Thursday 24 May 2012

కవి - కమిస్సారు - కవి


కవి - కమిస్సారు - కవి 

అనుభవానికి ఆధారం ఆచరణ. అనుభూతికి పునాది అనుభవం. అనుభవం భాషలో అభివ్యక్తం అయినపుడు అది 
అనుభూతిగా   రూపాంతరం చెందుతుంది. అంటే  భాష వెలుపలి అనుభవం లేదా ఆచరణ భాష లోపలి అనుభూతి అవుతుంది. ఆచరణ, అనుభూతుల సృజనాత్మక సమ్మేళనమే సాహిత్యం లేదా కవిత్వం. అనుభూతి తీవ్రత కవిత్వాన్ని సాంద్ర తరం చేస్తుంది. ఆచరణలోని నిజాయితీ కవిత్వాన్ని సార్ధకం చేస్తుంది. అల్పమయిన జీవితం నుంచి అత్యున్నత మైన కవిత్వం పుట్టదు  గాక పుట్టదు. 

కానీ చాలా మంది తెలుగు కవులు వాళ్ళ కవిత్వం కన్నా చాలా చాలా చిన్నవాళ్ళు.  అందుకే, కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది వాళ్ళ కవిత్వం. సాధన వీళ్ళ ఏకైక సాధనం. పాఠకీయ    సౌఖ్యమే ఈ కవిత్వానికి పరమావధి.  వివి గా సుపరిచుతుడయిన వరవరరావు ఇందుకు ఒక మినహాయింపు. వివి వ్యక్తిత్వం, జీవితం ఆయన కవిత్వంతో పోలిక లేనంత పెద్దది, లోతైనది, విశాలమైనది. దానిముందు ఆయన కవిత్వం చాలా చాలా చిన్నది. అందుకే కవి కన్నా వివి అనే పదానికి ( లేదా పేరుకి ) విలువ ఎక్కువ. సాధన కాదు, జీవించటమనే జటిలమైన ప్రక్రియనుంచి విడదీయటానికి వీల్లేని అంశం వివి కవిత్వం.
ప్రధానంగా వివిది పాఠకీయ సౌఖ్యానికి ప్రతికూలమయిన  కవిత్వం.

వ్యక్తికీ, సమాజానికీ మధ్య ఘర్షణ కి మూలం వ్యక్తులకీ, రాజ్యానికీ మధ్య వుండే ఘర్షణలో ఉంటుందని విశ్వసిస్తుంది
 మార్క్సిజం. అత్యంత శాస్త్రీయమైన ఈ అవగాహనతో పాబ్లో నెరూడా, నాజిమ్ హిక్మత్ లు అంతర్జాతీయంగా కవిత్వ ప్రపంచానికి కొత్త అర్దాలనీ, అందాలనీ, విదులనీ, విధానాల్నీ అందించారు. తెలుగు కవిత్వంలో ఈ కర్తవ్యాన్ని అత్యంత శక్తివంతంగా నిర్వర్తించిన వాళ్ళు శివసాగర్, వివిలు.
 వివి కవిత్వానికి ప్రాతినిధ్యం వహించే ఈ కవితా సంకలనాల సంపుటం ఏకకాలంలో వివి మానసిక ప్రపంచాన్ని ఆవిష్కరించే ఒక ల్యాండ్ స్కేప్, ఒక సీ స్కేప్, ఒక మౌంటయిన్ స్కేప్, ఒక స్కై స్కేప్.

సాంస్కృతిక రంగం వివి ప్రధాన కార్యక్షేత్రం అయినప్పటికీ అసలు చోదకశక్తి అయిన రాజకీయోద్యమంతో బలమయినది ఆయన అనుబంధం. సాంస్కృతిక ఉద్యమం ప్రతినిధిగా రాజకీయ ఉద్యమంతోనూ, రాఈకీయ ఉద్యమ ప్రతినిధిగా  తన సాస్కృతికోద్యమ సహచరులతోనూ అనివార్యమయిన అంతస్సంఘర్షణల తాలూకు ఆనవాళ్ళు  ఈ బృహత్ సంకలనంలో స్పష్టంగా సాక్షాత్కరిస్తాయి. ఈ కవితలు స్థూలంగా రెండు రకాలు. ప్రత్యక్షంగా రాజ్యంతో వివాదానికి తలపడేవి కొన్ని. స్వగతంతోనూ, సమాజంతోనూ సంవాదదం జరిపేవి మరి కొన్ని. తనతోనూ, తన చుట్టూ వున్న ప్రపంచంతోనూ తాను జరిపిన వాద, వివాద, సంవాదాల సారాంశమే వివి కవిత్వం.

వస్తువుల్ని వాటి అసలయిన పేర్లతో పిలిచే నైతిక సాహసం వివి కవిత్వంలోనూ, జీవితంలోనూ కొట్టొచ్చినట్టు కనిపించే అసాధారణమైన లక్షణం. వివి కవితలు దుర్లభమైన దుర్భిణీలు. తీవ్ర నిర్బంధాలను సయితం ప్రతిఘటించి నిర్భయంగా పలికిన నిజాలు. అబద్ధాలకు తప్ప అభివ్యక్తికి ఆస్కారం లేనపుడు అతిచిన్న నిజం కూడా అణు విస్ఫోటనాన్ని సృష్టిస్తుంది. వివి కవిత్వంలో వున్నది పచ్చి నిజాలకు వుండే విస్ఫోటనా శక్తి. వెంకట చలంగారి భాషలో చెప్పాలంటే అది  ' సూనృత శక్తి .

సంకెళ్ళను ఛేదించటం నేర్పిన మార్క్సిజం చాలా మందికిలా వివి ఆలోచనలకు ఎన్నడూ సంకెళ్ళుగా మారలేదు. ఆర్ధిక సిద్ధాంతాలు గాక మార్క్సిజంలోని మానవతావాదానికీ సూఫీతత్వానికీ ఎంతో సారూప్యం ఉంది. అందుకే ఆయన సూఫీతత్వంలో మార్క్సిజం మూలాలను చూడగలిగాడు. సమాజంలో జరిగే ప్రతీ కీలకమైన సంఘటన పట్లా భావోద్వేగాలకు లోనుగావటం చాలా మందిలో జరుగుతుంది. ఆ భావోద్వేగాలను తిరిగి ఉద్యమంగా మలచటం మాత్రం వివి వంటి వాళ్ళకే సాధ్యమవుతుంది. అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలే ఈ సంకలనం లోని అనేక కవితలు. ఈ ఉద్వేగాలు పునాదులుగా ఉనికిలోకి వచ్చిన ఉద్యమాలను సామాజిక చరిత్ర తిరిగిన వివిధ మలుపులలో మనం గమనించవచ్చు.

పిల్లలకీ, తనకీ తప్ప ప్రపంచానికి తెలియని పార్శ్వాలు కొన్ని వివి లో ఉన్నాయని రాశారు హేమలత. ఇది అర్ధ సత్యం. ప్రపంచంతోపాటు హేమలతగారికీ, పిల్లలకీ కూడా తెలియని పార్శ్వాలు సయితం వివిలో వుంటాయి.

శ్రీశ్రీ అభిమాన కవుల్లో ఒకడయిన లూయీ ఆరగా ఒకసారి ఈ నేలమీద సజీవంగా వున్న కవుల్లో యానిస్ రిట్జాస్ ని మించినవాడు మరొకడు లేడని ప్రశంసించాడు. ( మహాకవి శ్రీశ్రీలాగే గ్రీకు విప్లవకవి రిట్జాస్ ది కూడా ఇది శతజయంతి సంవత్సరం ). లూయీ ఆరగా ప్రశంస తెలుగు నేలమీది కవుల్లో ఒక్క వివికి మాత్రమే నూటికి నూరుపాళ్ళూ నప్పుతుంది.

విరసం తన శాశ్వత చిరునామా అని ప్రకటించాడు శ్రీశ్రీ. ఇది వాస్తవం కాదు, అతిశయోక్తి. చిరునామాగా మాత్రమే కాదు, విరసమే తన సర్వస్వంగా జీవించిన వ్యక్తి వివి. ఇది అతిశయోక్తి కాదు, పచ్చి నిజం. నిజానికి విరసానికి వివి ఒక శాశ్వత చిరునామా. ఇది అవాస్తవం కాదు, ఒక చిన్న అతిశయోక్తి.

కవిత్వం ఎక్కణ్ణించి మొదలవుతుందో, కవిత్వం ఎక్కడిదాకా వచ్చి ఆగిపోతుందో స్పష్టంగా తెలిసిన కవి వివి. కవిత్వం ఆగిపోయిన చోటినుంచి ఆయన కమిస్సారుగా ప్రారంభమవుతాడు. కవినుంచి కమిస్సారుగా, కమిస్సారునుంచి తిరిగి కవిగా జరిగిన చైతన్యపూరితమయిన పరిభ్రమణమే వివి జీవితం. వివి జీవితానుభవాలకు సృజనాత్మక సంస్కరణలే ఈ సంకలనంలోని కవిత్వాలు.





  
         

2 comments:

  1. వివి సార్ను పరిచయం చేసుకోవడానికి యింతకంటే మరొక తార్కాణం ఏముంది. ఆయన వ్యక్తిత్వాన్ని కవిత్వాన్ని నేలపై ఆనిన పాదాలతోనే ఆకాశాన్నంటేలా పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు సార్..

    ReplyDelete
  2. వివి సార్ను పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు ..

    ReplyDelete