Saturday 28 April 2012

పికాసో ప్రేయసులు - ౩

మేరీ తెరిస్సా వాల్టర్  

పికాసో ప్రేయసులు  - ౩



అది 1927 వ సంవత్సరం. పికాసో వయస్సు నలభై ఐదు సంవత్సరాలు. పదిహేడు సంవత్సరాల పడుచు మేరీ తెరిస్సా వాల్టర్ అతని జీవితంలోకి అడుగు పెట్టింది. ఇద్దరూ ఈ సంబంధాన్ని గోప్యంగా దాచి ఉంచారు. పికాసో అప్పటికి ఓల్గా తోనే కాపురం చేస్తున్నాడు. ఎలాగైనా సరే ఈ విషయాన్ని  గుప్తంగానే ఉంచాలని శతవిధాలుగా ప్రయత్నించాడు పికాసో. అప్పటికే అతనికి మంచి పేరు ప్రతిష్ఠలు వచ్చి ఉన్నాయి. దీంతో ఈ సంబంధాన్ని మరుగు పరచటం అసాధ్యమయింది. మేరీ వాల్టర్ అతని పెయింటింగ్స్ కి మోడల్ గా పని చేస్తున్నది. పికాసో తన ఇంటి ముందే ఒక ఇల్లు అద్దెకు తీసుకుని వాల్టర్ ను అందులో ఉంచాడు. ఆ తర్వాత ఆనతి కాలంలోనే పికాసో ఒక అద్భుతమైన భవంతిలాంటి స్టూడియో నిర్మించాడు. మేరీ వాల్టర్ అందులోనే ఉండసాగింది. 1935 లో పికాసో - మేరీ వాల్టర్ లకు ఒక ఆడపిల్ల పుట్టింది. దీంతో వీరిద్దరి మధ్య సంబంధం ఓల్గాతో సహా ప్రపంచ మంతటికీ తెలిసిపోయింది. ఓల్గా ఈ వాస్తవం బయటపడిన తరువాతనే పికాసోతో సంబంధాలను తెంచుకుంది. పికాసోని పెళ్లాడాలనే కోరిక మేరీ వాల్టర్ కు బలంగా ఉండేది. ' గుయెర్నికా ' చిత్రించటానికి ముందు కనీసం ఐదు సంవత్సరాల వరకూ పికాసో పెయింటింగ్స్ లో కొట్టొచ్చినట్టు కనిపించే ముదురు రంగులూ, ప్రసన్న వదనంగల ఒక యువతి, ఆహ్లాదకరమైన స్ట్రోక్స్  కనిపిస్తాయి. అవన్నీ స్పష్టంగా మేరీ వాల్టర్ ప్రతిబింబాలే. వాళ్ళ ప్రేమ సంబంధాలు కళాఖండాలుగా రూపు దిద్దుకున్నాయి. కుమార్తె పుట్టిన రెండు సంవత్సరాల తరువాత పికాసో డోరామార్ అనే మహిళతో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం తెలిసి మేరీ వాల్టర్ హతాశురాలైంది. ఆమె తన బిడ్డతో పాటు దూరంగా వెళ్లి పోయింది. పికాసో ఆమెను పెళ్ళాడాలని ఎన్నడూ అనుకోలేదు. కానీ ఆర్ధికంగా ఆమెకు సాయం చేసేవాడు. పికాసో చనిపోయిన నాలుగు సంవత్సరాలకు నానా దుర్భరమైన పరిస్థితులను అనుభవించి చివరికి ఆత్మహత్య చేసుకుని ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది.

( సశేషం )        


2 comments:

  1. Replies
    1. divya sharad - ♥♥♥I Dream♥♥♥ Therefore I Am commented - ౩":

      Was eagerly waiting for the next episode :) Still more to go :)

      Delete