Friday 27 April 2012

పికాసో ప్రేయసులు - 2

 

 


 

పికాసో ప్రేయసులు - 2


1918 వ సంవత్సరం. రష్యన్ నర్తకి ఓల్గా కోకలోవా పికాసో జీవితంలోకి అడుగు పెట్టింది. ఓల్గా తో వివాహం 

కాకమునుపే  ఆమె సన్నిహితులలో చాలా మందితో పికాసోకు ప్రేమ సంబంధాలు ఉండేవి. రష్యాలో ఆమె చాలా 

పేరున్న నర్తకి. యూరపియన్ ఆభిజాత్య వర్గంలో ఆమెకు చాలా పలుకుబడి ఉండేది. ఉన్నతవర్గాలకు చెందిన 

చాలా మంది ప్రముఖులను పికాసోకి పరిచయం చేసింది. చిత్రకళా రంగంలో పికాసో ప్రతిభా సామర్ధ్యాలను ప్యారిస్ 

లోని ఆభిజాత్య వర్గం గుర్తించేలా చేసింది. పికాసోది బోహీమియన్ స్వభావం. ఓల్గా ది పూర్తి స్థాయి ఆభిజాత్య 

మనస్తత్వం. సహజంగానే ఇద్దరి మధ్యా పొసగలేదు. దాదాపు అదే కాలంలో పికాసోకి ప్రఖ్యాత చలనచిత్ర దర్శకుడు 

జీన్ కాక్ట్యూతో బలమయిన స్నేహసంబంధం ఏర్పడింది. ' పికాసో నిత్యం నన్ను దిగ్భ్రాంతికి గురి చేస్తుండే వాడు. 

అతడు ఎన్నో అందమయిన ఆకృతులను చిత్రించే వాడు. అనంతరం ప్రకటిత సౌందర్యం నుంచి అందవిహీనమయిన 

ఆకారాలకేసి అడుగులు వేసేవాడు. ఆ తరువాత అతడు సౌందర్యం, సారళ్యం ఉన్న ఆకారాలను, చిత్రాలను 

తిరస్కరించేవాడు' అని రాశాడు కాక్ట్యూ. ఈ క్రమంలో పికాసో ఒక సరికొత్త సౌందర్య శాస్త్రాన్నినిర్మించాడు. ప్రపంచం 

అతని చిత్రకళా ఖండాలను చూసి దిగ్భ్రాంతికి గురయింది. అయితే అతని అసమానమయిన ప్రతిభకి ఆమోదం 

మాత్రం అంత తేలిగ్గా లభించలేదు. ఓల్గాకీ, తనకీ మధ్య దెబ్బతిన్న ప్రేమ సంబంధాల ప్రభావం దీని మీద స్పష్టంగా 

పడింది. ఈ కాలంలో పికాసో రంగుల ప్రయోగం ఉగ్రరూపం ధరించింది. మానసికంగా మ్రాన్పడిన ఓల్గా చివరికి మతి 

స్థిమితం కోల్పోయింది. పదిహేడు సంవత్సరాల పాటు కలిసి కాపురం చేసి చివరికి విడిపోయారు. ఓల్గా దాదాపుగా 

పిచ్చిదయింది. అతని కోసం ఎదురు చూపులే ఆమె జీవితమయింది.పికాసోకి ఎవరయినా మహిళతో సంబంధం 

ఏర్పడినట్టు తెలిస్తే చాలు , ఆమెతో సంపర్కం లోకి వెళ్ళేది. పికాసో తో సంబంధం వదులుకోవాలని హెచ్చరించేది. 

అలా బెదిరిస్తూ, బెదిరిస్తూ ఎడ్చేసేది. బతిమాలుకునేది. ప్రాధేయపడేది.బెదిరింపుల భాష ప్రాధేయపరిభాషగా 

మారిపోయేది. నా పికాసోని నాకు ఇచ్చేయందంటూ బతిమిలాడేది. నా పికాసోని నాకు వదిలేయండని ప్రాధేయ 

పడేది. పికాసో ఆమెకు విడాకులు ఇవ్వలేదు. విడాకులు ఇస్తే సగం ఆస్తి ఆమెకు ఇవ్వాల్సి వుంటుంది. డబ్బుల 

విషయంలో పరమ పిసినారి పికాసో. 

ఓల్గా 

------------------------------------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment