Friday 27 April 2012

జీవితం - కవిత్వం

 


 

 జీవితం - కవిత్వం 



జీవితం మీద మనకున్న అనురక్తి కవిత్వంలో మన అభివ్యక్తి శక్తి ని నిర్ణయిస్తుంది.
మనిషికీ, జీవితానికీ మధ్య వుండే ఆత్మీయతానుబందాలను అభివ్యక్తం చేసే భాషే కవిత్వం. భాష వెలుపల మన 

అనుభవ సాంద్రతే భాషలోపల అనుభూతి తీవ్రతగా రూపాంతరం చెందుతుంది. జీవితంలో మనం నిజంగా జీవించిన 

క్షణాలు మాత్రమే కవిత్వంలో నాలుగు కాలాలపాటు నిలుస్తాయి. కవి వేగుంట మోహన ప్రసాద్ ప్రత్యేకంగా తన

'బతికిన క్షణాలు' రాసు  కున్నారు. నిజానికి ఆయన కవిత్వమంతా తన బతికిన క్షణాల తలపోతలే. ఏ కవి  

విషయంలోనయినా అంతే. మనిషికీ, జీవితానికీ మధ్య సహజంగా ఉండవలసిన అనుబంధం క్రమక్రమంగా

కనుమరుగు అవుతూన్న కాలం ఇది. దిగజారుడుతనం, అవకాశవాదం వంటి అనేకానేక అవాంచనీయ అంశాలు

  సర్వత్రా  స్వైరవిహారం చేస్తూన్న సమయం ఇది. మనిషి మనుగడకు అవసరమయిన మౌలికమైన దినుసులు

ఒకటొకటిగా అంతర్ధానం అవుతూ వస్తున్నాయి. వాస్తవానికి ఇది కనిపించని ఒక భీతావహ  వాతావరణం . 

ఇటువంటి వాతావరణంలో కవిత్వం మనిషికి ఒక అచంచలమయిన నమ్మకాన్ని ఇవ్వాలి.  కొండ లాగా  అండగా 

నిలవాలి. అయితే ఒక విషయం. కవిత్వం కేవలం శరణార్ధుల శిబిరంలా కూడా మారిపోకూడదు. అది కేవలం ఒక 

అంతిమ విశ్రాంతి మందిరంలా కూడా మారిపోకూడదు. అది అనునిత్యం మన బాధ్యతల్ని గుర్తు చేస్తూ, కాలం విసిరే 

సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కునే సమర స్థలి లాగా వుండాలి కవిత్వం. 

కవిత్వం రాయటం సులభం. కానీ మంచి కవిత్వాన్ని గుర్తించటం, మంచి పాఠకుడుగా మిగలటం, కవిత్వంతో చెలిమి 

చేయటం కష్టసాధ్యమయినవి మాత్రమే కాదు, మన మౌనాన్నీ, ధ్యానాన్నీ పూర్తిగా నిరంతరం మొహరించి వుంచ 

వలసిన అంశాలు. ఏమాత్రం కష్ట పడకుండా కవిత్వం రాయటం తెలుగు కవి సహజ స్వభావం.   అవసరమయిన 

ముడి సరుకునే  నేరుగా కవిత్వంగా చెలామణీ చేయాలని చూస్తున్నారు చాలామంది మన  కవులు.  జీవితం 

మీద, కవిత్వం మీద, భాష మీద ఏ మాత్రం గౌరవం వున్నా ఇటువంటి అఘాయిత్యాలకు  పాల్పడటానికి  ఎంత 

మాత్రం సాహసించరు. కవిగా జీవించాలని కోరుకునేవాడు చేయవలసిన మొదటి పని  జీవితాన్ని మనసారా 

ప్రేమించటం. మరీ ముఖ్యంగా తెలుగు కవికి ఇది తక్షణావసరం. జీవితాన్ని  ప్రేమించలేనివాడు అసలు  

కవిత్వాన్నిగుర్తించలేడు. కవి కాకపోయినా పెద్ద నష్టం ఏమీ లేదు.  కవిత్వాన్ని  ప్రేమించకపోయినా నష్టం లేదు. 

కానీ జీవితాన్ని ప్రేమించకపోతే అంతా నష్టమే. సర్వం విధ్వంసమే. కవిత్వం పూర్తి స్థాయి ప్రమేయాన్నీ, పూర్తి స్థాయి 

తాదాత్మ్యాన్నీ , టోటల్ ఎంగేజ్ మెంట్ ని డిమాండ్ చేస్తోంది. 

నిజమయిన సృజన, ఆ మాటకొస్తే ఏ కళ అయినా సరే, కష్టతరం - సులభతరం, సరళం  - గందరగోళం, వ్యష్టి - 

సమష్టి, సామాజికోన్ముఖత - సామాజిక నిరపేక్షతల మధ్య ఎంపిక చేసుకునే అవకాశం కల్పించదు. మనకి 

నలువైపులా, ముందూ వెనకా మోహరించివున్న శక్తులతో నేరుగా తలపడటం, చిక్కు ముడులను విప్పటం వినా 

మరో మార్గం లేనే లేదు.

నిజమయిన కవిత్వాన్నీ, కవిత్వ  భాషనీ గుర్తించటానికి కూడా లోతయిన దృష్టీ, సరయిన అవగాహనా చాలా 

అవసరం. జీవితాన్ని అనంతంగా ప్రేమించేవాడికే  ఈ దృష్టి  ఉంటుంది.


1 comment:

  1. ఖాదర్ జీ, నమస్తె! కొంతమంది వ్యక్తులని జీవితంలో చూడలేం, కలవలేం అవకాశాల్లేక..ఆ అతర్వాత బాధపడుతుంటాం తాపీగ. కానీ ఈ రోజుల్లో మీలాంటివాళ్ళని కలవలేకపోయినా ఇలా ఈ అంతర్జాలంద్వారా కల్సుకోవడం నాకు సార్ధకతే.. మీ పోస్ట్స్ అన్నీ చదువుతుంటాను కానీ ఈ పోస్ట్ మాత్రం నాచేత ఈ స్పందనని రాయించింది.అందరూ మరెవరిదో కవిత్వం బావుందనో బాలేదనో చెప్తారు కానీ ఎలా రాయాలొ అతికొద్దిమంది మాత్రమే చెప్తారు...ఇదిగో ఇలా.చాలా గాఢంగా నాటుకున్న రచన ఇది.డేఫినిట్ గా కొంతమందికి ఉపయోగపడ్తుందనే అనుకుంటున్నాను.

    ReplyDelete