Monday 30 April 2012

పికాసో ప్రేయసులు - 4

 

పికాసో ప్రేయసులు - 4

 

 డోరా  మార్ 



భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంది.

 గోడ మీది కేలండర్లు మారిపోతున్నాయి. 

1936 వ సంవత్సరం వచ్చేసింది. 

ఒక భారీ స్థాయి విందు కార్యక్రమం  .

ప్రఖ్యాత కవి పాల్ ఎల్వార్ ఆ రోజు  పాబ్లో పికాసో తో కలిసి ఆ విందులో పాల్గొన్నాడు.

 ఫోటోగ్రాఫర్  గా  మంచి పేరు  ప్రఖ్యాతులు సంపాదించిన ఫ్రెంచి  యువతి డోరా  మార్ కూడా అక్కడ ఉంది. 

డోరా మార్ అపురూపమైన అందాల  రాశి. ఆమె  మాట  తీరు గమనించిన వాళ్ళు  ఆమెతో పాటు ఫ్రెంచి భాషను 

కూడా ప్రేమిస్తారు. అంత చక్కని  ఫ్రెంచి మాటలాడ గలిగిన  వాళ్ళు అతి  అరుదుగా   కాని కనిపించరు. కనిపించరు. 

ఆ రోజు పాల్ ఎల్వార్ ఆమెను పికాసోకు పరిచయం చేశాడు. 

ఆమె భాష పికాసోని కట్టి పడేసింది. ఆనతి కాలంలోనే ఆ పరిచయం ప్రేమగా పరిణమించింది. ఈ ప్రేమ సంబంధం 

ఏర్పడిన తరువాతే పికాసో  ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కళాఖండం  ' గెర్నికా ' చిత్రించటం ప్రారంభించాడు. 

స్పానిష్ అంతర్ యుద్ధ బీభత్సాన్ని చిత్రించిన ఆ కళాఖండం చూస్తే ఎవరికయినా సరే వొళ్ళు గగుర్పాటుకు గురి 

అవుతుంది. కానీ, అంతటి  బీభత్సాన్ని ప్రతిబింబించే ఆ పెయింటింగ్ లో కూడా ఒక  అందమయిన అమ్మాయి 

ముఖం కనిపిస్తుంది. అది డోరా మార్ ముఖం. అందులో ఆమె ఏడుస్తూ ఉంటుంది. మంచి ఫోటోగ్రాఫర్ కాబట్టి డోరా 

మార్  ఆ పెయింటింగ్ కి అవసరమయిన మౌలికమయిన సామాగ్రిని సమకూర్చటంలో ఏంటో సహకరించింది.

ఉన్నట్టుండి ఒక రోజు మేరీ వాల్టర్ అకస్మాత్తుగా పికాసో స్టూడియోకి వచ్చింది. అక్కడ ఆమె డోరా మార్ ను 

చూసింది. పికాసోకీ , ఆమెకీ మధ్య   కొనసాగుతూన్న ప్రేమ కలాపాల గురించి ఆమె అప్పటికే రకరకాలుగా 

వినివున్నది. 

మేరీ వాల్టర్, డోరా మార్ ల మధ్య మాటా మాటా పెరిగింది.

మీరిద్దరూ మాట్లాడుకుని నేను ఎవరితో ఉండాలో తెల్చుకొమ్మని ప్రేయసుల కిద్దరికీ చెప్పేసి చిద్విలాసంగా నిమ్మకు 

నీరెత్తినట్టు కుర్చీ లో  కూర్చుండిపోయాడు పాబ్లో పికాసో. 

ప్రేయసులిద్దరి మధ్యా ప్రారంభమయిన మాటల యుద్ధం ముష్టియుద్ధంగా మారిపోయింది. జుట్టూ జుట్టూ 

పట్టుకున్నారు. ఒంటిమీది గుడ్డల్ని  చించుకున్నారు. పరస్పరం ఒకరిని ఎత్తి కుదేసుకున్నారు.

పికాసోతో ప్రేమలో ఓడిపోయినట్లు భావించింది మేరీ వాల్టర్. అవమానించ  బడినట్లు భావించింది. పికాసో జీవితం నుంచి బయటికి వెళ్ళింది.

డోరా మార్ విజేత అయిన ప్రియురాలుగా పికాసోతో ఉండిపోయింది.

' నేను ఎవరితో ఉండాలీ అనే అంశాన్ని తేల్చటం కోసం ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకోవటం నా జీవితంలో అత్యంత 

మధురమయిన సందర్భం'  అని  పికాసో  స్వయంగా చెప్పుకున్నాడు. ఒక ఆడది తన మీద వున్న హక్కు గురించి  

మరో ఆడదాన్ని ఆడిపోసుకున్న సందర్భాలను చాలా  ఇష్టపడేవాడు.  

మేరీ వాల్టర్ వెళ్ళిపోయిన ఏడు సంవత్సరాల తరువాత డోరా మార్ నుంచి కూడా పికాసో దూరమయ్యాడు. 

ఈ ఎడబాటు డోరాను నిలువునా కుంగదీసింది. ఎడతెగని ఏడుపు. చివరికి ఏడుపు ఆగటం కోసం ఆమె వైద్యం 

చేయించుకోవలసి వచ్చింది.    

జీవితాంతం ఆమె ఆ షాక్ నుంచి తేరుకోలేక పోయింది. దాదాపు ఇరవై సంవత్సరాలు ఇదే విషాదం ఆమెను 

వెంటాడింది. ఆమె జీవితంలోకి మరికొందరు మగవాళ్ళు అడుగు పెట్టినప్పటికీ ఆమె మాత్రం పికాసోని  

మరచిపోలేకపోయింది.  పికాసో నిరంతరం ఆమెను కన్నీరు కార్చే   సౌందర్యవతి గా మాత్రమే చిత్రిస్తూ వచ్చాడు. 

 కళాఖండాలుగా  పికాసో తనను చిత్రిస్తున్నందుకు డోరా మార్ ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉండేది. పికాసో తన వర్తమానాన్ని కాదు తన 

భవిష్యత్తును కళాఖండాలుగా చిత్రిస్తున్నాడనే వాస్తవాన్ని ఆమె గుర్తించలేక పోయింది. ప్రేమలో మోసపోయి, 

పిచ్చిదయిపోయి,  నాశనమయిపోయిన అందాల రాశిగా  పికాసో ఆమెను చిత్రించాడు. ప్రత్యేకంగా డోరా కోసం కొన్ని 

పెయింటింగ్స్  వేశాడు పికాసో. 1997 లో  తాను చివరి శ్వాస విడిచే వరకూ వాటిని భద్రంగా తన దగ్గరనే చుకుంది 

డోరా.

 (   సశేషం )

  

Sunday 29 April 2012

కిటికీలోంచి.....

 

కిటికీలోంచి.....


మాటిమాటికీ మెట్లు ఎక్కీ దిగుతూ 

ముచ్చటగొలిపే పిల్లాడిలా ఎండ

ఎంత తప్పించుకు తిరుగుదామన్నా 

కాళ్ళను చుట్టేసుకుంటుంది నీడ 

ఎండ తుట్టెలోంచి తేమను పిండుకుందామని

ఎన్నాళ్ళనించో నా ప్రయత్నం 

వెదురు నిచ్చెనలమీంచి

మేఘాల చెట్లెక్కి 

చినుకుల్ని కోసుకురావాలని   

చిన్నప్పట్నించీ నా తాపత్రయం 

తీరా వెళ్లి ఎలాగోలా 

మబ్బుల మూతల్ని తప్పించి  చూస్తే
 
బెకబెకబెకమంటూ

బెదిరించేస్తాయి  కప్పలు

సంధిద్దామని

అందుకోబోయేంతలో

ఊసరవెల్లి అయిపోయి

ఆకాశం మీంచి అమాంతంగా

ఏ పచ్చని చెట్టుమీదికో దూకేస్తుంది

ఏడు రంగుల ఇంద్రధనుసు

పరిసరాల కతీతంగా నేత్రాల అద్వైత స్థితిలో

తాటి చెట్లయి కిటికీ చువ్వలు

భూమ్యాకాశాల మధ్య

గుదిబండలా వేలాడుతూ

ఎప్పటిలాగే ఎండ ....

  

పాట

 

పాట 


గొంతు విప్పిన 

చెట్టు కొమ్మ ..

పికిలి పిట్ట పాట !
.



Saturday 28 April 2012

పికాసో ప్రేయసులు - ౩

మేరీ తెరిస్సా వాల్టర్  

పికాసో ప్రేయసులు  - ౩



అది 1927 వ సంవత్సరం. పికాసో వయస్సు నలభై ఐదు సంవత్సరాలు. పదిహేడు సంవత్సరాల పడుచు మేరీ తెరిస్సా వాల్టర్ అతని జీవితంలోకి అడుగు పెట్టింది. ఇద్దరూ ఈ సంబంధాన్ని గోప్యంగా దాచి ఉంచారు. పికాసో అప్పటికి ఓల్గా తోనే కాపురం చేస్తున్నాడు. ఎలాగైనా సరే ఈ విషయాన్ని  గుప్తంగానే ఉంచాలని శతవిధాలుగా ప్రయత్నించాడు పికాసో. అప్పటికే అతనికి మంచి పేరు ప్రతిష్ఠలు వచ్చి ఉన్నాయి. దీంతో ఈ సంబంధాన్ని మరుగు పరచటం అసాధ్యమయింది. మేరీ వాల్టర్ అతని పెయింటింగ్స్ కి మోడల్ గా పని చేస్తున్నది. పికాసో తన ఇంటి ముందే ఒక ఇల్లు అద్దెకు తీసుకుని వాల్టర్ ను అందులో ఉంచాడు. ఆ తర్వాత ఆనతి కాలంలోనే పికాసో ఒక అద్భుతమైన భవంతిలాంటి స్టూడియో నిర్మించాడు. మేరీ వాల్టర్ అందులోనే ఉండసాగింది. 1935 లో పికాసో - మేరీ వాల్టర్ లకు ఒక ఆడపిల్ల పుట్టింది. దీంతో వీరిద్దరి మధ్య సంబంధం ఓల్గాతో సహా ప్రపంచ మంతటికీ తెలిసిపోయింది. ఓల్గా ఈ వాస్తవం బయటపడిన తరువాతనే పికాసోతో సంబంధాలను తెంచుకుంది. పికాసోని పెళ్లాడాలనే కోరిక మేరీ వాల్టర్ కు బలంగా ఉండేది. ' గుయెర్నికా ' చిత్రించటానికి ముందు కనీసం ఐదు సంవత్సరాల వరకూ పికాసో పెయింటింగ్స్ లో కొట్టొచ్చినట్టు కనిపించే ముదురు రంగులూ, ప్రసన్న వదనంగల ఒక యువతి, ఆహ్లాదకరమైన స్ట్రోక్స్  కనిపిస్తాయి. అవన్నీ స్పష్టంగా మేరీ వాల్టర్ ప్రతిబింబాలే. వాళ్ళ ప్రేమ సంబంధాలు కళాఖండాలుగా రూపు దిద్దుకున్నాయి. కుమార్తె పుట్టిన రెండు సంవత్సరాల తరువాత పికాసో డోరామార్ అనే మహిళతో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం తెలిసి మేరీ వాల్టర్ హతాశురాలైంది. ఆమె తన బిడ్డతో పాటు దూరంగా వెళ్లి పోయింది. పికాసో ఆమెను పెళ్ళాడాలని ఎన్నడూ అనుకోలేదు. కానీ ఆర్ధికంగా ఆమెకు సాయం చేసేవాడు. పికాసో చనిపోయిన నాలుగు సంవత్సరాలకు నానా దుర్భరమైన పరిస్థితులను అనుభవించి చివరికి ఆత్మహత్య చేసుకుని ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది.

( సశేషం )        


ఆ గదులకు తాళాలుండవ్.....



 


 అది మా గది. నేనూ, గులాం గౌస్ ( శాతవాహన  ) ఉండేవాళ్ళం. అప్పటికి మేం చాలా చిన్నవాళ్ళం. నాకూ, గౌస్ కీ  అప్పటికి పెళ్ళిళ్ళు కూడా కాలేదు. ఉషతో అప్పటికే నాకు పరిచయం. ఆ రోజుల్లో మా ఇల్లు మహానుభావులైన తెలుగు రచయితలు, కవులకు కేంద్రంగా ఉండేది.  రాచకొండ విశ్వనాధ శాస్త్రి, కాళీపట్నం రామారావు, చాగంటి సోమయాజులు, ఇస్మాయిల్, స్మైల్, నగ్నముని, అజంతా, కాళోజీ, మహీధర, వేగుంట మోహన ప్రసాద్, పెద్దిభొట్ల సుబ్బరామయ్య  వంటి పెద్దలు వస్తుండేవాళ్ళు. 'మో', సుబ్బరామయ్య గారలు రెగ్యులర్ విజిటర్స్. చాసో ఎప్పుడు విజయవాడ వచ్చినా మా ఇంట్లోనే వుండేవారు. ఇందులో మా గొప్పతనం కించిత్తు కూడా లేదు. అది కేవలం మామీద ఆ మహనీయులకున్న వాత్సల్యం తప్ప మరొకటి కాదు. ఇందరు మహానుభావులకు సన్నిహితంగా ఉండే అవకాశం దొరకటం నిజంగా మా అదృష్టం. 'మో' గా లబ్ధ ప్రతిష్టులైన మోహన ప్రసాద్ గారిని మేం మాస్టారని పిలిచే వాళ్ళం. 'బతికిన క్షణాలు' లో చాలా భాగం మాస్టారు మా ఇంట్లోనే రాశారు. మరీ ముఖ్యంగా ఈ ఖండిక మా ఇంటి గురించీ, మా గురించీ రాసినది.  ..........ఖా . మొ.   
 

ఆ గదులకు తాళాలుండవ్.....
 'మో'

విధ్వంసమయిన బతుకుని ధ్వంస రచన చేసి బాగుచేసుకోవచ్చును. గడియారాన్ని నేలకేసి కొట్టినపుడు టైం దానంతటదే కుదుటపడ్తుంది. లక్షణాల విలక్షణత్వాన్ని అలక్ష్యం చేస్తే సామాన్యార్ధకాలు సిమిలిట్యూడ్స్ విడివడి పోతాయ్. నిర్లక్ష్య నిర్లజ్జా నిగర్వాంధకారంలో అన్ని చీకటి దారులూ కాంతిపుంజాలే.

మారుతీనగర్ పల్లంలొ పక్కనే మురుక్కాలవ. ఆ గదిలో చీపురుండదు తుడవటానికి. గులాం గౌస్, ఖాదర్ మొహియుద్దీన్ ల అతి మానసిక సంస్కారాన్ని శుభ్రం చేసుకోవాలంటే బ్రూంస్టిక్ కల్చర్ ఖరీదు ఐదు వందల రూపాయలు. తలంటోసుకోవాలంటే అప్పటికప్పుడెళ్ళి అప్పేసి తెచ్చుకోవాలి నాలుగో ఐదో కుంకుడుగాయలు. మిట్టమధ్యాహ్నమెపుడో నీళ్ళొచ్చిన తర్వాత ఎసట్లో బియ్యం వేసుకోవాలి. ఆ గదులకు తాళాలుండవ్ తలుపులుండవ్. అందుకనే పుస్తకాలుతప్ప ఎవరూ ఏమీ కొట్టెయ్యరు. పప్పెవరు బాగా ఉడికిస్తారు ఉప్పెవరు బాగా కసిం చేస్తారని పందాలు వేసుకుంటారీ పారీషియన్ పొయిట్స్. అవనత వదనంతో ఏ ఐదారింటికో ఉడుకుతుంది సూర్యుడి వొణ్ణం. ఈ అన్నం ఉడికీ ఉడకగానే వెచ్చని గోరుముద్దలు తినిపిస్తారు తులసీ ఉషాలు.అడుక్కొచ్చో కొట్టేసో రహ్మాన్ కాలుస్తాడు సిగరెట్. ఆ పొగని తీగలు లాగుతూ నేనూ రెండున్నర దమ్ములు లాగుతాను.
చలం ఇంకా జీవిస్తూన్న ఈ నేలమీదే ప్రేమల, పెళ్ళిళ్ళ సాఫల్య వైఫల్యాల భయాలు. ఆనందాన్ని భరించటం ఎంత బాధో నేను సోదాహరణాత్మకంగా నవ్వుతూ చెప్తాను. వాళ్ళందరూ ఏడవబోయి కూడ చిర్నగవులు చిందిస్తారు. క్రమీణా చీకటి రాలుతూంటుంది గదిపైన  అల్లుకున్న బూజు బురుజుల్లోంచి. ఎవరి తల వాళ్ళే అంటు కోవాలి ఎవరి నెత్తి వాళ్ళే కొట్టుకోవాలి. ఎవడిపళ్లెం మాత్రం వాడు కడగకూడదు. చేతులే అన్నపు పళ్ళాలు.

కాళ్ళ వేసిన మార్క్స్ చిత్రపటం అలమారలో అడ్డం తిరిగి పడుకొంటుంది. మార్క్స్ గడ్డం రోజురోజుకీ పెరుగుతూంటుంది. సంశయాల సాలీళ్ళను విదల్చాలంటే ఐదువొందల రూపాయిలు కావాలి. మల్లీశ్వరి సినిమా చూసొచ్చిన తర్వాత కూడ మనుషులు మౌనం పాటించరు. నవ్వనూ నవ్వరు. తుఫాను వేడికి కొట్టుకుపోతూన్న గాలిలో మధ్యాహ్నం ఒక్కటే మౌనంగా వుంటుంది.

చీకటడిన తర్వాత లైట్ లేకుండా సైకిల్ తొక్కితే దొంగలు పట్టుకొని ఎర్రని బుట్టల్లో నాలుగు రోజులు అలా ఉంచేస్తారు. స్మశానంలో సైకిల్ తొక్కుతూన్నప్పుడు కూడ లైటెందుకు? కొరివి దయ్యాలు ఎర్ర టోపీలే పెట్టుకొని ఆగాగు అంటాయ్. రాయని కవితలు నాలుగో ఐదో జేబులో పెట్టుకొని వచ్చేస్తాను రాత్రికి ఇంటికి మారుతీ నగర్ డౌన్ నుంచి.

( 'మో' బతికిన క్షణాలు నుంచి ) 






Friday 27 April 2012

పికాసో ప్రేయసులు - 2

 

 


 

పికాసో ప్రేయసులు - 2


1918 వ సంవత్సరం. రష్యన్ నర్తకి ఓల్గా కోకలోవా పికాసో జీవితంలోకి అడుగు పెట్టింది. ఓల్గా తో వివాహం 

కాకమునుపే  ఆమె సన్నిహితులలో చాలా మందితో పికాసోకు ప్రేమ సంబంధాలు ఉండేవి. రష్యాలో ఆమె చాలా 

పేరున్న నర్తకి. యూరపియన్ ఆభిజాత్య వర్గంలో ఆమెకు చాలా పలుకుబడి ఉండేది. ఉన్నతవర్గాలకు చెందిన 

చాలా మంది ప్రముఖులను పికాసోకి పరిచయం చేసింది. చిత్రకళా రంగంలో పికాసో ప్రతిభా సామర్ధ్యాలను ప్యారిస్ 

లోని ఆభిజాత్య వర్గం గుర్తించేలా చేసింది. పికాసోది బోహీమియన్ స్వభావం. ఓల్గా ది పూర్తి స్థాయి ఆభిజాత్య 

మనస్తత్వం. సహజంగానే ఇద్దరి మధ్యా పొసగలేదు. దాదాపు అదే కాలంలో పికాసోకి ప్రఖ్యాత చలనచిత్ర దర్శకుడు 

జీన్ కాక్ట్యూతో బలమయిన స్నేహసంబంధం ఏర్పడింది. ' పికాసో నిత్యం నన్ను దిగ్భ్రాంతికి గురి చేస్తుండే వాడు. 

అతడు ఎన్నో అందమయిన ఆకృతులను చిత్రించే వాడు. అనంతరం ప్రకటిత సౌందర్యం నుంచి అందవిహీనమయిన 

ఆకారాలకేసి అడుగులు వేసేవాడు. ఆ తరువాత అతడు సౌందర్యం, సారళ్యం ఉన్న ఆకారాలను, చిత్రాలను 

తిరస్కరించేవాడు' అని రాశాడు కాక్ట్యూ. ఈ క్రమంలో పికాసో ఒక సరికొత్త సౌందర్య శాస్త్రాన్నినిర్మించాడు. ప్రపంచం 

అతని చిత్రకళా ఖండాలను చూసి దిగ్భ్రాంతికి గురయింది. అయితే అతని అసమానమయిన ప్రతిభకి ఆమోదం 

మాత్రం అంత తేలిగ్గా లభించలేదు. ఓల్గాకీ, తనకీ మధ్య దెబ్బతిన్న ప్రేమ సంబంధాల ప్రభావం దీని మీద స్పష్టంగా 

పడింది. ఈ కాలంలో పికాసో రంగుల ప్రయోగం ఉగ్రరూపం ధరించింది. మానసికంగా మ్రాన్పడిన ఓల్గా చివరికి మతి 

స్థిమితం కోల్పోయింది. పదిహేడు సంవత్సరాల పాటు కలిసి కాపురం చేసి చివరికి విడిపోయారు. ఓల్గా దాదాపుగా 

పిచ్చిదయింది. అతని కోసం ఎదురు చూపులే ఆమె జీవితమయింది.పికాసోకి ఎవరయినా మహిళతో సంబంధం 

ఏర్పడినట్టు తెలిస్తే చాలు , ఆమెతో సంపర్కం లోకి వెళ్ళేది. పికాసో తో సంబంధం వదులుకోవాలని హెచ్చరించేది. 

అలా బెదిరిస్తూ, బెదిరిస్తూ ఎడ్చేసేది. బతిమాలుకునేది. ప్రాధేయపడేది.బెదిరింపుల భాష ప్రాధేయపరిభాషగా 

మారిపోయేది. నా పికాసోని నాకు ఇచ్చేయందంటూ బతిమిలాడేది. నా పికాసోని నాకు వదిలేయండని ప్రాధేయ 

పడేది. పికాసో ఆమెకు విడాకులు ఇవ్వలేదు. విడాకులు ఇస్తే సగం ఆస్తి ఆమెకు ఇవ్వాల్సి వుంటుంది. డబ్బుల 

విషయంలో పరమ పిసినారి పికాసో. 

ఓల్గా 

------------------------------------------------------------------------------------------------------------------

జీవితం - కవిత్వం

 


 

 జీవితం - కవిత్వం 



జీవితం మీద మనకున్న అనురక్తి కవిత్వంలో మన అభివ్యక్తి శక్తి ని నిర్ణయిస్తుంది.
మనిషికీ, జీవితానికీ మధ్య వుండే ఆత్మీయతానుబందాలను అభివ్యక్తం చేసే భాషే కవిత్వం. భాష వెలుపల మన 

అనుభవ సాంద్రతే భాషలోపల అనుభూతి తీవ్రతగా రూపాంతరం చెందుతుంది. జీవితంలో మనం నిజంగా జీవించిన 

క్షణాలు మాత్రమే కవిత్వంలో నాలుగు కాలాలపాటు నిలుస్తాయి. కవి వేగుంట మోహన ప్రసాద్ ప్రత్యేకంగా తన

'బతికిన క్షణాలు' రాసు  కున్నారు. నిజానికి ఆయన కవిత్వమంతా తన బతికిన క్షణాల తలపోతలే. ఏ కవి  

విషయంలోనయినా అంతే. మనిషికీ, జీవితానికీ మధ్య సహజంగా ఉండవలసిన అనుబంధం క్రమక్రమంగా

కనుమరుగు అవుతూన్న కాలం ఇది. దిగజారుడుతనం, అవకాశవాదం వంటి అనేకానేక అవాంచనీయ అంశాలు

  సర్వత్రా  స్వైరవిహారం చేస్తూన్న సమయం ఇది. మనిషి మనుగడకు అవసరమయిన మౌలికమైన దినుసులు

ఒకటొకటిగా అంతర్ధానం అవుతూ వస్తున్నాయి. వాస్తవానికి ఇది కనిపించని ఒక భీతావహ  వాతావరణం . 

ఇటువంటి వాతావరణంలో కవిత్వం మనిషికి ఒక అచంచలమయిన నమ్మకాన్ని ఇవ్వాలి.  కొండ లాగా  అండగా 

నిలవాలి. అయితే ఒక విషయం. కవిత్వం కేవలం శరణార్ధుల శిబిరంలా కూడా మారిపోకూడదు. అది కేవలం ఒక 

అంతిమ విశ్రాంతి మందిరంలా కూడా మారిపోకూడదు. అది అనునిత్యం మన బాధ్యతల్ని గుర్తు చేస్తూ, కాలం విసిరే 

సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కునే సమర స్థలి లాగా వుండాలి కవిత్వం. 

కవిత్వం రాయటం సులభం. కానీ మంచి కవిత్వాన్ని గుర్తించటం, మంచి పాఠకుడుగా మిగలటం, కవిత్వంతో చెలిమి 

చేయటం కష్టసాధ్యమయినవి మాత్రమే కాదు, మన మౌనాన్నీ, ధ్యానాన్నీ పూర్తిగా నిరంతరం మొహరించి వుంచ 

వలసిన అంశాలు. ఏమాత్రం కష్ట పడకుండా కవిత్వం రాయటం తెలుగు కవి సహజ స్వభావం.   అవసరమయిన 

ముడి సరుకునే  నేరుగా కవిత్వంగా చెలామణీ చేయాలని చూస్తున్నారు చాలామంది మన  కవులు.  జీవితం 

మీద, కవిత్వం మీద, భాష మీద ఏ మాత్రం గౌరవం వున్నా ఇటువంటి అఘాయిత్యాలకు  పాల్పడటానికి  ఎంత 

మాత్రం సాహసించరు. కవిగా జీవించాలని కోరుకునేవాడు చేయవలసిన మొదటి పని  జీవితాన్ని మనసారా 

ప్రేమించటం. మరీ ముఖ్యంగా తెలుగు కవికి ఇది తక్షణావసరం. జీవితాన్ని  ప్రేమించలేనివాడు అసలు  

కవిత్వాన్నిగుర్తించలేడు. కవి కాకపోయినా పెద్ద నష్టం ఏమీ లేదు.  కవిత్వాన్ని  ప్రేమించకపోయినా నష్టం లేదు. 

కానీ జీవితాన్ని ప్రేమించకపోతే అంతా నష్టమే. సర్వం విధ్వంసమే. కవిత్వం పూర్తి స్థాయి ప్రమేయాన్నీ, పూర్తి స్థాయి 

తాదాత్మ్యాన్నీ , టోటల్ ఎంగేజ్ మెంట్ ని డిమాండ్ చేస్తోంది. 

నిజమయిన సృజన, ఆ మాటకొస్తే ఏ కళ అయినా సరే, కష్టతరం - సులభతరం, సరళం  - గందరగోళం, వ్యష్టి - 

సమష్టి, సామాజికోన్ముఖత - సామాజిక నిరపేక్షతల మధ్య ఎంపిక చేసుకునే అవకాశం కల్పించదు. మనకి 

నలువైపులా, ముందూ వెనకా మోహరించివున్న శక్తులతో నేరుగా తలపడటం, చిక్కు ముడులను విప్పటం వినా 

మరో మార్గం లేనే లేదు.

నిజమయిన కవిత్వాన్నీ, కవిత్వ  భాషనీ గుర్తించటానికి కూడా లోతయిన దృష్టీ, సరయిన అవగాహనా చాలా 

అవసరం. జీవితాన్ని అనంతంగా ప్రేమించేవాడికే  ఈ దృష్టి  ఉంటుంది.


Thursday 26 April 2012

పికాసో ప్రేయసులు -1

 

పికాసో ప్రేయసులు - 1

 

పరమ  విచిత్రం పాబ్లో పికాసో ప్రేమ జీవితం. పికాసో తన జీవితంలో అనేకసార్లు ప్రేమలో పడ్డాడు. 

అనేకమందిని ప్రేమించాడు. అతని ప్రతీ ప్రేమకథా ఒక విషాదాంతమే.  జాగ్రత్తగా గమనించి చూస్తే,  

చిత్రకళా రంగంలోనే కాదు, పాబ్లో పికాసో  ప్రేమ ప్రపంచంలో కూడా ప్రయోగాలు చేశాడా అని అనుమానం

వస్తుంది. ఇంతకీ అతను ఎందుకు ప్రేమించాదన్నది   మనకు అంతుబట్టదు. స్త్రీ ప్రేమ ద్వారా పికాసో పొందాలని

అనుకున్నది ఏమిటి? అసలు అతని అన్వేషణ ఎందుకు? వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకవు.

పికాసో తన జీవితంలో మొత్తం ఏడుగురు స్త్రీలను ప్రేమించాడు.ఈ ఏడుగురు ప్రేయసుల ప్రభావం  ఆయన చిత్రకళ

మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పాబ్లో పికాసో చిత్రకళా జీవితంలో మొత్తం ఏడు ముఖ్యమయిన మలుపులు

ఉన్నాయని చిత్రకళా మర్మజ్ఞులు అంటారు. ప్రతీ ప్రేమకథ ఆయన చిత్రకళను ఒక కొత్త మలుపు తిప్పుతూ వచ్చింది. 

1. ద బ్లూ పీరియడ్ 

2. ద రోజ్ పీరియడ్ 

3. ద న్యూడ్ 

4. క్యూబిజం 

5. ఆఫ్రికన్ ప్రభావం 

6. క్లాసికల్ యుగం 

7. సర్రియలిజం 

ఈ పెయింటింగ్ లో కనిపిస్తున్నది  పికాసో తొలి ప్రేయసి .



1904 -1912


ఫెర్నాండో  ఓలివేర్.

పికాసో  తొలి  ప్రేయసి  పేరు  ఫెర్నాండో  ఓలివేర్. ఈమె సాహచర్యంలో వున్న కాలాన్నే   ' ద రోజ్ పీరియడ్ ' 

అన్నారు.ఈ దశలో పికాసో చిత్రించిన పెయింటింగ్స్ లో మహిళ రూపురేఖలు ముమ్మాటికీ ఒలివర్ వే  అని 

చెప్పవచ్చు. వీళ్ళిద్దరూ దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు కలిసి జీవించారు.పికాసో పరమ ఈర్ష్యాళువు.  

అనుమానం అనే పిశాచం నిరంతరం అతనిని వెంటాడుతూ ఉండేది. ఒలివర్ ని నిత్యం  అనుమానించే వాడు. తాను 

బయటికి వెళ్ళవలసి వస్తే ఒలివర్ ను గదిలో పెట్టి బయటి నుంచి తాళం వేసి వెళ్ళే వాడు.

ఎవా గూల్ అతనిజీవితంలోకి  అడుగు పెట్టేవరకూ ఇదే పరిస్థితి.      

---------------------------------------------------------


1913

 ఎవా గూల్

ఒలివర్ తో గడిపినట్టే  ఎవా గూల్ తో కూడా గడపాలని ఆశించాడు. కానీ అది సాధ్యం కాలేదు. ఎవా గూల్ ఎదురు 

తిరిగింది. నిరంతరం ఘర్షణ. సహజంగానే ఎక్కువ కాలం కలసి ఉండలేక పోయారు. విడి పోతానని బెదిరించింది 

ఎవా. అంతే.  పికాసో ఆమెకు దూరమయిపోయాడు. ఈ పరిణామాన్ని ఎవా తేలిగ్గా జీర్ణించు కోలేక పోయింది.

తీవ్రమయిన మానసిక సంక్షోభానికి గురయింది. క్షయ వ్యాధికి గురయింది. 1915 లొ ఎవా గూల్ చచ్చిపోయింది.

ఆమె మృత్యువు పికాసోను తుత్తునియలు చేసింది. క్యూబిజం మీద సాగించిన  కృషిలో  ఎవా మీద అతనికి వున్న 

ప్రేమను మనం గుర్తించవచ్చు. పికాసో జీవితంలో క్యూబిజం ఒక తీవ్ర స్థాయి ఉద్విగ్నతతో నిండివున్న కాలం అని చెప్పవచ్చు. 

( సశేషం )

సిల్వియా ప్లాత్ - టెడ్ హ్యూజ్

 తల్లిదండ్రులు, భర్త టెడ్ హ్యూజ్ తో సిల్వియా ప్లాత్ 


సిల్వియా ప్లాత్ - టెడ్ హ్యూజ్    

 

27 అక్టోబర్1932 లో పుట్టిన అమెరికన్ కవయిత్రి, నావెలిస్టు,  కథా రచయిత్రి  సిల్వియా ప్లాత్ 

ప్రఖ్యాత ఆంగ్ల కవి టెడ్ హ్యూజ్ ని పెళ్లి చేసుకుంది. ఈ దంపతు లిరువురూ కొంత కాలం అమెరికాలోనూ ,

ఆ తరువాత ఇంగ్లాండు లోనూ గడిపారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు.

సిల్వియా ప్లాత్ కవిత్వం మనలను భీతావహులను చేస్తుంది. ఒక రకంగా మనల్ని డిప్రెషన్ కు గురి చేస్తుంది.  

అయినప్పటికీ ఆమె కవిత బలంగా మనల్ని ఆకట్టు కుంటుంది. తనకేసి లాక్కుంటుంది. 

వైవాహిక జీవితంలో ఎదురయిన అసంతృప్తి , తీవ్రమయిన డిప్రెషన్ కారణంగా కేవలం ముప్ఫయ్యేళ్ళ వయసులో 

సిల్వియా ప్లాత్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె పూర్తి జీవితం , ఆత్మహత్య కు దారితీసిన పరిస్థితులు 

ఏమిటన్నది ఈనాటికీ అంటూ పట్టని ఒక రహస్యంగానే మిగిలిపోయాయి.

సిల్వియా ప్లాత్ ఆత్మహత్య తరువాత టెడ్ హ్యూజ్ ఒక కవిత రాసాడు.

సిల్వియా ప్లాత్ చనిపోయినపుడు టెడ్ హ్యూజ్ రాసిన కవిత మూలప్రతిలో ఒక పుట 

-----------------------------------------------




 


   


అమ్మకూచి

 

 

 

అమ్మకూచి 

అరటి పండు వలిచినట్లు ఆ చెట్టును  గురించి

ఇక ఆమె చెబుతూన్నదేదీ 

వాడి చెవికి ఎక్కదు గాక  ఎక్కదు

ఆమె చెబుతూన్న మాటల మెట్లమీంచి వాడు

అలా అలా అడుగులు వేస్తూ అమాంతంగా 

అదృశ్యం అయిపోయాడు ఆకాశంలో 

సరాసరి  స్వర్గంలోంచి చెట్టు మీదికి దిగుతూన్న

పండ్ల రంగూ రుచీ వాసనా చూస్తూ 

పరవశంలో పరవళ్ళు కొడుతున్నాడు 

అమ్మ మాటలకు పరధ్యానంగా

వాడు కొడుతూన్న'ఉ ఊ' ఊయలగా మారి 

అటు నేలకీ, ఇటు ఆకాశానికీ మధ్య

  వూగుతూంది ఉల్లాసంగా .......


..........
  

 

Wednesday 25 April 2012

వరం వద్దు ...

నాకు వరం వద్దు 

నాకు నాదే అయిన ఒక స్వరం కావాలి

జ్వరం ధ్వనించే ఒక స్పష్టమైన స్వరం కావాలి

Tuesday 24 April 2012

మామిడి టెంకె



మామిడి టెంకె  



ఎవరో  పెంకె పిల్లాడు 
 
నిర్లక్ష్యంగా  విసిరేసిన   టెంకె   

వచ్చి వాలింది నా వళ్ళో

అర క్షణం నాలోపల  అస్తి  నాస్తి విచికిత్స

మదిలో  ఒక విచిత్ర  గతితర్కం మీమాంస  

చీకి  పారేసిన మామిడి టెంకెలో

ఆదమరిచి నిద్రిస్తూన్నఏదో ఒక  ఆదిమ జీవి అలికిడి  

ఆకృతి అందని దశలో ఆరాటపడుతూన్న ప్రకృతి 

 లోలోపల ఏవేవో పరవశిస్తూన్నప్రాచీన స్మృతుల  సవ్వడి

భూమీ ఆకాశాల అనంతానంత అనుబందాల మధ్య

వర్ధిల్లాలని వాంచిస్తూన్న వృక్ష వంశ సహస్రాలు

సుగంధాలు, పరీమళాలు, పరిపక్వమైన మాధుర్యాలు

పచ్చ పచ్చని వృక్షాల ప్రపంచాన్ని

 కోలాహలంతో నింపాలన్న కుతూహలంతో 

కిలకిలకిలకిలమంటూ గుంపులు గుంపులుగా

కదిలే లక్షలు లక్షల పక్షుల సమూహాలు

 
   

Monday 23 April 2012

పదాలతో నేను ప్రపంచాన్ని గెలుస్తాను

అనువాదం

పదాలతో నేను ప్రపంచాన్ని గెలుస్తాను

నిజార్ ఖబ్బానీ  

 

పదాలతో నేను ప్రపంచాన్ని గెలుస్తాను 

మాతృభాషనీ, క్రియలనీ, సంగ్నలనీ  , వాక్యవిన్యాసాలనీ జయిస్తాను 

నీటి సంగీతం, అగ్ని సందేశం కలిగిన 

ఒక కొత్త భాష సాయంతో  వస్తువుల ప్రారంభాన్ని తొలగిస్తాను 

రాబోయే యుగాన్ని నేను కాంతులతో నింపుతాను 

కాలాన్ని స్తంభింప జేస్తాను నీ కన్నులలో 

ఈ ఒంటరి ఘడియనుంచి కాలాన్ని వేరు చేస్తూన్న 

ఆ గీతను ఇదిగో ఇప్పుడే   చెరిపేస్తున్నాను  

  





నేను అద్భుతమైన ఒక ఆమ్లెట్ ని రచించాను






నిక్కీ జియోవానీ  ( Nikki Giovanni ) అమెరికన్  కవీ, రచ యిత్రి.. రోజువారీ జీవితంలో కనిపించే సర్వసాధారణమైన వస్తువులు, క్రియాపదాలను ఎంత అ/సువ్యవస్థితమైన పద్ధతిలో అమర్చిందో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరైనా సరే ప్రేమలో పడిన కొత్తలో ఎదుర్కునే వింత మానసిక స్థితిని ఈ పదాల పొందిక స్పష్టం చేస్తుంది. ఈ కవిత అర్ధం చేసుకోవటానికి మీకు ఎలాంటి వ్యాఖ్యానాలు, టీకా టిప్పనుల అవసరం లేదు. చదివిన తక్షణమే చేసిన అనువాదం ఇది.     



నేను అద్భుతమైన ఒక ఆమ్లెట్ ని  రచించాను  

 

నేను అద్భుతమైన ఒక ఆమ్లెట్ ని రచించాను ... ఒక వేడి వేడి పద్యాన్ని భుజించాను 

నీ ప్రేమలో పడిన తరువాత


నా కారు గుండీలను పెట్టుకున్నాను ... నా కోటును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాను ... వర్షంలో.... 

నీ ప్రేమలో పడిన తరువాత

రెడ్ సిగ్నల్ చూసి ముందుకు పోనిచ్చాను ... గ్రీన్ సిగ్నల్ చూసి ఆగిపోయాను ...

రెండింటి మధ్యా  ఈదుకుంటూ ఎక్కడో...

నేను నా పక్కను చుట్టేశాను ... నా శిరోజాల ధ్వనిని తగ్గించాను ... కాస్తంత భ్రమించాను కానీ ... ఫర్వాలేదు నాకు ...

నేను నా దంతాలను ముందుకు విస్తరించాను ... నా గౌనును విశాలం చేశాను ...  నిలబడి పోయాను ...

నన్ను నేను  కిందే ఉంచుకున్నాను ... పడుకునేందుకు ...

నీ ప్రేమలో పడిన తరువాత




Friday 20 April 2012

నేనూ, నా దేముడూ

 


 

 


నేనూ, నా దేముడూ 

 

1

 



చడీ చప్పుడూ  లేకుండా నేనే

చక్కా వెళ్లి   చక్కిలిగిలి పెట్టి వచ్చాను 


నా దేముడు నవ్వుతున్నాడు

నవ్వులు నవ్వులు నవ్వులు గా

నా దేముడు పరవశిస్తున్నాడు

పువ్వులు పువ్వులు  పువ్వులుగా

నా దేముడు పరిమలిస్తున్నాడు 


2

 

నా దేముడు 

తన బట్టలు పాపం 

తనే ఉతుక్కుంటున్నాడు

ఈ రోజు నేను పునీతున్ని అవుతున్నాను 


3   

 

నా దేముడు 

అమ్మమ్మ చెబుతూన్న పేదరాసి పెద్దమ్మ  కథని 

శ్రద్ధ గా ఆలకిస్తున్నాడు 

ఈ రోజు నా దేముడు హాయిగా 

ఆదమరచి నిదుర పోతాడు 


4

 

నా దేముడు 

హాయిగా కల గంటున్నాడు

ఆయన కలలోకి నేను అడుగు పెట్టాలి
  
ఆ హాయి నా పెదవులపై దరహాసమై వెలగాలి

నా దేముని కల సెలయేరులా సాగాలి 


5

 

పాపం నా దేముడు

పదే  పదే అలసిపోతున్నాడు

పసి పిల్లలు ప్రతి రోజూ

 రాళ్ళు మోస్తూన్నారు 



6

 

నా దేముడు 

అశాంతితో అలమటిస్తున్నాడు

అయినదానికీ , కానిదానికీ నేను

 ఆయనను అర్ధించటం మానివేశాను 


7



నాట్యం చేస్తున్నాడు నా దేముడు

 ఆయన చెవుల నిండా 

పసిపాపల నవ్వుల పువ్వులు 


8

 

నా దేముడు 

క్షమాభిక్ష కోసం నా ప్రార్థన 

ఆసక్తిగా ఆలకిస్తున్నాడు 

నేనేమో మరికాసిని  పాపాల కేసి 

ఆబగా చూస్తున్నాను 


9

 

నా దేముడు

అందరి  పనులూ  

అస్తమానం తనే చేస్తుంటాడు 

మన పనులు మరెవరూ మనలా చేయనే లేరని 

 ప్రతీసారీ మనం ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నాం 


 10

 

 నా దేముడు  అన్నీ తెలిసీ

 అడుగుతున్నాడు నన్నే ప్రతిదీ


చెప్పేస్తూనే ఉంటాను ఏది  అడిగినా

నాకు మాత్రమే  తెలిసినట్టు
 


11

 


   నా దేముడు నా ఇంటికి 

ఎంచక్కా కిటికీలు బిగిస్తున్నాడు 

ఇపుడు నా కళ్ళకు ఆకాశం

ఎంత స్పష్టంగా కనిపిస్తుందో !



12

 

ప్రతీ మెతుకు మీదా నా దేముడు

నా పేరును  లిఖిస్తున్నాడు 

నేను మాత్రం ఎప్పటిలాగానే

 నా కష్టార్జితం అనే భ్రమతోనే సుఖిస్తున్నాను 
  


13

 
నా దేముడు అస్తమానం 

నన్నే తలచు కుంటున్నాడు 

నేనేమో నిత్యం సిగ్గుతో తల వంచుకుంటున్నాను

 

14

 

నిజానికి నేనూ - నా దేముడూ సయామీ కవలలం 

నేనూ - నా దేముడూ నింగీ నేలలం

నేనూ - నా దేముడూ సృష్టి అనే  నాణానికి బొమ్మా బొరుసులం

నేనూ- నా దేముడూ చీకటీ  వెలుగులం 

నేనూ - నా దేముడూ .....

  

 

Monday 16 April 2012

అల్లామా ఇఖ్బాల్


 


 

అల్లామా ఇఖ్బాల్

జీవితం - సాహిత్యం 

షిక్వా - జవాబె షిక్వా   

అనువాదం 

ఎం. ఏ. రహ్మాన్  

ఘనమైన గతం, దిగజారిన వర్తమానం, కోల్పోయిన ఘనతను తిరిగి సాధించుకోవడానికి అనుసరించ 
వలసిన మార్గం ఏమిటన్నదే షిక్వా - జవాబె షిక్వా  లోని కవితావస్తువులు.ఇదే  అంశం వేరే సాధారణ కవి 
ఎవరైనా అయితే గతం ఘనతను దివ్యంగా పొగిడి, వర్తమానపు దుర్దశకు ఏడ్చి పెడబొబ్బలు పెట్టి ఊరుకునేవాడు.
కాని మహాకవి ఇఖ్బాల్ అసాధారణ ప్రతిభావంతుడు. గొప్ప తాత్వికుడు. అందుకే ఆయన సాక్షాత్తు దైవంతోనే 
సంవాదానికి దిగాడు. దైవం నుంచి సమాధానాలను రాబట్ట గలిగాడు. నేరుగా దైవంతో జరిపిన చర్చలు, వాదోపవాదాలు , దైవ స్పందనలకు అక్షర రూపమే షిక్వా - జవాబె షిక్వా.

కుంగ నేల నష్టాలతో  లాభాలది మరచి బాట 
వీడి చింత రేపటికై మోయనేల గతపు మూట 

ఎందు కాలకించాలిక ఆ బుల్ బుల్ ఆర్త గీతి 
మేను మరచి ఉండలేను సహచరుడా పూవు రీతి 

తెలుగు, హిందీ ,ఉర్దూ, అరబీ, ఫారసీ, ఇంగ్లీష్ భాషా సాహిత్యాలతో సంబంధం ఉన్న కవి, పండితుడు, విమర్శకుడు,
కళా సాహిత్యాల మర్మ మెరిగిన ఎం. ఏ . రహ్మాన్ గారి అనువాదం, విశ్లేషణ రెండు ప్రామాణికమే అని ఘంటా పధంగా
చెప్పవచ్చు. ఆనతి కాలం లోనే రహ్మాన్ గారి కలం నుంచి మనం మౌలానా హాలీ, సాదీ శీరాజీ, మౌలానా రూం వంటి మహనీయుల రచనలు ఆనతి కాలం లోనే తెలుగు పాథకులను అలరించనున్నాయి. 


     

Saturday 14 April 2012

రాయలేను

 

 

రాయలేను.....


అస్తమానం అలా అలా 

పాకుతూనే ఉంటాయి పదాలు 

పంక్తులు పంక్తులుగా వంతులు వంతులుగా

పనీ పాటా లేకుండా మన మస్తిష్కంలో 

మనకు ఏమాత్రం తెలియకుండానే మొదలై పోతుంది 

మెదడు మైదానంమీద ధ్వనుల ద్వంద్వ యుద్ధం 

నిజానికీ అబద్ధానికీ మధ్య ఏమాత్రం తేడాయేలేని వాక్యాల వ్యాకరణం

అణువణువునా  అస్పష్టతలు  ఆధునిక అలంకారాల విస్ఫోటనం 

అలజడులు , అల్లర్లు , అల్లకల్లోలాల విశృంఖల  స్వైర విహారం 

బరి తెగించిన ఒకానొక  భాషా కాషాయ విష విన్యాసం 

సర్వసంగ పరిత్యాగం కాదు కాదు అసలు  కానే కాదు 

సన్యాసం కేవలం ఒక ఆధునిక పదవిన్యాసం 

ఇది మనిషిని మంచంగా కుంచించే కుతంత్రం 

ఇది మతాన్ని బ్యాలట్ బాక్స్ గా మార్చేసే ప్రయత్నం 

ప్రస్తుతం ఒక సరికొత్త కల్లోలిత ప్రాంతం పేరు సంస్కృతి 

అవును భాష ఒక పెద్ద బద్మాష్!

ఆదిమ నుడికారంతోనే సంహారం సాధ్యం 

అప్పటి వరకూ నేను రాయలేను గాక రాయలేను 

      

 


 

అసంపూర్ణంగానే......

 

అసంపూర్ణంగానే......

 ప్రాణ ప్రదంగా పెంచుకున్న పదాలు వంచిస్తే 

ఒక్కసారిగా కుంచించుకు పోతుంది వాక్యం 

అనుకోవటం అంటే అర్థాన్ని 

సృష్టించుకోవటమే, అదీ  మన మాటల్లోనే 

వెలుతురు వృత్తం వెలుపల అభివ్యక్తికి అందని అంధకారాన్ని 

భాష బరి  లోకి లాగుతుంది బలవంతంగా 

అక్షరాల  పరిసరాల్లో అలా అలా సంచరిస్తూ

పరిభ్రమిస్తూ పరిక్రమిస్తూ ప్రతిధ్వనిస్తూ 

ఉన్నట్టుండి కొత్త అర్థం లోకి  విచ్చు కుంటుంది వాక్యం 

అర్థాల అంతరాలు అంతర్థాన మై 

వైరుధ్యాలు అశ్లీల మవుతున్న సంధ్యా సమయం  

అందుకోసమే కదా మనీషి

అనాది అనాదిగా అనాలని అనుకుంటూనే 

వెళ్లి పోతున్నాడు  ఎన్నెన్నో అనేసి 

అనవలసింది మాత్రం   అనకుండానే వదిలేసి ....





Friday 13 April 2012

kaadaa....!

 

 

  

కాదా.....!

 

అవునూ ఏదీ 

ఆమె దేహంలో నిత్యం ప్రవహించునది 

అది ప్రపంచంలోకెల్లా ప్రాచీనమైనది - నది !

ఆ నదిలోనే మనం ఓలలాడినది

అంచెలంచెలుగా ఈదులాడినది

చిన్నారి బొట్టుతో చిగురించి చిగురించి

సుతిమెత్తని నెత్తురు చెట్టులా మృదువు మృదువుగా

తరిస్తూ జ్వలిస్తూ మారాకు తొడిగినది 

ఆ నదీ తీరంలో కాదా మన దేహం దాహం తీరా నీరు తాగినది 

ఆ దేహమే కాదా నిండు ప్రాణాన్ని గర్భంలా మోసినది 

అది అతి మృదువైన అంధ కారంతో అలముకుని ఉన్నది 

చీకటి వెలుపల విస్తరించిన వెలుగులు వివాదాలు విషాదాలు వినోదాలు విలాపాలు

అందాలు ఆనందాలు అలరించే భవబంధాలకు

 భయపడి కాదా మనం

సుభిక్షం  సురక్షితం శాశ్వతం అనుకుని కాదా

 ఆమె గర్భ క్షేత్రంలో అలా మనం

 ముడుచుకు పడుకున్నది......




Thursday 12 April 2012

స్వంత గొంతుకే .....


 

స్వంత గొంతుకే .....

ఆవిరినీ 

అనంతానంతమైన అశాంతినీ

అర్ధంతరంగా అలాగే వదిలేసి 

ఆత్మనీ , ఆమాశాయాన్నీ, దంతాల్నీ , పంతాల్నీ 

కేశాల్నీ, క్లేశాల్నీ , పంచరంగుల ప్రదేశాల్నీ , విశేషాల్నీ విసర్జించి 

పెంపుడు జంతువును పలుపు తాడుకు కట్టేసి గట్టిగా 

పోకతప్పదు నాయనా ఎవరికయినా

కాస్తో కూస్తో ముందో వెనకో 

అనుభవంలో తప్ప అర్ధం కానే కాని తత్త్వం 

అనవసరం అన్వేషణం 

అంతర్థానమే  శాశ్వతం 

అంతిమంగా వినిపించేది 

స్వంత గొంతుకే 

ఎవరికైనా .........

 


 

      

మోసీ , మోసీ .....

  




 మోసీ , మోసీ .....

'మో' భాషలో మూగపోబోయి

ఆగిపోయానో లేదో  నాదో మరి కాదో 

ఏదో ఒక   crisis of suffocation లోంచి 

లంకించుకున్న పరుగూ పందెం 

మార్సెల్ ప్రౌస్ట్ involuntary memory లోంచి 

కటీసాగరంలో వటవృక్షం 

నీలిపత్రం మీద నిద్రిస్తూన్న ఆదిమ శిశువు 

పాపాలు కరగని పాల్గారే పశువు సిసిఫస్ యులిసిస్

to undrain to his heart 

పాలిపోయిన  పెదాల తొలిపలుకులు 

పారాడే మెలికలతల నులిపురుగులు 

చండ చండం ఖండ ఖండం 

అండ పిండం ధ్వజాదండం 

పిత్రుశిలతో  మిత్రభేదం శత్రుశేషం 
 
కామతంత్రం బీజమంత్రం 

స్వీయ రక్త సాముద్రిక రహస్య రసాస్వాదనం 

ముముక్షా జిజీవిషా శిరీషా రాంషా

అలెన్ గిన్స్ బర్గ్ మరమరాలు 

జెన్ మంత్ర తంత్ర స్వరాలు 

నయాన్నో భయాన్నో వుభయాన్నో

అ హ హ హ హా హా  న్న  న న న నా 

వల్ల కాదు వల్ల కాదు వల్లకాదు

ఇంద్రియాల ఇల్లరికం వల్లకాదు వల్లకాదు 

పిల్లగాడు నల్లభామ వల్లకాడు చిల్లికుండ

వగపేటికి మగపేటిక చివరిసారి చల్ల చిందినన్ 

సీతారాం సీతారాం రాం రాం సీతారాం 

మహాంత విభు మాత్మాన్ మత్వా ధీరో న శోచతి 

ఓం శాంతి శాంతి శాంతి శాంతిహీ               


Wednesday 11 April 2012

పుంస్త్రీలింగం






పుంస్త్రీలింగం 
 
 
నీరు న్యూట్రల్ కాదు 

అది యెట్లన్నన్ ...


లంకల్లోంచి తొంగి చూస్తే 

నది ( ఇదొక పేరైనా అదీ నీరే )

తొడల్ని ఎడం చేసుకుని 

నగ్నంగా పడుకున్న 

ఆడదిలా వుంటుంది 


తెడ్ల చేతులూపుకుంటూ 

ఒడ్డు వక్షం వేపుకి పాకుతుంది 

పాపాయి లాంటి పడవ 


గాలి చేతుల్తో వీపున్నిమురుతూ 

ఒడిలోకే  లాక్కుంటుంది యేరు 


కృష్ణపక్షంలో ఎండిపోయే 

ఆకాశప్పాడి గేదె 

చివరిగా యిచ్చిన కాసిని పాలూ 

నీటిమీదా, నింగి మీదా 

చుక్కలు చుక్కలుగా ఎండిపోతాయి    


నిన్న మొన్నటి దాకా యేరు 

ఒదిగి ఒదిగి వెళ్తున్దేదా 


ఇపుడేమో గట్లెక్కుతుంది


మేడలూ మెట్లేక్కుతుంది


నేల నరాల్లోంచి పాకి 

వీధి మొగల్లో

ఇళ్ళ పంచల్లో 

మేడల్లో , మిద్దెల్లో 

శివ లింగాలై మొలిచి 

వెల్లకిలా పడుకున్న బిందేల్నీ 

దోసిళ్ళ దోనెల్నీ

అర చేతుల దొప్పల్నీ

అభిముఖంగా  ఆకర్షించుకుంటుంది 

నిజంగా నీరు 

రెండు వైపులా 

పదునుగల కత్తి

అది 

ఆడదీ 

మగాడూనూ....  


        


Tuesday 10 April 2012

SANDHYA

Pope can wear an underwear,
I hope...................................
-- Laurence Ferlinghetti

 

సంధ్య 

ఊరు ...

పక్కనే యేరు ...


వేళ్ళ కాళ్ళని నగ్నంగా బారజాపి 

ఏటి నీటిలో నీడల్ని శీర్షాసనం వేయించి 

తపస్సు చేస్తూన్న చెట్లు ...


పసిపిల్లాడిలా చేతులాడిస్తూన్న 

బెల్ బాటం తాటిచెట్టు ...


ఎవరో చచ్చిన ఆవును 

మోసుకు పోతున్నారు 


దాని తోక   

నేలమీద ఎలిజీ రాస్తోంది ...


మతి భ్రమించిన శిల్పిలా

మేఘాల్ని చెక్కుతూన్న గాలి....


ఏటి నీటిపై నీలం రంగు 

పెయింటు వేస్తున్న ఆకాశం ...


స్మశానంలో దీర్ఘంగా ధ్యానిస్తూన్న సమాధులు ...


వెలుగు చీకట్ల 

పల్టీలు వేస్తూ 

ఎర్ర లంగోటా

 చుట్టుకుని 

కాలం వేసిన 

శీర్షాసనం 

ఈ సంధ్యాసమయం ...