Wednesday 23 May 2012

కవి ఒక దురదృష్ట జీవి!

 



కవి ఒక దురదృష్ట జీవి!

విజయ్ దేవ్ నారాయణ్ సాహీ

( విజయ్ దేవ్ నారాయణ్ సాహీ హిందీ కవి, ప్రముఖ విమర్శకుడు, మేధావి, ఆలోచనాశీలి. మార్క్సిస్టు మేధావిగా ప్రారంభమయి లిబరలిజం దిశగా ప్రయాణం సాగించారు. క్రియాశీల రాజకీయాలలో పని చేశారు. అనేక పర్యాయాలు జైలు జీవితం గడిపారు. అనేక పత్రికలకు సంపాదకుడుగా పని చేశారు. విస్మరించటానికి వీల్లేని సాహితీ వ్యక్తిత్వం సాహీది. మహాకవి అగ్నేయ్ సంపాదకత్వంలో వెలువడిన కవితా సప్తకాల్లో ' తీస్రా సప్తక్ ' నుంచి తీసుకున్న వక్తవ్యం ఇది.


విశ్వాసం  నా కవిత్వానికి మూలాధారం.
ఈ విశ్వాసం ఇరవై ఇదు గుణాల సమాహారం.

1

నేను వివేకం కలిగివున్న మనిషిని. నాలాగే వివేకం కలిగివున్న మనుషులు ఇంకా కొంతమంది ఉంటారు. నాలాగా  కానీ, నాలాంటి ఇంకా కొందరి లాగా కానీ వుండని వాళ్ళు ఇంకా చాలా మంది వుంటారు. ఈ వాస్తవాన్ని దాచటం వల్ల  వచ్చే లాభం ఏమీ లేదు. దాచకపోవటం  వల్ల వచ్చే నష్టమూ వుండదు. అయితే దాచటంవల్ల నష్టం ఉంది. అంతేకాదు. దాచకపోవటంవల్ల లాభం కూడా వుంది.

2

పూర్తి స్థాయిలో నేను ఒక స్వతంత్ర జీవిని. నన్ను శాసించేవారు ఎవరూ లేరు. అంటే నేను చేసే ప్రతీ పనికీ పూర్తిగా నేనే బాధ్యుణ్ణి. అంటే నేను నైతికంగా వుండటం అనేది సాధ్యం.

3

ఈ సమస్త విశ్వంలోకెల్లా నేను ఒక విలువయిన ప్రాణిని. అలాకాని పక్షంలో ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు. ఇది మీ విషయంలోనయినా అంతే.

4

నిరంతరం ఆచితూచినట్లు  వ్యవహరించకపోవటం నిజాయితీపరులు, వివేకవంతులు అయిన మనుషుల లక్షణం. సమాజంలోని ప్రతి ఒక్కరూ కాకపోయినా కనీసం కొందరయినా ఇలా వుండటం చాలా  అవసరం. నిరంతరం ఆచితూచి వ్యవహరించనివాళ్ళు ఏ ఒక్కరూ లేని సమాజం స్థితి  అనివార్యంగా అధఃపాతాళమే. 

5

నన్ను నేను ఎక్కువగా పట్టించుకోను. అది నా  పని కాదు. అది మీ కర్తవ్యం. దీనికి ప్రతిలోమం కూడా సత్యమే. అనుమానం లేదు.

6

వ్యక్తికి హక్కులు తప్ప బాధ్యతలు లేని సమాజమే అత్యున్నతమయిన సమాజం. నేను కోరుకున్న ప్రతిదీ నాకు అందితీరాలి. నేను ఇవ్వదలచుకోనిది ఏదీ ఇవ్వవలసిన అవసరం నాకు వుండకూడదు. 

7


కవితారంగంలో కేవలం ఒకే ఒక ఆర్య సత్యం ఉంది. అది దుఃఖం. మిగిలిన మూడూ రాజకీయ రంగం పరిధిలోకి వస్తాయి. 

8

కవిత్వం రాజకీయాల్లోకి చొరబడకూడదు. దీనివలన కవిత్వానికి జరిగే నష్టం ఏమీ లేకపోయినా రాజకీఅయాలకు హాని జరిగే ప్రమాదం వుంది.

9

షెల్లీ గొప్ప  విప్లవ కవి.  అందుకే నేను షెల్లీని నేను ఎంతో ఇష్టపడతాను. కానీ ఆయన నాయకత్వంలో విప్లవకారునిగా మారాలని మాత్రం పొరపాటున కూడా ఆశించను. తులసీదాసు గొప్ప భక్తికవి. ఆయన పార్లమెంటు సీటుకు గనక పోటీ చేస్తే నేను పొరపాటునకూడా  ఆయనకు ఓటు వేయనుగాక వేయను. నీషే  Thus spake zarathustra సామాజిక వాస్తవికత దృష్ట్యా తగలబెట్టదగిన పుస్తకం. కానీ కవిత్వం దృష్టితో చూసినపుడు మహోన్నతమయిన కృతులలో అది కూడా ఒకటి. దాని కాపీ ఒకటి  నిరంతరం నాతోపాటు వుంచుకుంటాను. మీకూ ఇది నేను సిఫారసు చేస్తాను.
 
10

కవి ఎన్నుకోబడని శాసనసభ్యుడయితే కావచ్చు. కానీ ఎన్నుకోబడని మంత్రి అయితే మాత్రం కవికి మేలూ, జనానికి కీడూ జరిగే అవకాశం ఉంది. ఈ  రెండూ అవాంఛనీయమయినవే.

11

కవిత్వం వల్ల సమాజం  ఉద్ధరింప బడదు. నిజంగా మీరు సమాజాన్ని ఉద్ధరించాలని అనుకుంటే దేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టండి లేదా వేరే ఎవరినయినా ప్రధానమంత్రిని చేసే పనిలో పూర్తిగా నిమగ్నం కండి.

12

సమాజంలో ఒక పౌరుడుగా వుండి ఇలా ఎందుకు రాస్తున్నావు, అలా ఎందుకు రాయటం లేదు అని ఎవరయినా విమర్శకుడు నన్ను అడగటానికి ముందే సమాజంలో కవిత్వం రాయటం కూడా ఎలా నా కర్తవ్యం అవుతుందో ముందు నిరూపించ మంటాను.

13

ఎవరయినాసరే ఒక కవి అకవులకన్నా సంవేదనాశీలీ, అనుభూతిశీలీ కాజాలడు. కవులు ఎవరయినా దీనికి భిన్నంగా చెప్పినా నమ్మకండి. అకవుల కంటె తాము అధికులమని చాటుకోవడానికి కవులు అలా చెప్పుకుంటారు. అకవి కన్నా కవి సంవేదనా క్షేత్రం పరిమితమయినది కావటం ఎంతమాత్రం అసంభవం కాదు. అంతే కాదు. వాస్తవానికి అలానే ఉంటుంది కూడాను.

14

నా అనుభవం లోకి వచ్చినదంతా నా కవితా వస్తువు కాజాలదు. ఇప్పటివరకూ నా అనుభవ ప్రణాళికలో లేనిదే నా కవితా వస్తువు అవుతుంది. ప్రతీ కళాకృతీ ఒక ప్రత్యేకమయిన , బలమయిన అనుభూతి నుంచే అవతరిస్తుంది. అనుభూతికి సంబంధించిన సాధారణాంశాలకు సరికొత్త పరిభాషను అందించటం దాని ప్రధాన లక్ష్యం. నిర్దిష్టతకీ, సాధారణతకీ మధ్య సామంజస్యానికి మరో పేరే పరిభాష. సామంజస్యం వినా అనుభవ సామర్ధ్యం అసంభవం.

15

తన ప్రత్యేకమయిన అనుభూతికీ, అంతవరకూ అందుబాటులో వున్న సాధారణ పరిభాషకీ మధ్య అసమంజసతని అకవి గమనించలేడు. ఒక్కోసారి గమనించినా కొద్దిసేపు అశాంతికి గురి అవుతాడు. ఆ తరువాత అనుభూతిని బలవంతంగా  అనుభూతిని పరిభాషగా పరివర్తించేలా చేస్తాడు. అది కేవలం అకవి అదృష్టం.

16

కవి ఒక దురదృష్ట జీవి. నిర్దిష్టమయిన అనుభూతిని మార్చటం అనేది అతనికి అసాధ్యం. పరిభాషను సమూలంగా పరిమార్చేవరకూ కవి అశాంతితో అలమటించి పోతాడు. అసమంజసతను గుర్తించే కర్తవ్యాన్ని బుద్ధి నిర్వర్తిస్తుంది. కల్పనా శక్తి పరిభాషను మార్చేస్తుంది. పదాల అభివ్యక్తి అభ్యాసం ద్వారా సాధ్యం అవుతుంది. ఇది కేవలం ఒక నిమిషం కాలంలో జరగవచ్చు. లేదా ఒక యుగం పట్టవచ్చు. అది ఆయా కవులపై ఆధారపడి  వుంటుంది. 

17

కవి అమరత్వం అనేది పూర్తిగా భ్రమలతో ముడిపడి  వున్న వ్యవహారం. అపార్ధాలకు ఆస్కారం కలిగించే శక్తి సామర్ధ్యాలు ఎంత ఎక్కువగా వుంటే ఆ కవి అంత ఎక్కువ కాలం అమరుడుగా  కొనసాగుతాడు.

18

సార్ధకత తప్పనిసరిగా తపం అయితీరాలని లేదు.శబ్దాడంబరం మాత్రం నూటికి నూరు పాళ్ళూ పాపమే.

19

మా తాతగారు చెప్పింది మా నాన్న చెప్పరు. అలాగే  నేనూ చెప్పను. ఇది వాస్తవ స్థితి. మా నాన్న నాతో తన తండ్రి చెప్పింది చెప్పటం సంప్రదాయం. నేనే స్వయంగా మా నాన్న చెప్పింది చెప్పటం ప్రయోగం. నేను ఏదీ చెప్పకపోతే సంప్రదాయమూ లేదు, ప్రయోగమూ లేదు.

20

పాశ్చాత్య ప్రపంచం నుంచి విముక్తి అనేది అసాధ్యంలా  వుంది. ఆధ్యాత్మికత వినా ముక్తి పూజ్యం. ఈ మాట పాశ్చాత్య ప్రపంచమే చెప్పింది. ఇది చద్ది మాట. ఆధ్యాత్మికతా, భౌతికవాదాల మధ్య సమన్వయం ఉండాలి. ఈ మాట కూడా పాశ్చాత్య ప్రపంచమే చెప్పింది. ఇది కూడా చద్ది మాటే. కేవలం భౌతికవాదంలోనే ముక్తి దాగివుంది. ఇదీ పాశ్చాత్య ప్రపంచమే చెప్పింది. అయితే ఇది కొత్త మాట.

21

కవిత్వం అంటే అనురక్తి. అనురక్తి అంటే మాయ. మాయకీ, ఆధ్యాత్మికతకీ మధ్య అసలు పొసగదు. కాబట్టి ఆధ్యాత్మిక కవిత్వం అసంభవం. ద్వైదీభావంతోవున్న వారికి ఇందులో మాయా దొరకదు, దైవమూ దక్కదు. భావకవుల విషయంలో జరిగింది ఇదే. దీన్నుంచి గుణపాఠం నేర్చుకోవటం చాలా అవసరం.

22

నా కన్నా ముందు తరం వాళ్ళల్లో వివేకం కలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు మూగవాళ్ళు. వాచాలురు వున్నారుగానీ వాళ్ళు పూర్తిగా అవివేకులు. ఆంగ్లభాష మనిషికి వివేకాన్నయితే ఇచ్చిందికానీ మూగవాణ్ణి చేసి వదిలేసింది. గాంధీజీ గొంతుకనయితే ఇచ్చారుగానీ ఆలోచనా శక్తిని కట్టడి చేశారు. చాలా కోపం వస్తుంది. కానీ ఇది కేవలం నా దౌర్భాగ్యం.

23

స్వఛ్చందంగా శరణాగతులుగా మారి ' మా శుచః ' పాఠాన్ని జపిస్తూ, ఆలోచించే పనిని మాత్రం జాతి యావత్తూ ఒకే ఒక వ్యక్తికి ఎందుకు వదిలేసింది? ఆ వ్యక్తి ఈ శరణాగతులకు ' అటెన్షన్ ' , ' స్టాండ్  ఇటీజ్ ' ల గురించి నిర్దేశించారుగానీ ' అటెన్షన్ ' అని ఎప్పుడు అనాలీ, ' స్టాండ్ ఇటీజ్ ' ఎప్పుడు చెప్పాలీ అనే వివేకాన్ని అందించలేదు. మన ఆకాంక్షనీ, విరాత్ తత్వాన్నీ, వివేకాన్నీ ఎదుగూ బొదుగూ లేకుండా అలాగే వదిలి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు చెప్పే ' కాషన్ ' తో పెరేడ్ అయితే జరుగుతుంది గానీ యుద్ధం గెలవటం మాత్రం అసాధ్యం.

24

వయస్సు యాభయికి పైబడటం దానంతటికదే వివేకానికి ప్రమాణం కాజాలదు.ప్రమాణ పత్రం నేను జారీ చేస్తాను.

25

అవఙా పరమో ధర్మః ! 







  

3 comments:

  1. మా తాతగారు చెప్పింది మా నాన్న చెప్పరు. అలాగే నేనూ చెప్పను. ఇది వాస్తవ స్థితి. మా నాన్న నాతో తన తండ్రి చెప్పింది చెప్పటం సంప్రదాయం. నేనే స్వయంగా మా నాన్న చెప్పింది చెప్పటం ప్రయోగం. నేను ఏదీ చెప్పకపోతే సంప్రదాయమూ లేదు, ప్రయోగమూ లేదు.

    Love those lines :)

    ReplyDelete
  2. కవికి సంబంధించిన వ్యక్తీకరణలు బావున్నాయి.

    అవఙా పరమో ధర్మః - అర్థం తెలిస్తే బావుండేది.

    ReplyDelete
  3. ఆహా! చాలా బాగున్నాయి! ఆలోచింపచేసేవి, హత్తుకునేవిగా ఉన్నాయి.

    ReplyDelete