Friday 14 December 2012




వెలుగు నీడల 'ముసురు':పెద్ది భొట్ల కథ

 ఖాదర్ మొహియుద్దీన్


 బాధకవిత్వానికి పర్యాయ పదం అన్నాడు శ్రీశ్రీ. కవిత్వానికే కాదు కథలకు కూడా అదే పర్యాయపదం. పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథల విషయంలో ఇది మరింత నిజం. జీవితంలోని వివిధ కోణాల్లో దాగివుండే దారుణమైన విషాదాలు సుబ్బరామయ్య కథానికలకు ముడి పదార్థాలు.

దాదాపు అయిదారు దశాబ్దాలుగా రచనా రంగంలో కృషి చేస్తున్న సుబ్బరామయ్య ఒక పసిపిల్లవాడి కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూశారు. వైరుధ్యాల మధ్య సామంజస్యాన్ని ఒక జిజ్ఞాసిగా పరిశీలించారు. స్వాతంత్య్రానంతర కాలంలో తెలుగు జీవితంలో ఏర్పడిన వివిధ వైపరీత్యాలను అర్థం చేసుకున్నారు. ఫ్యూడలిజం నశించి దాని అవశేషాల నుండి పెట్టుబడిదారీ సమాజం ఆవిర్భవిస్తూన్న సందర్భంలో ఏర్పడుతూన్న పరిణామాలను ప్రతిభావంతంగా చిత్రించారు. ఈ చారిత్రక పరిణామం ఆస్తిపరులలోనే కాదు అల్పజీవుల బతుకుల్లో తెచ్చిన మార్పుని సైతం గుర్తించారు. సామాజిక జీవితంలో ఏర్పడిన ఖాళీలను సృజనాత్మకంగా పూరించే ప్రయత్నం చేశారు. ఈ యాభైయేళ్ళ కాలంలో ఆయన తనదైన ఒక బలమైన పాఠక లోకాన్ని సృష్టించుకున్నారు. రచయితగా సుదీర్ఘమైన చరిత్ర కలిగిన సుబ్బరామయ్య కథలను పరామర్శించటానికి ముందు ఆయన రచనల గురించి పలువురు కవులు, రచయితలు, ఆలోచనాపరులు ప్రతిస్పందించిన తీరును పరిశీలించటం సముచితం.

జీవన బీభత్సాన్ని అసాధారణంగా చిత్రించిన కథాశిల్పి అని దశాబ్దాల క్రితం ప్రశంసించారు పురాణం సుబ్రహ్మణ్యశర్మ.
జీవితంలోని విషాదాన్ని తప్ప ఉత్సవ వైభవం కేసి కన్నెత్తి చూడని కథారచయిత సుబ్బరామయ్య అన్నారు భమిడిపాటి జగన్నాథరావు.
దుఃఖార్తులు, శ్రమార్తులు, శోకార్తులు, అనాధలు, అభాగ్యుల సామూహిక విషాద గానానికి బాణీలు కట్టిన సంగీత దర్శకుడు.. లోకంలో చరిత్ర హీనుల పదయాత్రకు ప్లకార్డులు రాసి పెడుతూన్న పేవ్‌మెంట్ చిత్రకారుడు.. గోర్కీ లోయర్ డెప్త్స్‌లో లూకా లాగా తన వేదాంత ప్రవచనాలతో ఈ బీభత్స లోకానికి శాంతిని ప్రసాదిస్తున్న రష్యన్ పౌరుడి రెండవ శరీరధారి.. అంతఃకరణే ధనుస్సుగా, దాని విన్యాసమే అభివ్యక్తీకరణగా కథలల్లిన మహా కథకుడు అన్నారు మునిపల్లె రాజు. దళిత బ్రాహ్మణుల చరిత్రకారుడు.. ఇది వేగుంట మోహనప్రసాద్ వ్యాఖ్య. బాల్యం పారేసుకున్న భవభూతి భ్రాత.. అని అభివర్ణించారు కప్పగంతుల మల్లిఖార్జునరావు. విమర్శనాత్మక వాస్తవికవాది.. కథానికా సాహిత్యంలో ఒక ప్రత్యేకమైన ముద్ర.. సాధారణంగా ఎవరూ గమనించని విభిన్న జీవన పార్శ్వాలను ఒక అనుకంపతో ఆవిష్కరించిన కథా సృజనకారుడు అన్నారు కేతు విశ్వనాథరెడ్డి.

తెలుగు కథా సాహిత్యంలో అక్షరాల ఆజానుబాహుడు.. గొగోల్ 'డెడ్ సోల్స్'లో హీరో.. పాన్ ద్రవిడియన్ కథలు రాసినవాడు.. తెలుగు బతుక్కి తెలియని ఒక పార్శ్వానికి తెర ఎత్తినవాడు.. ఇది ఉపేంద్ర వర్ణన. నిరాడంబర దీపధారి.. కొండంత వెలుగునిచ్చే కథా దీపాలను వెలిగించినాడు.. ఇది విహారి ప్రశంస.
ఏడుపుగొట్టు కథలు అని విమర్శించినవారూ లేకపోలేదు.
వాస్తవానికి ఇవన్నీ పాక్షిక సత్యాలే. అయితే ఈ స్పందనలన్నింటినీ ఒకచోటికి చేర్చినప్పుడు, ఆ పాక్షిక దృశ్య శకలాల్లోంచి లీలగానైనా సరే పెద్దిభొట్ల సాహితీ మూర్తిత్వం మనముందు సాక్షాత్కరిస్తోంది.
స్వాతంత్య్రానికి పూర్వం ఈనాటి ప్రకాశం జిల్లాలో పుట్టిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య కర్మక్షేత్రం, కార్యరంగం రెండూ విజయవాడ నగరమే. మృత్యువు ఆయన కథలో తరచుగా తారసిల్లుతుందనటం వాస్తవమే. అయితే అది మాత్రమే పూర్తి వాస్తవం కాదు. మృత్యువును అధిగమించటం కోసం నిర్భాగ్యులు, నిస్సహాయులు నిరంతరం చేసే ఆరాట పోరాటాలు పెద్దిభొట్ల కథల్లో పుష్కలం. అంతులేని అననుకూలతల మధ్య, క్షణ క్షణ బీభత్సాల మధ్య, నిరాశా నిస్పృహల మధ్య, దైన్యాలు హైన్యాల మధ్య, ఘోరాల మధ్య కూడా ఎంతో అలవోకగా ఒదిగిపోయి జీవించటానికి అలవాటు పడిన మనుషులకు ఈ కథలు శాశ్వత స్థావరం. పాఠకులను విషాదంలో ముంచెత్తటం ఈ కథల అంతిమ లక్ష్యం కాదు. విషాదాలను అధిగమింపజేసేందుకు ప్రేరేపించటం వీటి వెనుక దాగివున్న ఆదర్శం. సనాతన వృత్తులు, సంప్రదాయాల తాలూకు విషాదాన్ని చిత్రించటంలో కూడా వాటిని అధిగమింపజేసే ప్రయత్నమే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

సుబ్బరామయ్య కథానికల్ని లిరిక్స్‌తో పోల్చవచ్చు. ఇవి కేవలం కథలు మాత్రమే కాదు, కావ్యాలు కూడా. రూపంలో ఇవి కథానికలు. సారంలో కావ్య ఖండికలు. ఇది మనతో మాట్లాడే వచనం. మౌఖిక, లిఖిత సంప్రదాయాల సృజనాత్మక సమ్మేళనం. సుబ్బరామయ్య మాటల మంత్రగాడు. అనూహ్యంగా ఒక్క ఉదుటున లక్ష్యాన్ని ఛేదించేందుకు చేసే దాడుల్లాంటివి సుబ్బరామయ్య కథలు. కథానికా రచనలో ఆయనది గెరిల్లా యుద్ధ నీతి. వారి కథా సంవిధానం దాదాపుగా బుల్ ఫైటింగ్‌తో సరిసమానం. అల్పజీవుల ఆత్మల కదలికల్ని వీక్షించే నిఘానేత్రం సుబ్బరామయ్య కథాక్షేత్రం.

ఏదో ఒక సంఘటనో, ఏదో ఒక వస్తువో రచయిత అంతరంగాన్ని స్పృశించి, ఉర్రూతలూపి, ఆవహించి, సొంత అనుభవంగా మారిపోయి, తనదైన ప్రత్యేకమైన భాషలో లిరిక్‌లా అభివ్యక్తిని అందుకోవటం సుబ్బరామయ్య కథల్లో కొట్టొచ్చినట్లు కనిపించే విశేషం. అక్షరాలు, పదాలు, వాక్యాలు పరస్పరం పెనవేసుకుపోతాయి. లయ చెడకుండా, స్వరం తప్పకుండా, అపశ్రుతి దొర్లకుండా ఒకే బొంది, ఒకే ప్రాణం, ఒకే గొంతు అన్నట్లుగా ప్రతిధ్వనిస్తాయి. ఇవన్నీ నూటికి నూరుపాళ్ళూ లిరిక్ లక్షణాలే. ఘనీభవించిన అసంతృప్తి సుబ్బరామయ్య ప్రధాన ఇతివృత్తం.

మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మనుషులు, నిరుపేదలు, అల్పజీవులు సుబ్బరామయ్య పాత్రలు. సేతురామన్, పంకజవల్లి, సింగారవేలు, పెరియనాయకి, సావిత్రి, వరాలు, కొళందవేలు, తిరుపతి, కుమారస్వామి వంటివి ఆయన సృష్టించిన పాత్రల పేర్లు. కేవలం మనుషులు మాత్రమే కాదు వివిధ రూపాల్లో కనిపించే ఎండలు, వానలు, మబ్బులు, కలలు కూడా సుబ్బరామయ్య కథల్లో రక్తి కట్టించటంలో ప్రధాన పాత్రలే. ఒక విషాద బీభత్స వాతావరణాన్ని సృష్టించటంలో వీటి పాత్ర ఎంతో కీలకం. సుబ్బరామయ్య కథలు పాఠకులకు జ్ఞానబోధ చేయవు. ఆయన కథలకు కేవలం అనుభవాలతోనే సంబంధం. అనుభవాలకు ప్రతిరూపాలు ఆయన పాత్రలు. పాత్రల ద్వారా ఆయన తన అనుభవాలను ఆవిష్కరిస్తారు. ఆయన ప్రతీ అనుభవం వెనుకా ఒక ప్రపంచం దాగి ఉంటుంది. ఒక సృజనశీలిగా సుబ్బరామయ్యకి ప్రపంచంతో కాదు కేవలం తన అనుభవంతోనే ప్రమేయం. ఆయన తన అనుభవాన్ని పాత్రలు, ప్రతిమలు, ప్రతీకలద్వారా చిత్రించి, అనుభవం వెనుక దాగిఉన్న ప్రపంచాన్ని తిరిగి అదే ప్రపంచంగా కాకుండా అప్పటి వరకు మనం చూడని మరో ప్రపంచంగా చూపించి మనల్ని చకితుల్ని చేస్తారు. సాధారణంగా కథా రచయితలు తమ అనుభవాలను సాధారణీకరిస్తారు. కానీ సుబ్బరామయ్య వాటిని విశేషీకరిస్తారు.

సుబ్బరామయ్య తన కథానికల ద్వారా తెలుగు పాఠకుల ముందు ఆవిష్కరించిన ప్రపంచాలు అసంఖ్యాకం. కోదండం గారి కల, లేచిన వేళ, చింపిరి కథల ద్వారా ఆయన ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని ఆవిష్కరించారు. అది రైల్వే కంపార్టుమెంటుల్ని శుభ్రం చేసి అడుక్కుతిని బతికే అనాథ పిల్లల ప్రపంచం. వాళ్ళు నలుగురు. ముగ్గురు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. కోటిగాడు, నిప్పుకోడిగాడు, చింపిరి మగపిల్లలు. ఆడపిల్ల పేరు బుజ్జమ్మ. ఇది ఒక గ్రూపు. రైల్వే స్టేషనే వాళ్ళ ప్రపంచం. ఈ పై మూడు కథలు ఈ పాత్రల చుట్టే తిరుగుతాయి.

'కోదండం గారి కల' మనస్సును స్పర్శించే ఒక మంచి కథ. కోదండం గారు రైల్వే స్కూల్లో డ్రిల్లు మాస్టారు. ఓ రోజు ఈ నలుగురు పిల్లల గ్రూపుకు పోటీగా మరో గ్రూపు దిగుతుంది. రెండు గ్రూపుల మధ్య కొట్లాట వస్తుంది. వివాదానికి నిప్పుకోడిగాడు ఓ పరిష్కార మార్గం చూపిస్తాడు. ఒక్కొక్క గ్రూపులోంచి ఒకడ్ని ఎంపిక చేయాలి. వాళ్ళిద్దరు ద్వంద్వ యుద్ధం చేయాలి. ఓడిన గ్రూపు శాశ్వతంగా అక్కడినుంచి వెళ్ళిపోవాలి. ఇదీ ఒప్పందం. మల్లయుద్ధం మొదలవుతుంది. ఈ తతంగాన్ని ఒక పోలీసు గమనిస్తుంటాడు. పట్టుకోబోయేంతలో చాలామంది పారిపోతారు. మల్లయోధులు మాత్రం దొరికిపోతారు. దొరికిపోయిన ఇద్దరిలో నిప్పుకోడిగాడు ఒకడు.

పాసుకెళ్ళొస్తానని పోలీసుని నమ్మిస్తాడు. ఫెన్సింగ్ పక్కనే ఉన్న పొడవాటి పాత ఇనుప గొట్టం తీసుకొని అయిదారు అడుగులు వెనక్కి వచ్చి ఒక్క ఊపున ముందుకు పరిగెత్తి ఆ గొట్టం ఆధారంగా గాలిలోకి లేచి ఏడడుగులు పైన ఉన్న ఆ ఫెన్సింగ్‌ను లంఘించి అవతలివైపుకు పారిపోతాడు. ఈ దృశ్యాన్ని కోదండంగారు చూస్తాడు. ఎలాగైనా సరే వాడిని ఒలెంపిక్స్ లెవల్‌కి తీసుకువెళ్ళి ప్రపంచంలోనే పోల్‌వాల్ట్‌లో నెంబర్ వన్‌గా తయారుచేయాలని నిర్ణయించుకుంటాడు. వాడికోసం ప్రతిరోజూ స్టేషన్ అంతా గాలిస్తుంటాడు. వాళ్ళెవరూ కనిపించరు. వాళ్ళను గురించి రైల్వే ఉద్యోగుల్ని వాకబు చేస్తాడు. ఒకరోజు సురేశన్ అనే టికెట్ కలెక్టర్ నిప్పుకోడిగాడ్ని పట్టుకొని కోదండం గారి ఇంటికి తీసుకువెళతాడు. అక్కడ దృశ్యం తారుమారు అయి ఉంటుంది. కోదండంగారికి మైల్డ్ పెరాలసిస్ స్ట్రోక్. స్పృహలో ఉండడు. రాంచీలో ఉన్న వాళ్ళ పెద్దబ్బాయి వైద్యం నిమిత్తం తండ్రిని వెంట తీసుకువెళ్ళే ప్రయత్రంలో ఉన్నాడు. గంటలో ట్రైను. ఇదీ పరిస్థితి...

పూర్ణాహుతి, దుర్దినం, శుక్రవారం కథలది సనాతన వృత్తుల వ్యధల ప్రపంచం. 'పూర్ణాహుతి' శనిదానాలు, మృత్యుంజయ దానాలు గ్రహించి జీవించే ఒక బీద బ్రాహ్మడి వ్యధ.
ఆ పేద బ్రాహ్మడి కథనంలోనే చెప్పాలంటే- "పై పంచె దులిపి భుజాన వేసుకుని వెళ్ళి కూర్చున్నాను. ఆ దంపతులిద్దరూ నా కాళ్ళు కడిగి ముందు శనిదానం ఇచ్చారు. కాసిని బియ్యమూ, తిలలూ, రూపా యి బిళ్ళా.. ఒక విస్తరిలో వుంచి దానం ఇచ్చారు. నేనది గ్రహిస్తూ మనసులో 'బాబూ, మీరు పిల్లాపాపలతో వర్థిల్లాలి. మీకు సకల సంపదలూ సమకూరాలి. శని మీకు అడ్డం రాడు. శని తాలూకు వక్రదృష్టి ఏమైనా ఉంటే ఇదిగో ఈ దానంతో నాకు సంక్రమిస్తుంది.. దాన్ని నేను నెత్తిన వేసుకుంటాను' అనుకున్నాను.తరువాత వెంటనే మృత్యుంజయ దానం యిచ్చారు. కాసిని బియ్యమూ, యింత పత్తీ, నూనెలో ముంచి తీసిన ఒక యినుప మేకూ, రూపాయి నాణెం.. నేను ఆ దానం గ్రహిస్తూ మళ్ళీ 'రానివ్వండి బాబూ! మీ కుటుంబం లో ఎవరికైనాఅపమృత్యువు రాసి పెట్టి వుంటే, ఇదిగో, ఈ దానం ద్వారా దాన్ని నాకు సంక్రమింప జెయ్యండి. మీరు సుఖంగా ఉం డండి' అనుకున్నాను.''

అతను కేవలం అనుకోవటంతోనే ఆగడు. వాళ్ళందరి శనీ, అపమృత్యువూ తనను ఆవరిస్తాయని విశ్వసిస్తాడు. ఈ క్షుద్రదానాలు అందుకునే విషయంలో ఈ బస్తీలోనే అతనికి ఎవరూ పోటీ లేరు. కానీ పేరిశాస్త్రితో ఏర్పడిన పొరపొచ్చం వల్ల పోటీ వస్తుంది. పేరిశాస్త్రి ఈ పనికి రామేశం అనే యువకుడ్ని రంగంలోకి దింపుతాడు. అతనికి తిండికి కూడా గడవని దరిద్రం దాపురిస్తుంది. ఆకలి కడుపుతో నడిచి వెళుతుంటే తుప్పు పట్టిన ఒక పాత మేకు అతని కాలిలో దిగబడుతుంది. జ్వరం వస్తుంది. డాక్టరు దగ్గరికి వెళతాడు. తిరిగి వస్తుండగా రామేశం ఎదురవుతాడు. ఈ క్షుద్ర దానాలు గ్రహించే వృత్తిలోకి దిగవద్దని నానావిధాలుగా నచ్చచెపుతాడు. నాకీ ప్రపంచంలో నా అనేవాళ్ళు లేరు. నీకు తమ్ముడు ఉన్నాడు. వాడిని చదవించాలంటున్నావు. మీరిద్దరూ బతికి బట్టకట్టాలనుకుంటే ఈ వృత్తి మానుకో అంటాడు. రామేశం వినడు. అతన్నీ, అతని తమ్ముడినీ, పేరిశాస్త్రినీ తిట్టి, శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోతాడు. జ్వరం తీవ్రమవుతుంది. ఒళ్ళు తెలియని స్థితి. ఎవరో వచ్చి శుశ్రూష చేస్తున్నట్టు అనిపిస్తుంది. బలవంతంగా కళ్ళుతెరిచి చూస్తే తనకు సేవ చేస్తూ ఎదురుగా రామేశం.. అదే రోజు జరిగిన రోడ్డు ఏక్సిడెంట్‌లో రామేశం చచ్చిపోతాడు. అంత జ్వరంలోనూ ప్రమాద స్థలానికి వెళ్ళి, నీ తమ్ముడి చదువు బాధ్యతను నేను తీసుకుంటానని మనసులో అనుకుంటాడు- కథలో ప్రథమ పురుషలో తారసిల్లే ఈ బీద బ్రాహ్మడు.

కోరిక, కళ్ళజోడు కథలు ఆవిష్కరించే ప్రపంచం మరో రకం. అల్పజీవుల స్వల్పమైన కోర్కెల చుట్టూ అలుముకుని వుండే విషాదం వీటిలో ప్రధానాంశం.
చీకటి, సతీసావిత్రి, సెక్స్ వర్కర్స్ ప్రపంచాలు. నిప్పుకోడి, ఏస్‌రన్నర్ వంటివి పలు ప్రపంచాల సమాహారం. వరల్డ్ ఛాంపియన్‌గా ఖ్యాతి గడించిన గామా పహిల్వాన్ తన చివరి రోజుల్లో తిండికి గడవక చనిపోయాడని తెలిసి ఆయన 'నిప్పుకోడి' కథ రాశాడు. ఏస్‌రన్నర్ కూడా డిటో డిటో.. దగ్ధగీతం రచన వెనుక కూడా వాస్తవ జీవితాలు ఉన్నాయి.

సుబ్బరామయ్య కథల్లో కేవలం ఆఖ్యానాలు మాత్రమే కాదు. ఉపాఖ్యానాలూ ఉంటాయి. ఈ ఉపాఖ్యానాలన్నీ దాదాపు విషాద ప్రేమ గాథలే. పూర్ణాహుతి, ముసురు, దగ్ధగీతం, సతీసావిత్రివంటి అనేక కథలు ఇందుకు సజీవ నిదర్శనాలు. ఈ యాభయ్యేళ్ళ కాలంలో ఆయన మహా అయితే ఓ వంద పై చిలుకు కథలు రాసి ఉంటారు. కానీ అన్ని కథలు విస్మరించటానికి వీల్లేనివే కావటం విశేషం. నీళ్ళు, చీకటి, ముసురు, నిప్పుకోడి, పూర్ణాహుతి, గాలి, కళ్లజోడు, అలజడి, సతీసావిత్రి, దుర్దినం, కోరిక, ఏస్‌రన్నర్, దగ్ధగీతం, శుక్రవారం, కొళందవేలు బొమ్మ, చిలిపితనం, చుక్కమ్మకథ, లేచినవేళ, కోదండంగారి కల, చింపిరి, చిలకహంస, పీట, ఇంగువ, తాతిగాడి చొక్కా, మరో వీధి పాప- ఇవన్నీ నిస్సందేహంగా అంతర్జాతీయ వేదికపై సగర్వంగా నిలబడగలిగిన కథలు. తెలుగుతోపాటు భారతీయ కథానికా సాహిత్యానికి సయితం ప్రాతినిధ్యం వహించగల సత్తా ఉన్న కథలు. తన 75వ పుట్టిన రోజు జరుపుకోబోతున్న సుబ్బరామయ్యకు నా ప్రేమపూర్వక ముబారక్!


2 comments:

  1. పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి కథలపై చక్కని విశ్లేషణ. చాలాకాలం క్రితం అజంతా.. పెద్దిభొట్ల సాహిత్యం గురించి రాసిన వ్యాసం గుర్తొచ్చింది!

    ReplyDelete
  2. చాలా రోజులకి మీ పోస్ట్ సార్,..మంచి కథా రచయితను పరిచయం చేసారు,.మీ పుట్టుమచ్చ కవితను పోస్ట్ చేయగలరా.........

    ReplyDelete