Monday, 7 October 2013

ఒక అదృశ్యం - ఖాదర్ మొహియుద్దీన్



ఒక అదృశ్యం

-----------------------------------------------------------------

ఖాదర్ మొహియుద్దీన్

----------------------------




నా పసిదినాల ప్రాంగణంలో

అక్కడ ఒక పేద్ద వేపచెట్టు

చూపులకందని చిటారుకొమ్మల గుబురుల్లో

ఒక పేరు తెలియని పక్షిగూడు

దాని దరిదాపుల్లోనే దేవళంలా లేచిన

చిత్రమైన ఒక  చీమలపుట్ట

నా కళ్ళు గప్పి తెలివిగా రాత్రిపూట 

తెలుగు పాఠ్యపుస్తకం పుటలోంచి 

మెత్తగా పాక్కుంటూ వెళ్ళి

పక్షి గుడ్లకోసం మాటు వేసే తాచుపాము



ఇప్పుడు అక్కడ ఒక పెద్ద మేడ

తన పూర్వీకుల జాడ కోసం 

ఆకాశంలో  అదే పనిగా 

గిరికీలు కొడుతూన్న పక్షి

తండోపతండాలుగా

విసుగూ విరామం లేకుండా 

ఒక వాల్మీకి కోసం వెతుకులాడుతూన్న

ఎడతెగని  చీమలదండు   

చెట్టు పునాదుల మీద పరచుకున్న

పడక గది  పీడకలలో 

పడగవిప్పిన ఒక నల్లత్రాచు

----------------------------

Wednesday, 18 September 2013













అనువాదం అంటే ... 



కవిత్వం చదవటం అంటే

వంతెనమీంచి నదిని దాటేయటం...

అనువదించటం

కవితోపాటు ఆ నదిలో మునిగిపోవటం...

చదవటం కూడా ఒక రకంగా అనువదించడమే 

అదే భాషలోంచి తిరిగి అదే భాషలోకి...

అనువాదం మౌలిక రచనకి భిన్నమయిందీ కావచ్చు...

ఒకే రచనకి వంద అందమయిన అనువాదాలు వుండవచ్చు...

ఒక అందమయిన అనువాదం అనువదించబడిన భాషలో తిరిగి ఒక మౌలిక రచనగా గుర్తింపును అందుకోవచ్చు..

Friday, 12 July 2013

కలం


కలం

--------

వొణుకుతూన్న చేతివేళ్ళతో

కలాన్ని పట్టుకో

ఈ ప్రపంచం సమస్తం

ఒక ఆకాశపు రంగు సీతాకోకచిలుక

దాన్ని పట్టేసేందుకు పన్నిన వ్యూహం

ఈ పదజాలం అని విశ్వసించు

పరిపూర్ణంగా...


అరబీ మూలం:
ముహమ్మద్ అల్ - గజ్జీ