ ఎక్కువ. సాధన కాదు, జీవించటమనే జటిలమైన ప్రక్రియనుంచి విడదీయటానికి వీల్లేని అంశం వివి కవిత్వం.
ప్రధానంగా వివిది పాఠకీయ సౌఖ్యానికి ప్రతికూలమయిన  కవిత్వం.

వ్యక్తికీ, సమాజానికీ మధ్య ఘర్షణ కి మూలం వ్యక్తులకీ, రాజ్యానికీ మధ్య వుండే ఘర్షణలో ఉంటుందని విశ్వసిస్తుంది
 మార్క్సిజం. అత్యంత శాస్త్రీయమైన ఈ అవగాహనతో పాబ్లో నెరూడా, నాజిమ్ హిక్మత్ లు అంతర్జాతీయంగా కవిత్వ ప్రపంచానికి కొత్త అర్దాలనీ, అందాలనీ, విదులనీ, విధానాల్నీ అందించారు. తెలుగు కవిత్వంలో ఈ కర్తవ్యాన్ని అత్యంత శక్తివంతంగా నిర్వర్తించిన వాళ్ళు శివసాగర్, వివిలు.
 వివి కవిత్వానికి ప్రాతినిధ్యం వహించే ఈ కవితా సంకలనాల సంపుటం ఏకకాలంలో వివి మానసిక ప్రపంచాన్ని ఆవిష్కరించే ఒక ల్యాండ్ స్కేప్, ఒక సీ స్కేప్, ఒక మౌంటయిన్ స్కేప్, ఒక స్కై స్కేప్.

సాంస్కృతిక రంగం వివి ప్రధాన కార్యక్షేత్రం అయినప్పటికీ అసలు చోదకశక్తి అయిన రాజకీయోద్యమంతో బలమయినది ఆయన అనుబంధం. సాంస్కృతిక ఉద్యమం ప్రతినిధిగా రాజకీయ ఉద్యమంతోనూ, రాఈకీయ ఉద్యమ ప్రతినిధిగా  తన సాస్కృతికోద్యమ సహచరులతోనూ అనివార్యమయిన అంతస్సంఘర్షణల తాలూకు ఆనవాళ్ళు  ఈ బృహత్ సంకలనంలో స్పష్టంగా సాక్షాత్కరిస్తాయి. ఈ కవితలు స్థూలంగా రెండు రకాలు. ప్రత్యక్షంగా రాజ్యంతో వివాదానికి తలపడేవి కొన్ని. స్వగతంతోనూ, సమాజంతోనూ సంవాదదం జరిపేవి మరి కొన్ని. తనతోనూ, తన చుట్టూ వున్న ప్రపంచంతోనూ తాను జరిపిన వాద, వివాద, సంవాదాల సారాంశమే వివి కవిత్వం.

వస్తువుల్ని వాటి అసలయిన పేర్లతో పిలిచే నైతిక సాహసం వివి కవిత్వంలోనూ, జీవితంలోనూ కొట్టొచ్చినట్టు కనిపించే అసాధారణమైన లక్షణం. వివి కవితలు దుర్లభమైన దుర్భిణీలు. తీవ్ర నిర్బంధాలను సయితం ప్రతిఘటించి నిర్భయంగా పలికిన నిజాలు. అబద్ధాలకు తప్ప అభివ్యక్తికి ఆస్కారం లేనపుడు అతిచిన్న నిజం కూడా అణు విస్ఫోటనాన్ని సృష్టిస్తుంది. వివి కవిత్వంలో వున్నది పచ్చి నిజాలకు వుండే విస్ఫోటనా శక్తి. వెంకట చలంగారి భాషలో చెప్పాలంటే అది  ' సూనృత శక్తి .

సంకెళ్ళను ఛేదించటం నేర్పిన మార్క్సిజం చాలా మందికిలా వివి ఆలోచనలకు ఎన్నడూ సంకెళ్ళుగా మారలేదు. ఆర్ధిక సిద్ధాంతాలు గాక మార్క్సిజంలోని మానవతావాదానికీ సూఫీతత్వానికీ ఎంతో సారూప్యం ఉంది. అందుకే ఆయన సూఫీతత్వంలో మార్క్సిజం మూలాలను చూడగలిగాడు. సమాజంలో జరిగే ప్రతీ కీలకమైన సంఘటన పట్లా భావోద్వేగాలకు లోనుగావటం చాలా మందిలో జరుగుతుంది. ఆ భావోద్వేగాలను తిరిగి ఉద్యమంగా మలచటం మాత్రం వివి వంటి వాళ్ళకే సాధ్యమవుతుంది. అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలే ఈ సంకలనం లోని అనేక కవితలు. ఈ ఉద్వేగాలు పునాదులుగా ఉనికిలోకి వచ్చిన ఉద్యమాలను సామాజిక చరిత్ర తిరిగిన వివిధ మలుపులలో మనం గమనించవచ్చు.

పిల్లలకీ, తనకీ తప్ప ప్రపంచానికి తెలియని పార్శ్వాలు కొన్ని వివి లో ఉన్నాయని రాశారు హేమలత. ఇది అర్ధ సత్యం. ప్రపంచంతోపాటు హేమలతగారికీ, పిల్లలకీ కూడా తెలియని పార్శ్వాలు సయితం వివిలో వుంటాయి.

శ్రీశ్రీ అభిమాన కవుల్లో ఒకడయిన లూయీ ఆరగా ఒకసారి ఈ నేలమీద సజీవంగా వున్న కవుల్లో యానిస్ రిట్జాస్ ని మించినవాడు మరొకడు లేడని ప్రశంసించాడు. ( మహాకవి శ్రీశ్రీలాగే గ్రీకు విప్లవకవి రిట్జాస్ ది కూడా ఇది శతజయంతి సంవత్సరం ). లూయీ ఆరగా ప్రశంస తెలుగు నేలమీది కవుల్లో ఒక్క వివికి మాత్రమే నూటికి నూరుపాళ్ళూ నప్పుతుంది.

విరసం తన శాశ్వత చిరునామా అని ప్రకటించాడు శ్రీశ్రీ. ఇది వాస్తవం కాదు, అతిశయోక్తి. చిరునామాగా మాత్రమే కాదు, విరసమే తన సర్వస్వంగా జీవించిన వ్యక్తి వివి. ఇది అతిశయోక్తి కాదు, పచ్చి నిజం. నిజానికి విరసానికి వివి ఒక శాశ్వత చిరునామా. ఇది అవాస్తవం కాదు, ఒక చిన్న అతిశయోక్తి.

కవిత్వం ఎక్కణ్ణించి మొదలవుతుందో, కవిత్వం ఎక్కడిదాకా వచ్చి ఆగిపోతుందో స్పష్టంగా తెలిసిన కవి వివి. కవిత్వం ఆగిపోయిన చోటినుంచి ఆయన కమిస్సారుగా ప్రారంభమవుతాడు. కవినుంచి కమిస్సారుగా, కమిస్సారునుంచి తిరిగి కవిగా జరిగిన చైతన్యపూరితమయిన పరిభ్రమణమే వివి జీవితం. వివి జీవితానుభవాలకు సృజనాత్మక సంస్కరణలే ఈ సంకలనంలోని కవిత్వాలు.





  
         

Wednesday 23 May 2012

కవి ఒక దురదృష్ట జీవి!

 



కవి ఒక దురదృష్ట జీవి!

విజయ్ దేవ్ నారాయణ్ సాహీ

( విజయ్ దేవ్ నారాయణ్ సాహీ హిందీ కవి, ప్రముఖ విమర్శకుడు, మేధావి, ఆలోచనాశీలి. మార్క్సిస్టు మేధావిగా ప్రారంభమయి లిబరలిజం దిశగా ప్రయాణం సాగించారు. క్రియాశీల రాజకీయాలలో పని చేశారు. అనేక పర్యాయాలు జైలు జీవితం గడిపారు. అనేక పత్రికలకు సంపాదకుడుగా పని చేశారు. విస్మరించటానికి వీల్లేని సాహితీ వ్యక్తిత్వం సాహీది. మహాకవి అగ్నేయ్ సంపాదకత్వంలో వెలువడిన కవితా సప్తకాల్లో ' తీస్రా సప్తక్ ' నుంచి తీసుకున్న వక్తవ్యం ఇది.


విశ్వాసం  నా కవిత్వానికి మూలాధారం.
ఈ విశ్వాసం ఇరవై ఇదు గుణాల సమాహారం.

1

నేను వివేకం కలిగివున్న మనిషిని. నాలాగే వివేకం కలిగివున్న మనుషులు ఇంకా కొంతమంది ఉంటారు. నాలాగా  కానీ, నాలాంటి ఇంకా కొందరి లాగా కానీ వుండని వాళ్ళు ఇంకా చాలా మంది వుంటారు. ఈ వాస్తవాన్ని దాచటం వల్ల  వచ్చే లాభం ఏమీ లేదు. దాచకపోవటం  వల్ల వచ్చే నష్టమూ వుండదు. అయితే దాచటంవల్ల నష్టం ఉంది. అంతేకాదు. దాచకపోవటంవల్ల లాభం కూడా వుంది.

2

పూర్తి స్థాయిలో నేను ఒక స్వతంత్ర జీవిని. నన్ను శాసించేవారు ఎవరూ లేరు. అంటే నేను చేసే ప్రతీ పనికీ పూర్తిగా నేనే బాధ్యుణ్ణి. అంటే నేను నైతికంగా వుండటం అనేది సాధ్యం.

3

ఈ సమస్త విశ్వంలోకెల్లా నేను ఒక విలువయిన ప్రాణిని. అలాకాని పక్షంలో ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు. ఇది మీ విషయంలోనయినా అంతే.

4

నిరంతరం ఆచితూచినట్లు  వ్యవహరించకపోవటం నిజాయితీపరులు, వివేకవంతులు అయిన మనుషుల లక్షణం. సమాజంలోని ప్రతి ఒక్కరూ కాకపోయినా కనీసం కొందరయినా ఇలా వుండటం చాలా  అవసరం. నిరంతరం ఆచితూచి వ్యవహరించనివాళ్ళు ఏ ఒక్కరూ లేని సమాజం స్థితి  అనివార్యంగా అధఃపాతాళమే. 

5

నన్ను నేను ఎక్కువగా పట్టించుకోను. అది నా  పని కాదు. అది మీ కర్తవ్యం. దీనికి ప్రతిలోమం కూడా సత్యమే. అనుమానం లేదు.

6

వ్యక్తికి హక్కులు తప్ప బాధ్యతలు లేని సమాజమే అత్యున్నతమయిన సమాజం. నేను కోరుకున్న ప్రతిదీ నాకు అందితీరాలి. నేను ఇవ్వదలచుకోనిది ఏదీ ఇవ్వవలసిన అవసరం నాకు వుండకూడదు. 

7


కవితారంగంలో కేవలం ఒకే ఒక ఆర్య సత్యం ఉంది. అది దుఃఖం. మిగిలిన మూడూ రాజకీయ రంగం పరిధిలోకి వస్తాయి. 

8

కవిత్వం రాజకీయాల్లోకి చొరబడకూడదు. దీనివలన కవిత్వానికి జరిగే నష్టం ఏమీ లేకపోయినా రాజకీఅయాలకు హాని జరిగే ప్రమాదం వుంది.

9

షెల్లీ గొప్ప  విప్లవ కవి.  అందుకే నేను షెల్లీని నేను ఎంతో ఇష్టపడతాను. కానీ ఆయన నాయకత్వంలో విప్లవకారునిగా మారాలని మాత్రం పొరపాటున కూడా ఆశించను. తులసీదాసు గొప్ప భక్తికవి. ఆయన పార్లమెంటు సీటుకు గనక పోటీ చేస్తే నేను పొరపాటునకూడా  ఆయనకు ఓటు వేయనుగాక వేయను. నీషే  Thus spake zarathustra సామాజిక వాస్తవికత దృష్ట్యా తగలబెట్టదగిన పుస్తకం. కానీ కవిత్వం దృష్టితో చూసినపుడు మహోన్నతమయిన కృతులలో అది కూడా ఒకటి. దాని కాపీ ఒకటి  నిరంతరం నాతోపాటు వుంచుకుంటాను. మీకూ ఇది నేను సిఫారసు చేస్తాను.
 
10

కవి ఎన్నుకోబడని శాసనసభ్యుడయితే కావచ్చు. కానీ ఎన్నుకోబడని మంత్రి అయితే మాత్రం కవికి మేలూ, జనానికి కీడూ జరిగే అవకాశం ఉంది. ఈ  రెండూ అవాంఛనీయమయినవే.

11

కవిత్వం వల్ల సమాజం  ఉద్ధరింప బడదు. నిజంగా మీరు సమాజాన్ని ఉద్ధరించాలని అనుకుంటే దేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టండి లేదా వేరే ఎవరినయినా ప్రధానమంత్రిని చేసే పనిలో పూర్తిగా నిమగ్నం కండి.

12

సమాజంలో ఒక పౌరుడుగా వుండి ఇలా ఎందుకు రాస్తున్నావు, అలా ఎందుకు రాయటం లేదు అని ఎవరయినా విమర్శకుడు నన్ను అడగటానికి ముందే సమాజంలో కవిత్వం రాయటం కూడా ఎలా నా కర్తవ్యం అవుతుందో ముందు నిరూపించ మంటాను.

13

ఎవరయినాసరే ఒక కవి అకవులకన్నా సంవేదనాశీలీ, అనుభూతిశీలీ కాజాలడు. కవులు ఎవరయినా దీనికి భిన్నంగా చెప్పినా నమ్మకండి. అకవుల కంటె తాము అధికులమని చాటుకోవడానికి కవులు అలా చెప్పుకుంటారు. అకవి కన్నా కవి సంవేదనా క్షేత్రం పరిమితమయినది కావటం ఎంతమాత్రం అసంభవం కాదు. అంతే కాదు. వాస్తవానికి అలానే ఉంటుంది కూడాను.

14

నా అనుభవం లోకి వచ్చినదంతా నా కవితా వస్తువు కాజాలదు. ఇప్పటివరకూ నా అనుభవ ప్రణాళికలో లేనిదే నా కవితా వస్తువు అవుతుంది. ప్రతీ కళాకృతీ ఒక ప్రత్యేకమయిన , బలమయిన అనుభూతి నుంచే అవతరిస్తుంది. అనుభూతికి సంబంధించిన సాధారణాంశాలకు సరికొత్త పరిభాషను అందించటం దాని ప్రధాన లక్ష్యం. నిర్దిష్టతకీ, సాధారణతకీ మధ్య సామంజస్యానికి మరో పేరే పరిభాష. సామంజస్యం వినా అనుభవ సామర్ధ్యం అసంభవం.

15

తన ప్రత్యేకమయిన అనుభూతికీ, అంతవరకూ అందుబాటులో వున్న సాధారణ పరిభాషకీ మధ్య అసమంజసతని అకవి గమనించలేడు. ఒక్కోసారి గమనించినా కొద్దిసేపు అశాంతికి గురి అవుతాడు. ఆ తరువాత అనుభూతిని బలవంతంగా  అనుభూతిని పరిభాషగా పరివర్తించేలా చేస్తాడు. అది కేవలం అకవి అదృష్టం.

16

కవి ఒక దురదృష్ట జీవి. నిర్దిష్టమయిన అనుభూతిని మార్చటం అనేది అతనికి అసాధ్యం. పరిభాషను సమూలంగా పరిమార్చేవరకూ కవి అశాంతితో అలమటించి పోతాడు. అసమంజసతను గుర్తించే కర్తవ్యాన్ని బుద్ధి నిర్వర్తిస్తుంది. కల్పనా శక్తి పరిభాషను మార్చేస్తుంది. పదాల అభివ్యక్తి అభ్యాసం ద్వారా సాధ్యం అవుతుంది. ఇది కేవలం ఒక నిమిషం కాలంలో జరగవచ్చు. లేదా ఒక యుగం పట్టవచ్చు. అది ఆయా కవులపై ఆధారపడి  వుంటుంది. 

17

కవి అమరత్వం అనేది పూర్తిగా భ్రమలతో ముడిపడి  వున్న వ్యవహారం. అపార్ధాలకు ఆస్కారం కలిగించే శక్తి సామర్ధ్యాలు ఎంత ఎక్కువగా వుంటే ఆ కవి అంత ఎక్కువ కాలం అమరుడుగా  కొనసాగుతాడు.

18

సార్ధకత తప్పనిసరిగా తపం అయితీరాలని లేదు.శబ్దాడంబరం మాత్రం నూటికి నూరు పాళ్ళూ పాపమే.

19

మా తాతగారు చెప్పింది మా నాన్న చెప్పరు. అలాగే  నేనూ చెప్పను. ఇది వాస్తవ స్థితి. మా నాన్న నాతో తన తండ్రి చెప్పింది చెప్పటం సంప్రదాయం. నేనే స్వయంగా మా నాన్న చెప్పింది చెప్పటం ప్రయోగం. నేను ఏదీ చెప్పకపోతే సంప్రదాయమూ లేదు, ప్రయోగమూ లేదు.

20

పాశ్చాత్య ప్రపంచం నుంచి విముక్తి అనేది అసాధ్యంలా  వుంది. ఆధ్యాత్మికత వినా ముక్తి పూజ్యం. ఈ మాట పాశ్చాత్య ప్రపంచమే చెప్పింది. ఇది చద్ది మాట. ఆధ్యాత్మికతా, భౌతికవాదాల మధ్య సమన్వయం ఉండాలి. ఈ మాట కూడా పాశ్చాత్య ప్రపంచమే చెప్పింది. ఇది కూడా చద్ది మాటే. కేవలం భౌతికవాదంలోనే ముక్తి దాగివుంది. ఇదీ పాశ్చాత్య ప్రపంచమే చెప్పింది. అయితే ఇది కొత్త మాట.

21

కవిత్వం అంటే అనురక్తి. అనురక్తి అంటే మాయ. మాయకీ, ఆధ్యాత్మికతకీ మధ్య అసలు పొసగదు. కాబట్టి ఆధ్యాత్మిక కవిత్వం అసంభవం. ద్వైదీభావంతోవున్న వారికి ఇందులో మాయా దొరకదు, దైవమూ దక్కదు. భావకవుల విషయంలో జరిగింది ఇదే. దీన్నుంచి గుణపాఠం నేర్చుకోవటం చాలా అవసరం.

22

నా కన్నా ముందు తరం వాళ్ళల్లో వివేకం కలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు మూగవాళ్ళు. వాచాలురు వున్నారుగానీ వాళ్ళు పూర్తిగా అవివేకులు. ఆంగ్లభాష మనిషికి వివేకాన్నయితే ఇచ్చిందికానీ మూగవాణ్ణి చేసి వదిలేసింది. గాంధీజీ గొంతుకనయితే ఇచ్చారుగానీ ఆలోచనా శక్తిని కట్టడి చేశారు. చాలా కోపం వస్తుంది. కానీ ఇది కేవలం నా దౌర్భాగ్యం.

23

స్వఛ్చందంగా శరణాగతులుగా మారి ' మా శుచః ' పాఠాన్ని జపిస్తూ, ఆలోచించే పనిని మాత్రం జాతి యావత్తూ ఒకే ఒక వ్యక్తికి ఎందుకు వదిలేసింది? ఆ వ్యక్తి ఈ శరణాగతులకు ' అటెన్షన్ ' , ' స్టాండ్  ఇటీజ్ ' ల గురించి నిర్దేశించారుగానీ ' అటెన్షన్ ' అని ఎప్పుడు అనాలీ, ' స్టాండ్ ఇటీజ్ ' ఎప్పుడు చెప్పాలీ అనే వివేకాన్ని అందించలేదు. మన ఆకాంక్షనీ, విరాత్ తత్వాన్నీ, వివేకాన్నీ ఎదుగూ బొదుగూ లేకుండా అలాగే వదిలి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు చెప్పే ' కాషన్ ' తో పెరేడ్ అయితే జరుగుతుంది గానీ యుద్ధం గెలవటం మాత్రం అసాధ్యం.

24

వయస్సు యాభయికి పైబడటం దానంతటికదే వివేకానికి ప్రమాణం కాజాలదు.ప్రమాణ పత్రం నేను జారీ చేస్తాను.

25

అవఙా పరమో ధర్మః ! 







  

Tuesday 22 May 2012

' అందరూ' అంటే ఎవరు?

 

 

' అందరూ' అంటే ఎవరు?

అందరికీ బోధ పడేటట్లు వ్రాయడం అంటే ఏమిటో నాకు బోధ పడలేదు. ......' అందరూ ' అంటే ఎవరు? నేనయితే ఎందర్నో చూశాను గాని ఎక్కడా నాకు ఈ ' అందరూ ' కనబడ లేదు. అందరి కోసం వ్రాయమని అడగడం అసందర్భం. అందరి కోసం వ్రాస్తున్నాననుకోవడం ఆత్మవంచన.......అందరూ అంటే చదవడం నేర్చిన వారందరూ అనే నిర్వచనం రావచ్చును. చదవడం నేర్చిన వారందరూ చదివిన గ్రంధం ఒకటీ లేదు. ..... అందరికీ బోధ పడవలసిన అవసరంవున్న గవర్నమెంటు ఉత్తరువులే ఎవరికీ బోధ పడని భాషలో వెలువడుతూ ఉంటాయనే విషయం సుస్పష్టమే..................

....................అర్థం కావడమనేది అనేక అంతస్తులలో ఉంటుంది. ఒక్కక్కరి సంస్కార స్థాయిని బట్టి ఒకే పద్యం ఒక్కొక్క విధంగా అర్థం అవుతుంది. అందరికీ అర్థం కాగా ఇంకా ఎంతో మిగిలిపోయే అర్థం ఉంటుంది, మహాకవిత్వానికి! అంతేకాదు ; కాలం గడిచినకొద్దీ ఆ కవిత్వం కొత్తగా ఏర్పడ్డ పరిస్థితుల మీద వ్యాఖ్యానంగా సరిపోగలుగుతుంది.
.............................................................................................

అసలు గూఢత అనే మాటకి అర్థం కాకపోవటం అనే ఒక్కటే  అర్థం లేదు. ఎక్కడో ఏదో వుంది. ఎంత ప్రయత్నించినా ఎవరికీ అందదది. ఎలాగయినా దాన్ని తెలుసుకోవాలి. అంతే కాదు. ఆ తెలుసుకున్నదాన్ని అందరికీ తెలియజెయ్యాలి. అదీ జిగ్నాస. అటువంటి జిగ్నాసను ప్రదర్శించేదే గూఢ కవిత్వం. ' మిస్టిసిజం ' అనే ఇంగ్లీషు మాటకు పర్యాయ పదంగా వాడుతూన్న ఈ గూధత కేవలం అర్థం కాక పోవడంతో ఆగిపోదు. అత్యున్నత స్థాయిలో అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి; పారవశ్యం దాని ప్రాతిపదిక! తెలుసుకోశక్యం కాని దాన్ని తెలుసుకోవడానికి చేసే తపస్సు!

తెలివికీ, తెలియమికీ మధ్య స్పష్టమయిన సరిహద్దు గీత ఏమైనా ఉందా?
ఈ సరిహద్దు గీతను కనిపెట్టడానికి కావించే అన్వేషణమే గూఢ కవిత్వం....

 

శ్రీ శ్రీ

 

 

 










రాజభక్తి - దేశభక్తి

గురజాడది రాజభక్తి యుగం. 
ఆనాడు దేశభక్తి ఒక నేరం. 
అటువంటి కాలంలో 
`దేశమును ప్రేమించుమన్నా
` అని రాయగలగడం 
నిస్సందేహంగా ఒక సాహసం.

శ్రీ శ్రీ 

 

 

 

కవిత్వంలో వేగం





కవిత్వంలో వేగం


అనుప్రాసల వల్లను, ఒక మాటగాని, కొన్ని మాటలనుగాని పునశ్చరణ చెయ్యడం వల్లను, యమకంవల్లను, వాక్యరూపాన్ని మార్చడం వల్లను వచన గీతంలో వేగాన్ని సాధించవచ్చును. ఇందుకుగాను కవికి మాటల యొక్క కొలత, బరువు, ఒరపు, texture  బాగా తెలియాలి.  మాటలోనుంచి ఎంత అర్థం పిండడానికి వీలుందో అంతా అతను పిండుకోగలగాలి వాటిని ఏ రకంగా అమర్చితే ఎక్కువ effect తీసుకురావచ్చునో తెలిసి ఉండాలి అందుకే ఒక భాషలోని కవిత్వాన్ని ఇంకో భాషలోనికి తర్జుమా చెయ్యడం కష్టం.    

శ్రీ శ్రీ





వచనం - కవిత్వం



వచనం -  కవిత్వం


వచనం నడుస్తుంది. కవిత్వం పరిగెడుతుంది. వచనం చేత పరిగెత్తించి దాన్ని కవిత్వం చెయ్యవచ్చును. అప్పుడు వచనంలో వలె, లేదా గణితశాస్త్రంలో వలె అన్ని మెట్ల మీదా అడుగు వెయ్యనక్కర లేదు. ఒకానొక కాలానికీ, స్థలానికీ సంబంధించిన దృశ్యం నుంచి ఇంకొక స్థల కాలాల దృశ్యానికి గంతువేసి ఒప్పించుతుంది  కవిత్వం. 
ప్రతీ మాటకీ ఒక కొలతా, ఒక బరువూ, ఒక ఒరపూ ఉంటాయి. రెండు మాటలను సరియైన, ఉద్దిష్టమైన అర్థం వచ్చేటట్లు కలపడం చాలా కష్టం.

శ్రీ శ్రీ     

 

 

 

 

Saturday 5 May 2012

గీసిన వాటికన్నా చెరిపిందే ఎక్కువ


1

2
3

 4
5
 6
7
8
9
10
11

గీసిన వాటికన్నా చెరిపిందే ఎక్కువ

పికాసో బుల్

ప్యారిస్ లోని పికాసో మ్యూజియంలో ఒక చోరీ జరిగింది. 

పికాసో స్కెచ్ బుక్ ను ఎవరో అపహరించారు. 

దాని విలువ కోటానుకోట్లు.  అపహరణకు గురయిన స్కెచ్ బుక్ లోదే ఈ బుల్ సిరీస్. చెరిపివేయటం అనే ఒక సృజనాత్మక ప్రక్రియ  ద్వారా నిర్దిష్టమైన, స్పష్టమైన ఒక ఎద్దు బొమ్మను నైరూప్యం చేస్తూ అద్భుతమైన ఒక కొత్త రూపాన్ని ఎలా సృష్టించాడో  మనం గమనించ వచ్చు. పాబ్లో పికాసో చిత్రకళా రంగంలో సాధించిన అద్భుతాలకు ఇది ఒక మచ్చు తునక. 

పికాసో తన అనేక చిత్రాలలో ఎద్దును ఒక రూపకంగా ఉపయోగించాడు. ఈ సిరీస్ ద్వారా కూడా పికాసో ఫాసిజం మీద బలమయిన విమర్శ పెట్టాడని అంటారు. అయితే ఇది పికాసో సెల్ఫ్ ఇమేజ్ అని వ్యాఖ్యానించిన కళా విమర్శకులు కూడా వున్నారు. 

ఎద్దు జననాంగాలను నల్ల రంగుతో హైలైట్ చేయటం ద్వారా దాని జెండర్ మీద దృష్టిని కేంద్రీకరించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.

 ఎద్దు మాంసల శరీరాన్ని,ముఖాన్ని, తలనీ రెడ్యూస్ చేయటాన్ని కూడా మనం గమనించ వచ్చు. కొమ్ముల్లో,  తోకలో స్పష్టమయిన మార్పును మనం చూడవచ్చు. తద్వారా వీటిమధ్య ఒక లయాత్మకతని సాధించాడు. అది ఒక లిరికల్ లయాత్మకత. 

పికాసో గీతల్లోంచి తొంగిచూసే సృజనాత్మక శక్తి మనలను ఆశ్చర్య చకితులను చేస్తుంది. ఈ బొమ్మల్లోని జీవి ఏకకాలం లో ముక్కలుముక్కలుగానూ, పరిపూర్ణమయిన రూపం లోనూ దర్శనమిస్తుంది. పికాసో నిరంతరం సరళం చేసుకుంటూ  వెళ్తుంటాడు.

కేవలం తన సమకాలాన్నే గాక తన తరువాతి తరాలను సయితం విశేషంగా ప్రభావితం చేసిన పికాసోలోని బలం, అతని యౌనికత, అతని రూపకాలు, అతని నిశిత దృష్టి, అతనిలోని  ప్రయోగశీలతతో పాతు అతని గీతల్లోని మంత్రశక్తిని ఆస్వాదిస్తూ పికాసో చిత్రించిన ఈ ఎద్దు బొమ్మ ఏమంటుందో విందామా!  





Friday 4 May 2012

పికాసో ప్రేయసులు - 6

 

పికాసో ప్రేయసులు - 6

 

జాక్విలిన్ రోకే

 

చూస్తూచూస్తుండగానే 1953 వ సంవత్సరం వచ్చేసింది. పాబ్లో పికాసో వయసు ముదిరింది. వ్రుద్ధాప్యం మీదికి వచ్చేసింది. నవయవ్వనంలో ఉన్న యువతుల పట్ల ఆయన ఆసక్తి ఏమాత్రం తగ్గకపోగా విపరీతంగా పెరుగుతూ పోయింది. లేటు వయసు ప్రేమ ఘాటు పెరిగింది. ప్రేయసుల పట్ల పికాసో ప్రేమ ప్రగాఢమవుతూ వచ్చింది. జీలో ప్రేమలో ఓలలాడుతూన్న కాలంలోనే చిన్నా చితకా ప్రేమ కథలు పికాసో జీవితంలో అనే కం జరిగాయి. అయినా జీలో తో అతని ప్రేమ సంబంధాలు ఏమాత్రం చెక్కుచెదర లేదు. 

ఇంతలో 27 సంవత్సరాల పడతి జాక్విలిన్ రోకో అతని జీవితంలోకి అదుగు పెట్టింది. జాక్విలిన్ రోకో నిలువునా పికాసో మనసును దోచుకుంది. తొలి చూపులోనే పికాసో మనసును దోచుకున్న యవతుల్లో జాక్విలిన్ రోకో ఒకరు.
ఆమెను ఆకట్టుకునేందుకు ఓ రోజు పికాసో స్వయంగా ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆమె ఇంటి తలుపుమీద చాక్ పీస్ తో ఒక పావురం బొమ్మను చిత్రించాడు.ఆ తరువాత ఆరు మాసాల పాటు  ప్రతీ రోజూ ఆమె ఇంటికి వెళ్ళి ఒక గులాబీ పువ్వును బహూకరించాడు.

ట్టకేలకు పికాసో  ప్రేమ ఫలించింది.
చిట్టచివరికి జాక్విలిన్ కూడా పికాసో ప్రేమలో పడింది.  ఈ ప్రేమ కథను కూడా ప్రపంచానికి తెలియకుండా దాచాలని పికాసో అనుకున్నాడు. నిజానికి ఇది పికాసో జీవితంలో చివరి ప్రేమకథ. వీరు ఇరువురూ దాదాపు ఇరవై సంవత్సరాలు కలిసి కాపురం చేశారు.

పికాసో ఆరోగ్యం క్షీణించ సాగింది. వృద్ధాప్యం స్పష్టం కాసాగింది. పూర్తి  కాలాన్ని పెయింటింగ్ లకే కేటాయిస్తున్నాడు. జాక్విలిన్ ని మోడల్ గా పెట్టుకుని 400లకు పైగా పెయింటింగ్స్ వేశాడు. జాక్విలిన్ కేవలం ఆయన భార్యా , మాత్రమే కాదు, జీవన చరమాంకంలో చేరువయిన తోడూ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి కూడా.
1973లో పికాసో చనిపోయాడు. ఆయన ఆస్తిపాస్తుల గురించి పెద్దయెత్తున వివాదం చెలరేగింది. 

జీలో పికాసో పిల్లలకు తల్లి. జాక్విలిన్ చట్టబద్ధమయిన భార్య.
చివరికి సమస్య ఒక కొలిక్కి వచ్చింది. ఆయన ధనంతో ' పికాసో మ్యూసీ ' అనే సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ ఏర్పడడానికి మూలకారకురాలు జాక్విలిన్.

అతని ప్రేయసులు, వారు అందించిన ప్రేరణల స్మృతిచిహ్నంగా ఈ సంస్థను నెలకొల్పింది.. 

పికాసో మరణానంతరం ఆయన చేసిన కృషినీ, ఆయన ఆస్తినీ భ్ద్రపరచటమే తన జీవిత లక్ష్యంగా భావించింది. కానీ నిరంతరం  ఒంటరితనం ఆమెను వెంటాడి వేధించింది. పికాసోను తలచుకుంటూ నిరంతరం రోదించేది. అలా రోదిస్తూ రోదిస్తూ స్పృహ కోల్పోయేది. భావోద్వేగాలతో తల్లడిల్లి పోయేది. చివరికి ఒక ఉద్విగ్న క్షణంలో రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది.
 

Wednesday 2 May 2012

పికాసో ప్రేయసులు - 5



 పికాసో ప్రేయసులు - 5

ఫ్రాంకాయిస్ జీలో


అది 1944 వ సంవత్సరం. పికాసో వయస్సు 63 సంవత్సరాలు. 

ఆర్ట్స్ విద్యార్ఠిని జీల ప్రేమలో పద్దాదు.  అప్పుడు ఆమె వయసు 23 సంవత్సరాలు. పికాసో తో ఏర్పడిన ప్రేమ సంబంధాన్ని ఆమె తన కెరియర్లో గొప్ప మలుపుగా కూడా భావించుకుంది. పికాసో సాహచర్యంలో ఆ తరువాత  ఆమె అనేక కళా మర్మాలను తెలుసుకుంది. పికాసో విషయంలో ఆమె ఒక కళా మర్మఙురాలుగా, అనగా ఆర్ట్ క్రిటిక్ గా తన సేవలను అందించింది. జీలో కేవలం ఒక మోడల్ గా మాత్రమే గాక పికాసో ఎగ్సిబిషన్  లకు హోస్ట్  గా కూడా వ్యవహరించింది.
 
డోరా మార్ తో వున్న కాలం లోనే జీలోతో ప్రేమకలాపాలను ప్రారంభించాడు పికాసో. ఆ తరువాత డోరా మార్ కు దూరమవుతూ వచ్చాడు. వాళ్ళిద్దరూ విడిపోయిన తరువాత జీలో పూర్తిగా పికాసోతో సహజీవనం సాగించింది. 

ఆమె కూడా పెయింటింగ్స్ వేసింది.  పెయింటర్ గా ఆమె కూడా  మంచి పేరు  సంపాదించింది. ఒక అత్యంత ప్రతిభావంతురాలైన  జీలో అనవసరంగా పికాసో ప్రేమలో పడి తన భవిష్యత్తును సర్వ నాశనం చేసుకుందని ప్యారిస్ కళాప్రపంచం  అభిప్రాయ పడింది. పికాసోతో సంబంధం లేకుండా ఆమె తన పెయింటింగ్స్ ప్రపంచం ముందు పెట్టివుంటే ఆమెకు మరెంతో ఖ్యాతి వచ్చి ఉండేదని వ్యాఖ్యానించింది. 

జీలోఎక్కువ కాలం  ప్యారిస్ లోనే  జీవించింది. రష్యన్ నర్తకి, పికాసో మాజీ భార్య ఓల్గా నుంచి అనేక సమస్యలను ఎదుర్కొంది. పికాసో ప్రేయసులలో ఓల్గా ద్వారా జీలో అనుభవించినన్ని చిత్రహింసలను వేరెవరూ అనుభవించలేదు. చివరికి జీలో జీవితం కూడా ఓల్గా జీవితం లాగే మారిపోతూ వచ్చింది. పది సంవత్సరాలపాటు  పికాసోతో కలిసి కాపురం చేసిన జీలో శాశ్వతంగా అతని జీవితం నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఆమె ' లైఫ్ విత్ పికాసో ' అని పుస్తకం రాసింది.ఆ రోజుల్లో ఆ పుస్తకం ఒక గొప్ప సంచలనం. ఈ పుస్తకం ప్రతులు లక్షల సంఖ్యలో అమ్ముడు పోయాయి. ఆ పుస్తకానికి లభించిన ఆదరణను చూసి పికాసో తట్టుకోలేక పోయాడు.తక్షణం ఈ పుస్తకం ప్రచురణను నిలిపివేయమని కోర్టులోలో కేసు వేశాడు పికాసో. అయితే ఈ కేసులో ఓడిపోయాడు. 

అనంతర కాలంలో ఆమె పెయింటర్ గా, రచయిత్రిగా శేష జీవితాన్ని గడిపింది. పికాసో కాపురం చేసి,   విడిపోయికూడా పిచ్చిది కాకుండా మానసికంగా ద్రుఢంగా నిలబడిన మహిళ జీలో ఒక్కతే.   

******************


Tuesday 1 May 2012

ఒక కొత్త భాష కోసం.....


 

ఒక కొత్త భాష కోసం.....

 

అఫజాల్ అహమద్ సయ్యద్ 

 

సముద్రానికి సమీపంలో

 ఒక కట్టడం 

ఒంటరిగా ఎవరూ 

వెళ్ళలేరు అక్కడికి 

నేనూ, నా పొరుగున వుండే కుక్కా తప్ప 

ఒక కొత్త భాష నేర్చు కుంటున్నాను 

మాట్లాడుకోటానికి 

నాతో నేను....