Saturday 28 April 2012

ఆ గదులకు తాళాలుండవ్.....



 


 అది మా గది. నేనూ, గులాం గౌస్ ( శాతవాహన  ) ఉండేవాళ్ళం. అప్పటికి మేం చాలా చిన్నవాళ్ళం. నాకూ, గౌస్ కీ  అప్పటికి పెళ్ళిళ్ళు కూడా కాలేదు. ఉషతో అప్పటికే నాకు పరిచయం. ఆ రోజుల్లో మా ఇల్లు మహానుభావులైన తెలుగు రచయితలు, కవులకు కేంద్రంగా ఉండేది.  రాచకొండ విశ్వనాధ శాస్త్రి, కాళీపట్నం రామారావు, చాగంటి సోమయాజులు, ఇస్మాయిల్, స్మైల్, నగ్నముని, అజంతా, కాళోజీ, మహీధర, వేగుంట మోహన ప్రసాద్, పెద్దిభొట్ల సుబ్బరామయ్య  వంటి పెద్దలు వస్తుండేవాళ్ళు. 'మో', సుబ్బరామయ్య గారలు రెగ్యులర్ విజిటర్స్. చాసో ఎప్పుడు విజయవాడ వచ్చినా మా ఇంట్లోనే వుండేవారు. ఇందులో మా గొప్పతనం కించిత్తు కూడా లేదు. అది కేవలం మామీద ఆ మహనీయులకున్న వాత్సల్యం తప్ప మరొకటి కాదు. ఇందరు మహానుభావులకు సన్నిహితంగా ఉండే అవకాశం దొరకటం నిజంగా మా అదృష్టం. 'మో' గా లబ్ధ ప్రతిష్టులైన మోహన ప్రసాద్ గారిని మేం మాస్టారని పిలిచే వాళ్ళం. 'బతికిన క్షణాలు' లో చాలా భాగం మాస్టారు మా ఇంట్లోనే రాశారు. మరీ ముఖ్యంగా ఈ ఖండిక మా ఇంటి గురించీ, మా గురించీ రాసినది.  ..........ఖా . మొ.   
 

ఆ గదులకు తాళాలుండవ్.....
 'మో'

విధ్వంసమయిన బతుకుని ధ్వంస రచన చేసి బాగుచేసుకోవచ్చును. గడియారాన్ని నేలకేసి కొట్టినపుడు టైం దానంతటదే కుదుటపడ్తుంది. లక్షణాల విలక్షణత్వాన్ని అలక్ష్యం చేస్తే సామాన్యార్ధకాలు సిమిలిట్యూడ్స్ విడివడి పోతాయ్. నిర్లక్ష్య నిర్లజ్జా నిగర్వాంధకారంలో అన్ని చీకటి దారులూ కాంతిపుంజాలే.

మారుతీనగర్ పల్లంలొ పక్కనే మురుక్కాలవ. ఆ గదిలో చీపురుండదు తుడవటానికి. గులాం గౌస్, ఖాదర్ మొహియుద్దీన్ ల అతి మానసిక సంస్కారాన్ని శుభ్రం చేసుకోవాలంటే బ్రూంస్టిక్ కల్చర్ ఖరీదు ఐదు వందల రూపాయలు. తలంటోసుకోవాలంటే అప్పటికప్పుడెళ్ళి అప్పేసి తెచ్చుకోవాలి నాలుగో ఐదో కుంకుడుగాయలు. మిట్టమధ్యాహ్నమెపుడో నీళ్ళొచ్చిన తర్వాత ఎసట్లో బియ్యం వేసుకోవాలి. ఆ గదులకు తాళాలుండవ్ తలుపులుండవ్. అందుకనే పుస్తకాలుతప్ప ఎవరూ ఏమీ కొట్టెయ్యరు. పప్పెవరు బాగా ఉడికిస్తారు ఉప్పెవరు బాగా కసిం చేస్తారని పందాలు వేసుకుంటారీ పారీషియన్ పొయిట్స్. అవనత వదనంతో ఏ ఐదారింటికో ఉడుకుతుంది సూర్యుడి వొణ్ణం. ఈ అన్నం ఉడికీ ఉడకగానే వెచ్చని గోరుముద్దలు తినిపిస్తారు తులసీ ఉషాలు.అడుక్కొచ్చో కొట్టేసో రహ్మాన్ కాలుస్తాడు సిగరెట్. ఆ పొగని తీగలు లాగుతూ నేనూ రెండున్నర దమ్ములు లాగుతాను.
చలం ఇంకా జీవిస్తూన్న ఈ నేలమీదే ప్రేమల, పెళ్ళిళ్ళ సాఫల్య వైఫల్యాల భయాలు. ఆనందాన్ని భరించటం ఎంత బాధో నేను సోదాహరణాత్మకంగా నవ్వుతూ చెప్తాను. వాళ్ళందరూ ఏడవబోయి కూడ చిర్నగవులు చిందిస్తారు. క్రమీణా చీకటి రాలుతూంటుంది గదిపైన  అల్లుకున్న బూజు బురుజుల్లోంచి. ఎవరి తల వాళ్ళే అంటు కోవాలి ఎవరి నెత్తి వాళ్ళే కొట్టుకోవాలి. ఎవడిపళ్లెం మాత్రం వాడు కడగకూడదు. చేతులే అన్నపు పళ్ళాలు.

కాళ్ళ వేసిన మార్క్స్ చిత్రపటం అలమారలో అడ్డం తిరిగి పడుకొంటుంది. మార్క్స్ గడ్డం రోజురోజుకీ పెరుగుతూంటుంది. సంశయాల సాలీళ్ళను విదల్చాలంటే ఐదువొందల రూపాయిలు కావాలి. మల్లీశ్వరి సినిమా చూసొచ్చిన తర్వాత కూడ మనుషులు మౌనం పాటించరు. నవ్వనూ నవ్వరు. తుఫాను వేడికి కొట్టుకుపోతూన్న గాలిలో మధ్యాహ్నం ఒక్కటే మౌనంగా వుంటుంది.

చీకటడిన తర్వాత లైట్ లేకుండా సైకిల్ తొక్కితే దొంగలు పట్టుకొని ఎర్రని బుట్టల్లో నాలుగు రోజులు అలా ఉంచేస్తారు. స్మశానంలో సైకిల్ తొక్కుతూన్నప్పుడు కూడ లైటెందుకు? కొరివి దయ్యాలు ఎర్ర టోపీలే పెట్టుకొని ఆగాగు అంటాయ్. రాయని కవితలు నాలుగో ఐదో జేబులో పెట్టుకొని వచ్చేస్తాను రాత్రికి ఇంటికి మారుతీ నగర్ డౌన్ నుంచి.

( 'మో' బతికిన క్షణాలు నుంచి ) 






2 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. వేణు commented:

    విజయవాడ మారుతీనగర్ కాలవొడ్డున మీరున్న ఇల్లు ‘మో’ బతికిన క్షణాల రాతలకు వేదికయిందని తెలిసి ఆశ్చర్యానందాలు కలుగుతున్నాయి. కొన్నేళ్ళ తర్వాత బహుశా మీరున్న ఇంట్లోనే/ ఇంటి పరిసరాల్లోనే మేమూ (కొందరు మిత్రులం) అద్దెకున్నామని అర్థమవుతోంది. అక్కడ బతికిన క్షణాలు గుర్తొస్తున్నాయి!

    ReplyDelete