Wednesday, 6 June 2012

తెలుగులో 'వేస్ట్ ల్యాండ్ '







The Wasteland


T S Eliot


1922



ఆధునిక ప్రపంచ సాహిత్యంలో టి యస్ ఎలియట్ రాసిన ' ది వేస్ట్ ల్యాండ్ ' కావ్యానికి

 తనదయిన ఒక ప్రత్యేక స్థానం వుంది. ఆధునిక కవిత్వానికి ఇది ఒక భగవద్గీత.

   ఈ కావ్యాన్ని  అర్ధం చేసుకోవటానికి ఎలియట్ అధ్యయనం చేసిన కొన్ని పుస్తకాలు, ఆయనను ప్రభావితం చేసిన

కొన్ని ఉద్యమాలను గురించి తెలుసుకోవటం తప్పనిసరి అవసరం.

మరీ ముఖ్యంగా వెస్టన్ రాసిన ' ఫ్రం  రిచువల్ టు రొమాన్స్ ' ,  జేంస్ ఫ్రేజర్ రాసిన ' ది  గోల్డెన్ బౌ.'

వేస్ట్ ల్యాండ్ కోసం  ఎలియట్ ఎన్నెన్నోపురాణ కధలు - గాధలను వుపయోగించు కున్నాడు.

 ఈ కావ్యాన్ని అర్ధం చేసుకోవటానికి  వాటిల్లో ఒకటి రెండు కధలను గురించి తెలుసుకోవడం కూడా అవసరం.

 అందులో ఒకటి ఫిషర్ కింగ్ కధ.

ఈ భూఖండం లోని ఒకానొక ప్రాంతం తీవ్ర శాపానికి గురి అవుతుంది.

అక్కడి నేల నేలంతా  బంజరుభూమిగా మారిపోతుంది.  సమస్త జీవ జాలం గొడ్డుబోతుంది.

 ఈ శాపంతో రాజు ఫిషర్  కింగ్ కి కూడా సంబంధం వుంటుంది. అతనికి జబ్బు చేస్తుంది.

 సాంసారిక జీవితానికి అతడు  అనర్హుడవుతాడు.   అతడు ఆరోగ్యవంతు డయితేనే భూమి తిరిగి మేల్కొంటుంది.

పంటలు పండుతాయి. సమస్త జీవజాలం గొడ్డుమోతుతనం  నుంచి విముక్తమవుతుంది.

 ఆ ప్రాంతాన్ని శాపం నుంచి విముక్తం చేసేందుకు ఒక వీరయోధుడు  బయలుదేరుతాడు.

 మార్గమధ్యంలో అతడు రకరకాల అవాంతరాలనూ, భయంకరమయిన కష్టాలనూ ఎదుర్కొంటాడు.

ఈ వృత్తాంతం ' హోలీ గ్రెయిల్ ' అన్వేషణ  ( ఏసు క్రీస్తు అంతిమ సమయం లో  ఉపయోగించిన పాత్ర ) తో

కలుస్తుంది.  ఇందులోని  కధలన్నీ జీవితం బీడువారి పోవటం, తిరిగి జవజీవాలను పుంజుకోవటం గురించిన  నీతిని

బోధిస్తాయి.  ఈ నీతి కథలన్నీ  Ferility ritualsతో ముడిపడి వుంటాయి. అలెగ్జాండ్రియా లోని గ్రీకుల్లో ధనధాన్యాలు,

సంతాన  దేవతా  విగ్రహాన్ని ప్రతీ ఏడాదీ  సముద్రం లో నిమజ్జనం చేసే ఆచారం ఉండేది.

వసంతం రావటం తోనే ఆ దేవతామూర్తి   తిరిగి  ప్రాణం  పోసుకునేది.


అలాగే వీటితోపాటు మరో రెండు మూడు జానపద  కథలను జ్ఞాపకం వుంచుకోవటం ఈ కావ్యం ఇతివృత్తాన్ని అర్థం

చేసుకోవటానికి చాలా అవసరం. అందులో ఒకటి... త్రేస్ రాజు టెరియూస్ కథ.

 అతని భార్య ప్రాక్నీ. ఈమె ఎథెన్స్ రాజు కూతురు. ఈమె చెల్లెలు ఫిలోమేల్.

ఐదేళ్ళు ప్రాక్నీతో కాపురం చేసిన టెరియూస్ మరదలు ఫిలోమెల్ ను మానభంగం చేస్తాడు.

ఈ విషయం అక్కకు చెబుతుందని భయపడి ఆమె నాలుకను తెగ్గోస్తాడు.

చివరికి ఒక దశలో అక్కచెల్లెళ్ళు ఇద్దరినీ హత్య చేయాలని ప్రయత్నిస్తాడు.

దేవతలు ఫిలోమేల్ ను నైటింగేల్ గానూ, ప్రాక్నీని వానకోకిలగానూ మార్చేసి కాపాడతారు.


ఈ కావ్యం లోని మరో ముఖ్యమయిన పాత్ర పేరు టైరీషియస్ . ఈ కావ్యం లో ఆద్యంతం కనిపించే పాత్ర.

 ఇతడు థీబ్స్ వాసి. గుడ్డివాడు. అయినా అన్నీ చూడగలడు. కాలజ్ఞాని.

అన్ని కాలాల్లోనూ ఉంటూ తన గుడ్డి కళ్ళతోనే స్పష్టంగా దర్శించినవాడు.

వాటన్నిటికీ సాక్షీభూతంగా నిలబడి వున్నవాడు  టైరీషియస్.

 రెండు పాములు జంటగా వున్నపుడు చూసి ఆడపామును చంపేశాడు. సగం స్త్రీ గా రూపాంతరం చెందాడు.

ఎతీనా స్నానం చేస్తున్నపుడు చూశాడు. గుడ్డివాడయ్యాడు. సగం స్త్రీ, సగం పురుషుడు.


వీటన్నింటి తోపాటు ఎలియట్ ఈ కావ్యం లో బైబిల్, డాంటే డివైన్ కామెడీ, ఇటాలియన్, ఫ్రెంచ్, జర్మన్ సాహిత్యాలు,

సంస్కృత సాహిత్యం, ఉపనిషత్తుల ఉల్లేఖనాలు ఇందులో కనిపిస్తాయి.

ది వేస్ట్ ల్యాండ్ కావ్య నిర్మాణం లో ఎలియట్ ఫ్రెంచ్ సింబాలిజాన్ని ఉపయోగించు కున్నాడు.

1857 లో  బోదలేరు  ఫ్రాన్స్ లో Fleurs du Mal ( Flowers of  Sin ) కవితా ప్రపంచాన్ని ఒక కొత్త మలుపు

తిప్పాడు. సింబాలిజం అనే ఒక ఉద్యమానికి పునాది రాయి వేశాడు.

ఈ ఉద్యమానికి రింబో, వెర్లయిన్ , మలార్మే,  వ్యాలరీలు ప్రాతినిధ్యం వహించారు.

అతి సుదీర్ఘమయిన ఈ కావ్యాన్ని కవిమిత్రుడు ఎజ్రా పౌండ్ ఎడిట్ చేశాడు.

వేస్ట్ ల్యాండ్ కావ్యాన్ని గణనీయంగా కుదించాడు. ఇది మొట్టమొదటిసారిగా 1922లో అచ్చయింది,

ముందు నేను ఈ అనువాదానికి  ' బంజరు ' అని శీర్షిక పెట్టాను.

వేగుంట మోహన ప్రసాద్ గారు దానిని ' వ్యర్థ క్షేత్ర ' అని మార్చారు.

అది మరింత సంస్కృత భూయిష్టంగా వుందని అనిపించింది.

మిత్రుడు సీతారాం ' చవిటిపర్ర ' అని పెట్టమన్నాడు.ధైర్యం చేసి  అదే ఖాయం చేశాం.

అచ్చయి వచ్చేవరకూ ఆయన పెట్టిన టైటిల్ మార్చిన విషయం పాపం మాస్టారికి తెలియదు.

' చవిటిపర్ర ' టైటిల్ చూసి మాస్టారికి చిర్రెత్తుకు వచ్చింది. నన్నూ, సీతారాం నీ పీక పిసికి చంపేయాలన్నంత కోపం

వచ్చింది మాస్టారికి. అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకొని ఉన్నాను కాబట్టి బతికి పోయాను.

మాస్టారు ఈ అనువాదానికి టీకా టిప్పణీ రాశారుసి ఈ అనా ప్రయత్నం విలువను ఎన్నో రెట్లు పెంచారు .

ఇద్దరం కలిసి శ్రీ శ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావుకు  షష్టిపూర్తి కానుకగా ఇచ్చాం.




చవిటిపర్ర 

టి ఎస్ ఎలియట్




1

మృతులవనం


ఏప్రిల్ ఒక క్రూరాతి క్రూరమయిన మాసం

చచ్చిపోయిన మట్టిలోంచి లైలాక్ పుష్పాల్ని మొలిపిస్తూ

జ్ఞాపకాల్నీ  కాంక్షల వేదనల్నీ

ధూళి కలిసి నీరసించిన వేర్లనీ కలగలుపుతూ

పరవశింపజేస్తుంది వసంత మేఘవర్షంతో


నులివెచ్చగా వుంచింది చలికాలం మనల్ని

మతిమరపు మంచుతో కప్పేసి భూమిని

ఎండిపోయిన దుంపలతో

సాకుతుంది కాస్తంత జీవితాన్ని


విచకితుల్ని చేసింది వేసవి మనల్ని

ఉన్నట్టుండి స్టాన్ బెర్గరస్సీ సరోవరం మీంచి సాగి

ఒక వానమబ్బుని వెంటతెచ్చి


ఆగిపోయాం మనం అలాగే చెట్ల బారుల నడుమ

హాఫ్ గార్టెన్ పార్కులో కొనసాగాం సూర్యకాంతిలోకి

కాఫీ తాగాం ముచ్చట్లలో మునిగాం గంటసేపు


' రష్యన్ ని కాను నిజానికి  లిథువేనియన్ ని అసలు అచ్చమయిన జర్మన్ ని నేను '

 చిన్నతనంలో వుండేవాళ్ళం మేనమామ ఆర్చ్ డ్యూక్ దగ్గర మేం

కూర్చోబెట్టుకున్నాడు డ్యూక్ స్లెడ్జి బండి మీద మంచుమీంచి నన్ను

బెదిరిపోయాన్నేను

' మేరీ, మేరీ, గట్టిగా పట్టుక్కూర్చో ' అన్నాడు

జారుకుంటూ సాగిపోయాం అగాధాల లోయల్లోకి

కొండల్లో  కావలసినంత స్వేచ్ఛ

ఎక్కువగా నేను రాత్రుల్లొ చదువుతాను

చలికాలం వస్తే చాలు దక్షిణాదికి వెళిపోతాను "

ఇంతకీ పెనవేసుకుంటూన్న ఈ వేర్లు ఎక్కడివి?

బండరాతి కుప్పల్నించి చీల్చుకు వచ్చే ఈ కొమ్మలు ఏమిటి?


మానవ కుమారుడా

నువు చెప్పలేవు ఊహించనూ లేవు

నీకు తెలిసిందల్లా కేవలం

పగిలిన ప్రతిమల పోగు

నిర్దాక్షిణ్యంగా శిక్షించే సూర్యుని కిరణాల మెరుపు

చచ్చిన చెట్టు ఏ నీడనూ పంచదు

కీచురాయి శబ్దం ప్రశాంతిని అందించదు

ఎండిన బండరాతి నేలలో నీళ్ళ గలగల వినిపించదు

ఈ ఎర్రరాతి బండ కిందనే కనిపిస్తుంది నీడ

( రా, ఈ ఎర్రరాతి బండకింది నీడలోకి )

నీకు చూపిస్తా నేను

ఉదయం నీ వెనకాతలనే తచ్చాడుతూ

సాయంత్రం అందుకునేందుకు నిన్ను ఆరాటపడే

నీ నీడకు భిన్నమయిన వింత ఛాయ

గుప్పిట ధూళిలో భీతిల్లే భయం


( సశేషం )




No comments:

Post a Comment