Friday 8 June 2012

వేస్ట్ ల్యాండ్ - 2





వేస్ట్ ల్యాండ్  -  2



చవిటిపర్ర 

టి ఎస్ ఎలియట్



పొద్దు పొడిచెను గాలి వీచెను

" నా జన్మభూమి దిశగా సాగే

ఓ  నా ఎర్రని ఇరిష్ కుర్రదానా

ఎక్కడ వేచి వున్నావు

నా కోసం నువ్వు? "


" జాజి పూలిచ్చావు తొలిసారి నువ్వు నాకు ఏడాది క్రితం

జాజిపూల పిల్లా అని పిలుస్తూంది నన్ను జనం "

" జాజిపూల వనం నుంచి ఆలస్యంగా మనం

మరలివచ్చి చూస్తే నీ దోసిళ్ళ నిండా పూలు తలనిండా తడి

ఒక్క మాటా పలకలేదు నేను

మూర్ఛపోయాయి నా కళ్ళు

సజీవినీ కాదు  శవాన్నీ కాను

తెలియదు ఏం జరిగిందో నాకు

కాంతి అంతరంగంలో అంతా నిశ్శబ్దం

బీడువారిన బంజరు భూమి సముద్రం "


మహా కాలగ్నాని మేడం సొసోస్త్రిస్ కి

పట్టింది చచ్చేంత జలుబూ పడిశం

ఆమెను మించిన మహాజ్ఞాని 

యూరప్ లోనే లేదని విశ్వసిస్తోంది ప్రపంచం

ఆమె చేతిలోజాతకాల పేకముక్కల పెట్టె

' మునిగిపోయిన ఓ ఫినీషియన్ నావికుడా

ఇదే సుమా నీ చిరునామా ' అందామె

( చూడండి ఈ ముత్యాలు అలనాటి అతని నేత్రాలు )

బెలడోనా, ఈమె గండశిలల  అంధసుందరి

రకరకాల సందర్భాల సౌదామిని

వీడేమో మూడు శూలాల మనిషి

ఇదిగో ఇది అదృష్టచక్రం

ఇక వీడే ఆ ఒంటి కంటి వణిజుడు

ఈ శూన్యపు పేకముక్క

నిత్యం తను వీపుమీద మోసుకుతిరిగే భవిష్య  విశేషం

ఆ రహస్యం నా పాలిట నిషిద్ధం


జలమృత్యువును చూచి భయపడండి


చూస్తున్నాను నేను గుంపులు గుంపులుగా జనాన్ని

నడుస్తున్నారంతా వలయంగా ఒక వృత్తం లో


ధన్యవాదాలు!


మిసెజ్ ఎక్విటోన్ మీకు కనిపిస్తే

చెప్పండి ఆమెకు నేనే

స్వయంగా జాతక చక్రాన్ని

పట్టుకు వచ్చేస్తున్నానని

అసలే రోజులు మంచివి కావు

అప్రమత్తంగా ఉండటం అందరికీ అవసరం


అవాస్తవ నగరం

కావురు పట్టిన జేగురు మంచులో

ఒక చలికాలపు ఉదయసంధ్య

లండన్ బ్రిడ్జిమీంచి ప్రవహిస్తోంది జనసందోహం, అసంఖ్యాకం

తట్టనేతట్టలేదు నాకు

ఇంత మందిని  చావు   ఇలా పొట్టన పెట్టుకుంటుందని

ఉండి వుండి వినిపిస్తున్నాయి చిన్ని చిన్ని నిట్టూర్పులు

పాదాలమీద పేరుకుపోయింది ప్రతి మనిషీ చూపు

కొండమీంచి గడిచి, కింగ్ విలియం వీధిలోంచి నడిచి

సెంట్ ఊల్ నాత్ చర్చికి చేరుకుంది సమూహం

స్తంభించిపోయింది చర్చి గడియారం లో

ఆ ఆఖరి తొమ్మిదో గంట శబ్దం


అక్కడ నేను ఒక చిరపరిచితుణ్ణి చూశాను

పిలిచాను ఆపాను ఎలుగెత్తి అడిగాను

' స్టెట్సన్! మైలా యుద్ధనౌకల్లో కలిసి పయనించాం గుర్తుందా మనం?

కిందటి సంవత్సరం నీ తోటలో నాటిన శవం

మొదలెట్టిందా మొలకెత్తడం?

పుష్పిస్తుందంటావా అది ఈ సంవత్సరం?

లేక అస్తవ్యస్తం చేసేసిందా అకస్మాత్ హిమపాతం?

కుక్కని మాత్రం చేరనీయకు దాని దరిదాపుల్లోనికి

మనిషికి మాత్రమే అది నేస్తం

గోళ్ళతో తవ్వి తీస్తుంది శవాన్ని

ఓ వంచక పాఠకుడా, ఓ నా ప్రతిరూపమా! ఓ నా సోదరుడా!


( సశేషం  )




   

       

No comments:

Post a Comment