Tuesday 22 May 2012

' అందరూ' అంటే ఎవరు?

 

 

' అందరూ' అంటే ఎవరు?

అందరికీ బోధ పడేటట్లు వ్రాయడం అంటే ఏమిటో నాకు బోధ పడలేదు. ......' అందరూ ' అంటే ఎవరు? నేనయితే ఎందర్నో చూశాను గాని ఎక్కడా నాకు ఈ ' అందరూ ' కనబడ లేదు. అందరి కోసం వ్రాయమని అడగడం అసందర్భం. అందరి కోసం వ్రాస్తున్నాననుకోవడం ఆత్మవంచన.......అందరూ అంటే చదవడం నేర్చిన వారందరూ అనే నిర్వచనం రావచ్చును. చదవడం నేర్చిన వారందరూ చదివిన గ్రంధం ఒకటీ లేదు. ..... అందరికీ బోధ పడవలసిన అవసరంవున్న గవర్నమెంటు ఉత్తరువులే ఎవరికీ బోధ పడని భాషలో వెలువడుతూ ఉంటాయనే విషయం సుస్పష్టమే..................

....................అర్థం కావడమనేది అనేక అంతస్తులలో ఉంటుంది. ఒక్కక్కరి సంస్కార స్థాయిని బట్టి ఒకే పద్యం ఒక్కొక్క విధంగా అర్థం అవుతుంది. అందరికీ అర్థం కాగా ఇంకా ఎంతో మిగిలిపోయే అర్థం ఉంటుంది, మహాకవిత్వానికి! అంతేకాదు ; కాలం గడిచినకొద్దీ ఆ కవిత్వం కొత్తగా ఏర్పడ్డ పరిస్థితుల మీద వ్యాఖ్యానంగా సరిపోగలుగుతుంది.
.............................................................................................

అసలు గూఢత అనే మాటకి అర్థం కాకపోవటం అనే ఒక్కటే  అర్థం లేదు. ఎక్కడో ఏదో వుంది. ఎంత ప్రయత్నించినా ఎవరికీ అందదది. ఎలాగయినా దాన్ని తెలుసుకోవాలి. అంతే కాదు. ఆ తెలుసుకున్నదాన్ని అందరికీ తెలియజెయ్యాలి. అదీ జిగ్నాస. అటువంటి జిగ్నాసను ప్రదర్శించేదే గూఢ కవిత్వం. ' మిస్టిసిజం ' అనే ఇంగ్లీషు మాటకు పర్యాయ పదంగా వాడుతూన్న ఈ గూధత కేవలం అర్థం కాక పోవడంతో ఆగిపోదు. అత్యున్నత స్థాయిలో అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి; పారవశ్యం దాని ప్రాతిపదిక! తెలుసుకోశక్యం కాని దాన్ని తెలుసుకోవడానికి చేసే తపస్సు!

తెలివికీ, తెలియమికీ మధ్య స్పష్టమయిన సరిహద్దు గీత ఏమైనా ఉందా?
ఈ సరిహద్దు గీతను కనిపెట్టడానికి కావించే అన్వేషణమే గూఢ కవిత్వం....

 

శ్రీ శ్రీ

 

 

 









2 comments:

  1. " చదవడం నేర్చిన వారందరూ చదివిన గ్రంధం ఒకటీ లేదు. " ఒక్కమాట లో తేల్చేసారు, ఎంతైనా మహాకవి కదా.

    ..అర్థం కావడమనేది అనేక అంతస్తులలో ఉంటుంది
    .. తెలివికీ, తెలియమికీ మధ్య స్పష్టమయిన సరిహద్దు గీతను కనిపెట్టడానికి కావించే అన్వేషణమే గూఢ కవిత్వం....

    పైపాఠాలు బావున్నాయి.

    ReplyDelete
  2. True. మిగతా భాషల సంగతేమో గాని తెలుగులో ఆధునిక కవిత్వం, వచన కవిత్వం వచ్చాక ప్రతీ కవితా అక్షరాలు చదవడం వచ్చిన ప్రతీవారికీ అర్ధమై పోవాలి అనే అపోహ ఒకటి అటు పాఠకుల్లోనూ, ఇటు కొంతవరకూ కవుల్లోనూ కూడా కనబడుతున్నది. అలా అర్ధం కాని సందర్భాల్లో అసహనాలు, ఆవేశాలు చెలరేగడం కూడా కనబడుతోంది. అన్ని కవిత్వాలూ అందరికీ అర్ధం కావు.

    ReplyDelete